Sri Ranganatha Swamy Temple
-
ఇల వైకుంఠం శ్రీరంగం
శ్రీరంగనాథుని దేవాలయానికి సంబంధించి మరే దివ్యదేశానికి లేని ప్రత్యేకతలు కొన్ని ఉన్నాయి. ఈ దివ్యక్షేత్రం 156 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. ఇక్కడ ఉన్నన్ని ్ర΄ాకారాలు, గోపురాలు, మండ΄ాలు, సన్నిధానాలూ మరే దేవాలయంలోనూ లేవు. దేశంలోని అతి పెద్ద దేవాలయాలలో ఒకటిగా దీనిని పేర్కొనవచ్చు. శ్రీరంగనాథుని దేవాలయానికి సంబంధించిన చాలా విషయాలు ‘పెరియ’ అనే విశేషణంతో కూడుకుని ఉన్నాయి. ‘పెరియ’ అంటే పెద్ద అని అర్థం. ఉదాహరణకు ఈ దేవాలయాన్ని ‘పెరియకోయిల్’ అని, స్వామివారిని ‘పెరియపిరాట్టి’ అని, శ్రీరంగాన్ని ‘పెరియ అరంగం’ అని, దేవాలయంలో వాయించే మంగళ వాద్యాలను ‘పెరియ మేళమ్’ అని, స్వామివారికి నివేదించే వంటకాలను ‘పెరియ అవసరం’ అని, నివేదనకు తయారు చేసిన పిండి వంటలను ‘పెరియ పణ్యారం’ అనీ వ్యవహరిస్తారు. స్వామివారి వాహనమైన గరుత్మంతుని ‘పెరియ తిరువడి’ అని అంటారు. స్వామివారికి పిల్లనిచ్చిన విష్ణుచిత్తుల వారిని ‘పెరియాళ్వారు’ అన్న పేరుతో పిలుస్తున్నారు. స్వామివారి వాహనమైన గరుత్మంతుని ‘పెరియ తిరువడి’ అని అంటారు. స్వామివారికి పిల్లనిచ్చిన విష్ణుచిత్తుల వారిని ‘పెరియాళ్వారు’ అన్న పేరుతో పిలుస్తున్నారు.ఆళ్వార్లు కీర్తించిన నూట ఎనిమిది దివ్య దేశాలలో శ్రీరంగం ప్రధానమైనది. శ్రీరంగమే భూలోక వైకుంఠమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సర్వేశ్వరుడు స్వయంగా వ్యక్తమైన ఎనిమిది క్షేత్రాలలోప్రధానమైనది శ్రీరంగం. వైష్ణవ పుణ్యక్షేత్రాలుగా వినుతికెక్కిన ‘నాల్గు మండపాల’లో శ్రీరంగం ఒకటి. ఉభయ కావేరుల మధ్య అమరిన సుందర ద్వీపం శ్రీరంగం. కావేరి, కొళ్ళడం అనే రెండు నదులు శ్రీరంగానికి పూలదండలా ఇరువైపులా కొంతదూరం ప్రవహించి తిరిగి ఒకటిగా కలుస్తున్నాయి. తిరుచిరాపల్లికి ఎనిమిది కిలోమీటర్ల దూరాన ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవడానికి రైలు, రోడ్డు సదుపాయాలున్నాయి.శ్రీరంగనాథుని దేవాలయం చాలా ప్రాచీనమయింది. ఈనాడు మనం చూసే ఆలయానికి అంకురార్పణ 7వ శతాబ్దంలో జరిగింది. చోళ, పాండ్య, నాయక రాజులు దేవాలయానికి మరమ్మతులు, విస్తరణలు జరిపారు. పదమూడు అంతస్తులు గల ఈ రాజగోపురం 236 అడుగుల ఎత్తులో ఆసియాఖండంలోనే అత్యంత ఎత్తయిన గోపురంగా గుర్తించబడింది. ఈ నూతన రాజగోపురం ఆలయానికి దక్షిణ ద్వారంగా అమరి ఉంది.ఈ ఆలయంలో ఉన్న పుష్కరిణులలో ప్రధానమైనది చంద్ర పుష్కరిణి. ఆలయప్రాకార ఆవరణలలో నున్న గోపురాలు జీవకళ ఉట్టిపడే శిల్పాలతో ఆలయానికి అలంకారాలై ఉన్నాయి. దేవాలయానికి ఉన్న సప్తప్రాకారాలు సప్తలోకాలకు సంకేతాలుగా ఉన్నాయి. ప్రణవాకార విమానం కింద ఉన్న గర్భాలయంలో శ్రీరంగనాథుడు ఐదు తలలతో పడగెత్తి ఉన్న ఆదిశేషుని పాన్పుపై శయనించి కుడి చేత్తో తన శిరస్సు చూపిస్తూ అన్ని లోకాలకూ తనే నాధుడునని చెప్తున్నట్టున్నారు. ఎడమ చేతితో పాదాలను చూపుతూ శరణన్న వారిని రక్షిస్తానని అభయమిస్తున్నారు. మూలమూర్తికి కొంచెం దిగువున ఉన్న ఒక పీఠంపై ఉత్సవమూర్తి చతుర్భుజుడై ఉన్నారు. వారిని ‘నంబెరుమాళ్ళు’ అని అంటారు.ఉత్సవమూర్తి పై కుడి చేతితో ప్రయోగ చక్రాన్ని ధరించి ఉండగా కింది కుడిహస్తం అభయ ముద్రలో ఉంది. శంఖాన్ని పైఎడమ చేతిలోను, కింది చేతితో గదను ధరించి అందమైన చిరునవ్వు మోముతో శోభాయమానంగా దర్శనమిస్తున్నారు.గర్భాలయానికున్న ప్రదక్షిణ మార్గాన్ని ‘తిరువాణ్ణాళి’ అని, దానికి ముందున్న మంటపాన్ని రంగ మంటపమనీ, గాయత్రీ మంటపమని వ్యవహరిస్తారు. ఈ మంటపంలో నున్న 24 బంగారు స్తంభాలూ, గాయత్రీ మంత్రంలో ఉన్న 24 అక్షరాలకు సంకేతాలని పెద్దలు చె΄్తారు. వీటిని ‘తిరుమణ్ణాత్తూణ్’ అని అంటారు. స్వామివారు ప్రసాదాలు ఆరగించే మంటపానికి చందన మంటపమని పేరు. గర్భాలయానికి బయట ఉన్నప్రాకారంలో ద్వారపాలకులు, యాగశాల, సేన మొదలియార్ల సన్నిధి, పగల్ పత్తు మంటపం, చిలుకల మంటపం, కణ్ణ¯Œ సన్నిధి ఉన్నాయి.మూడవప్రాకారంలో స్వర్ణమయంగా ఉన్న ధ్వజస్తంభం, డోలోత్సవ మంటపం, వైకుంఠ ద్వారం చూడవచ్చును. నాల్గవప్రాకారంలో బ్రహ్మాండమైన గరుడ సన్నిధి ఉంది. 12 అడుగుల ఎత్తులో మూలస్థానానికి దూరంగా స్వామి వారి పిలుపు కోసం వేచి ఉన్నట్లు అయిదు అడుగుల ఎత్తయిన పీఠంపై గరుడాళ్వారు కూర్చుని ఉన్నారు. ఈప్రాకారంలో ఆళ్వార్ల సన్నిధానాలు చాలా ఉన్నాయి. ధన్వంతరికి ప్రత్యేక సన్నిధానం ఉండడం ఇక్కడ ఒక విశేషం. అయిదవప్రాకారంలో ఆండాళ్ళ సన్నిధి, శ్రీరంగనాచ్చియార్ల సన్నిధానం, దానికి ఎదురుగా కంబర్ మండపం, ఉన్నాయి. ఈప్రాకారంలో ముఖ్యమైన కట్టడం వేయికాళ్ళ మండపం.ఈ ఆలయానికి సంబంధించిన మరో విశేషం, ఆలయ విమానగోడలపై చిత్రితమై ఉన్న విష్ణుపురాణం, 108 దివ్యదేశాలకు సంబంధించిన దృశ్యాల వివరణ తెలుగు లిపిలో ఉండడం గమనార్హం. ఉగాది మొదలయిన పండుగలను చాంద్రమానం ప్రకారంగా జరుపుకుంటున్నారు.ఈ క్షేత్రంలో మరో ప్రత్యేకత స్వామి వారికి జరిగే సుప్రభాత సేవలో పాల్గొనేవారు తరతరాలుగా ఒకే కుటుంబానికి చెందిన వారై ఉండడం ఒక విశేషం. వీరిని ‘శ్రీపాదం వోర్’ అని అంటారు.శ్రీరంగక్షేత్రంలో సంవత్సరంలో నాలుగు బ్రహ్మోత్సవాలు జరుపుతున్నారు. శ్రీరంగంలో నిత్యమూ ఉత్సవ సంరంభమే. ఉత్సవాల సమయంలో శ్రీరంగం అల వైకుంఠపురాన్ని తలపింపజేస్తుంది.శ్రీరంగనాచ్చియార్లకు స్వామివారి ఉత్సవాలైన తర్వాత సంబరాలు జరుపుతారు. భక్తులు స్వామివారి ఉత్సవాల వైభవాన్ని తిలకించి శ్రీరంగేశ పాదార్చనతో పులకించిపోతారు. శ్రీరంగాన్ని ఒక్కసారి దర్శిస్తే 108 దివ్యక్షేత్రాలను దర్శించినంత పుణ్యం దక్కుతుందని భక్తుల విశ్వాసం. – స్వాతీభాస్కర్ -
తిరుచ్చిలో చూడాల్సిన అద్భుత పర్యాటకప్రదేశాలివే..!
చారిత్రాత్మకంగా,తిరుచిరాపల్లిని సాధారణంగా ఆంగ్లంలో "ట్రిచినోపోలీ" అని పిలుస్తారు. వాడుకంలో ఎక్కువగా "ట్రిచీ" లేదా "తిరుచ్చి" అని పిలుస్తారు. అధికారికంగా మాత్రం ప్రభుత్వ కార్యాలయాల్లో తిరుచురాపల్లి అని ఉంటుంది. ఇక్కడ ఐకానిక్ ఆలయంగా ప్రసిద్ధి చెందింది శ్రీ రంగనాథ స్వామి దేవాలాయం. తమిళనాడులోని అత్యంత ప్రసిద్ధ ఆలయ పట్టణాలలో ఒకటిగా పేరుగాంచింది ఈ తిరుచ్చి. ఇక్కడ ఉన్న అద్భుతమైన వాస్తు శిల్ప కళా సంపదను చూడవచ్చు. ఇది గొప్ప వారసత్వ సాంస్కృతికి నిలయం. ఆ నగరంలో చూడాల్సిన అద్భుత పర్యాటక ప్రదేశాలివే..శ్రీరంగనాథ స్వామి ఆలయం..తిరుచ్చి ఐకానిక్ ఆభరణంగా శ్రీరంగనాథ స్వామి ఆలయం అలరారుతుంది. ఈ ఆలయం సుమారు 156 ఎకరాల్లో ఏడు ప్రాకారాలతో నిర్మించారు. ఆలయానికి ప్రధాన ఆకర్షణగా 45 నుంచి 75 మీటర్ల ఎత్తు వరకు ఆలయ గోపురాలు ఉంటాయి. ముఖ్యంగా మూలల్లో చెక్కబడిన సంగీత స్థంబాలు, మందిరాలు, శతబ్దాల నాటి విగ్రహాలతో కూడి ఆలయాలు మనసును దోచుకునేలా ఉన్నాయి. వెయ్యి స్తంభాల హాలు మిమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడ ప్రతినిత్యం ఆలయ కైంకర్యాలు నిరాటకంగా జరుగుతాయి.మరో అద్భుత ఆలయం రాక్‌ఫోర్ట్..రాక్‌ఫోర్ట్ అనేది 273 అడుగుల ఎత్తైన రాతిపై ఉన్న కోట. ఇది ఏకశిలలతో నిర్మితమైన గుహ దేవాలయాలు. వీటిని తొలుత పల్లవులచే నిర్మిచబడినప్పటికీ..తర్వాత ముధురై నాయకులు, విజయనగర పాలకులు పునర్నించారు. ఇక్కడ లింగ రూపంలో ఉన్న శివుడు థాయుమానవర్గా పూజలందుకోగా, పార్వతి దేవి మట్టవర్ కుజలమ్మాయిగా కొలుచుకుంటారు భక్తులు. ముందుగా రాతి కోట పాదాల వద్ద ఉన్న మాణిక్క వినాయకర్ ఆలయం దర్శంచుకుని, శివ పార్వతులు ఆలయాలను దర్శిస్తారు భక్తులు. ఈ రాతి శిలను ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనదిగా నమ్ముతారు. ఈ శిలా కోట చుట్టు ఉన్న కావేరి నదం దారంలా చుట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. సైకిల్‌పై చుట్టి రావచ్చు కూడా..తిరుచ్చిలో ఉన్న పర్యాటక ప్రదేశాలను సైకిళ్లపై చుట్టి రావచ్చు కూడా. తెల్లవారుజాము నుంచి టూరిస్ట్ గైడ్ ఆధ్వర్యంలో సైకిల్ పర్యటనను ప్రారంభిస్తారు. 18వ శతాబ్దపు జెస్యూట్ క్వార్టర్స్ నుంచి దక్షిణాసియాలోని తొలి ప్రింటింగ్ ప్రెస్‌లు, బ్రిటిష్ కాలం నాటి టౌన్సైడ్ మాన్షన్లను చుట్టిరావొచ్చు. తిరుచ్చి పట్టణంలో ఐకానిక్‌గా ఉండే కావేరి వంతెన మిమ్మల్ని ఉత్సహపరిచేలా స్వాగతం పలుకుతుంది. ఆ మార్గ మధ్యంలో ఉండే వివిధ రుచులతో కూడిన బ్రేక్‌ఫాస్ట్‌లు మిమ్మల్ని ఆస్వాదించమన్నట్లుగా నోరూరిస్తాయి. ఒంటరి మహిళా ప్రయాణికులకు కూడా ఇది సురక్షితమైన నగరంగా పేరుగాంచింది. కాంస్య కళాకారులు, స్తపతులు..స్వామిమలైలోని పురాతన ఆలయ కళ గ్రామం చూస్తే..మీ కళ్ల ముందే రాతి శిల్పాలు పుట్టుకొస్తాయని రాసి ఉండటాన్ని చూడొచ్చు. ఇక్కడ మంచి నైపుణ్యం కలిగిన కాంస్య కళాకారులు, శిల్పులను చూడొచ్చు. ఇక్కడ శిల్పులు పవిత్ర క్షేత్రాల నంచి తీసిన మట్టి నమునాలను మైనపు కళాఖండాలుగా మార్చి, అగ్ని ఆచారాలతో నిండిన ఆధ్యాత్మిక లాస్ట్ వాక్స్ మెటల్ కాస్టింగ్ ప్రకియ ద్వారా మెరిసే విగ్రహాలుగా రూపొందించారు. ఇక్కడ శిల్పశాస్త్రానకి సంబధించిన అద్భుతమైన స్తపతులు దర్శనమిస్తారు. ముఖ్యంగా, మట్టి, మైనంతో చక్కటి విగ్రహాలను తయారు చేయడం వారి ప్రత్యేకత. పచ్చదనానికి మారుపేరుగా ఉండే ఉద్యానవనాలు, ఎకోపార్క్‌లు..ప్రశాంతమైన కావేరి నది చుట్టుతా పచ్చని ఉద్యానవనాలు పర్యాటకులను సేదతీరమని పిలుస్తున్నట్లుగా ఆహ్లదకరంగా ఉంటాయి. పక్షి జాతులకు సంబంధించన అభయ అరణ్యలు, ఎకో పార్క్‌లు ప్రదాన చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు. కావేరి నదిలో ఉండే చిన్న ద్వీపాల మాదిరగా ఉండే గ్రామాలను బోటింగ్‌తో చుట్టి వచ్చే సదుపాయం కూడా ఉంది. ఇక్కడి పార్కుల్లో జంతు శిల్పాలను పర్యాటకులను కట్టిపడేస్తాయి. హెర్బల్ గార్డెన్లు, పచ్చిక శిల్పాలు, పిల్లల ప్లే జోన్లు తదితర పర్యాటక ప్రదేశాలకు నెలవు ఈ తిరుచ్చి నగరం. తప్పక దర్శించి తరించాల్సిన ప్రదేశం ఇది.(చదవండి: వాతావరణ యాంగ్జైటీ అంటే ఏంటి..? ఎదుర్కోవడం ఎలా..?) -
రంగనాథుని సేవలో మోదీ
సాక్షి, చెన్నై/ తిరుచిరాపల్లి: కొద్దిరోజులుగా శ్రీరాముడి జీవితంతో ముడిపడి ఉన్న ఆలయాలను సందర్శిస్తున్న ప్రధాని మోదీ అందులో భాగంగా శనివారం తమిళనాడులోని ద్వీప పట్టణం ‘శ్రీరంగం’లోని ప్రఖ్యాత శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. శనివారం ఉదయం ధోతి, అంగవస్త్రం, రుద్రాక్షమాలతో తమిళ సంప్రదాయ ఆహార్యంలో ఆలయానికి విచ్చేసిన ప్రధాని మోదీకి ఆలయ నిర్వహణ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వారికి వేదాలు పఠిస్తూ పండితులు తోడు వచ్చారు. మోదీ ఆ తర్వాత రంగనాథస్వామివారిని దర్శించుకున్నారు. రామానుజాచార్య, చక్రత్తాళ్వార్ సన్నిధాలను సందర్శించారు. ఆలయ ఏనుగు ఆండాళ్ ఆశీ్వరాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏనుగు మౌతార్గాన్ వాయిస్తూ ఆహ్వానం పలకడం విశేషం. భారత ప్రధాని రంగనాథ ఆలయాన్ని దర్శించుకోవడం ఇదే తొలిసారి. 12వ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత తమిళ కవి కంబ రచించిన కంబ రామాయణాన్ని ఈ సందర్భంగా మోదీ పారాయణం చేశారు. తమిళనాడులోని ప్రఖ్యాత వైష్ణవదేవాలయాల్లో రంగనాథాలయం ముఖ్యమైనది. 108 దివ్య దేశాల్లో ఒకటిగా ప్రసిద్ధికెక్కింది. రామేశ్వరం ఆలయంలోనూ... శనివారం మధ్యాహ్నం మోదీ రామేశ్వరం వెళ్లారు. అగ్నితీర్థం బీచ్‌లో పుణ్యస్నానం ఆచరించారు. 22 పవిత్ర తీర్థాలలో స్నానం చేశారు. ప్రాచీన శివాలయమైన ప్రఖ్యాత రామనాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. భక్తి, భజన కార్యక్రమాల్లో పాల్గొని భజన చేశారు. రామయణ గాథతో ఈ ఆలయానికి గాఢానుబంధం ఉంది. అనంతరం పట్టణంలోని బీజేపీ కార్యకర్తలు, స్థానికులతో మోదీ మాట్లాడారు. రాత్రి రామేశ్వరంలోని రామకృష్ణ మఠంలో బస చేశారు. ఆదివారం ఉదయం ఆయన మళ్లీ రామేశ్వరం అగ్ని తీర్థంలో పవిత్ర స్నానం చేసి మరోమారు రామనాథస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం సమీప గ్రామంలోని కోడండరామస్వామి దర్శనంతో మోదీ మూడు రోజుల తమిళనాడు పర్యటన పూర్తవుతుంది. తిరుచిరాపల్లిలో రోడ్ షో తిరుచిరాపల్లి పురవీధుల్లో జనం మోదీకి ఘన స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా పూలవర్షం కురిపించారు. వారందరికీ వనక్కమ్ అంటూ మోదీ అభివాదం చేశారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆ మార్గమంతా మార్మోగిపోయింది. అక్కడి నుంచి శ్రీరంగం వైపుగా మోదీ రోడ్‌షో కొనసాగింది. -
తిరుపతి పాత పేర్లు తెలుసా? ఆ ఆధ్యాత్మిక నగరం ఆవిర్భవించింది నేడే!
తిరుమలను తలచుకుంటే.. గోవింద నామం మనస్సులో మార్మోగుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం మనో నేత్రం ఎదుట ప్రత్యక్షమవుతారు. ఏడు కొండలవాడు కొలువైన తిరుమల ఆలయంతోపాటు ఆయన పాదాల చెంత ఉన్న తిరుపతి నగరం ఆవిర్భావమూ ఆసక్తికరమే. కలియుగం (కలియుగం మొదలై ఫిబ్రవరి 13వ తేదీ నాటికి 5,125 ఏళ్లు పూర్తయింది)లో శ్రీనివాసుడు ఏడు కొండలపై శిలారూపంలో కొలువుదీరగా.. ఆ స్వామిని కొలిచే భక్తుల ఆవాసాల కోసం ఏడు కొండల దిగువన తిరుపతి వెలసింది. పూర్వం తిరుమల చుట్టూ అడవులు, కొండల నడుమ అలరారే శ్రీవారి ఆలయం మాత్రమే ఉండేది. భక్తులు క్రూర జంతువుల భయంతో గుంపులుగా కాలినడకన తిరుమల యాత్ర చేసేవారు. పూర్వం శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణ, ధ్వజారోహణం మాత్రమే తిరుమల కొండపై నిర్వహించేవారు. వాహన సేవలన్నీ తిరుచానూరులోనే నిర్వహించేవారు. ప్రతిరోజూ తిరుచానూరు నుంచి తిరుమలకు వెళ్లి రావటం ఇబ్బందిగా ఉండటంతో అర్చకులు కపిల తీర్థం వద్ద నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రాంతం పేరు కొత్తూరు, కోటవూరుగా పిలిచేవారు. – (సాక్షి, ఏపీ నెట్వర్క్) రామానుజాచార్యులచే శంకుస్థాపన శ్రీనివాసుని పూజా కైంకర్యాలను వైఖానస సంప్రదాయంలో కొనసాగించాలని నిర్దేశించిన జగద్గురువు రామానుజాచార్యులు అర్చకుల నివాసాల కోసం తిరుచానూరు–తిరుమల మధ్య నేటి పార్థసారథి ఆలయ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. శ్రీరంగం నుంచి శ్రీరంగనాథస్వామి శిలావిగ్రహాన్ని తెప్పించి పార్థసారథి సన్నిధికి పక్కన ప్రతిష్టించేందుకు ఆలయాన్ని నిర్మించారు . ఆ విగ్రహాన్ని తరలించే సమయంలో స్వల్పంగా దెబ్బ తినటంతో దాన్ని పక్కన పెట్టి.. ఆ ఆలయంలో గోవిందరాజస్వామిని తిరుమలేశుని ప్రతిరూపంగా ప్రతిష్టించారు. పక్కనపెట్టిన రంగనాథస్వామి విగ్రహం ప్రస్తుతం మంచినీళ్ల కుంట ఒడ్డున దర్శనమిస్తోంది. ఆ తర్వాత 1130వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన గోవిందరాజస్వామి ఆలయం నాలుగు వైపులా మాడ వీధులు, అందులో అర్చకుల నివాసాలకు రామానుజాచార్యులు శంకుస్థాపన చేశారు. ఆ బ్రాహ్మణ అగ్రహారాన్నే తర్వాత గోవిందపట్నంగా.. రామానుజపురంగా పిలిచేవారు. ఆ తరువాత 1220–40 మధ్యకాలం నుంచి తిరుపతిగా పేరొందింది. అప్పటినుంచి తిరుపతిలో ఆవాసాలు, ఆలయాలు పెరుగుతూ వచ్చి ఆధ్యాత్మిక నగరంగా రూపుదిద్దుకుంది. 120 సంవత్సరాల సుదీర్ఘ జీవితాన్ని గడిపిన రామానుజాచార్యులు మూడుసార్లు తిరుమలకు వచ్చారని ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఆయన తన 112వ ఏట గోవిందరాజస్వామి విగ్రహ ప్రతిష్ఠ, మాడ వీధులకు శంకుస్థాపన చేశారు. దీని ప్రకారం తిరుపతి ఆవిర్భవించి ఈ నెల 24వ తేదీకి 893 సంవత్సరాలు అవుతోంది. వెలుగులోకి తెచ్చిన భూమన వెలుగుచూసిన అంశాలపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సమగ్ర అధ్యయనం చేయించి 2022 ఫిబ్రవరి 24న తొలిసారిగా తిరుపతి 892వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ ఏడాది టీటీడీ, తిరుపతి నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో 893వ పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్టు భూమన ప్రకటించారు. ఆ వేడుకల్లో భాగంగా నగర వాసులందరూ భాగస్వాములయ్యే విధంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు నాలుగు మాడవీధుల్లో మహా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పరమ పవిత్రం తిరుపతి ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పరమ పవిత్రమైనది. ముక్కోటి దేవతలు శ్రీగోవిందరాజస్వామిని కొలుస్తారు. ఇక్కడ స్థానికులతో పాటు అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వారు ఉన్నారు. తిరుపతి ప్రాముఖ్యత గురించి తెలియజేయాలన్నదే నా తపన. ప్రతి ఒక్కరూ నగర ప్రాభవాన్ని కాపాడుకోవాలి. తిరుపతి వైభవాన్ని చాటిచెబుదాం. శ్రీవారి నిలయమైన తిరుపతి ఆవిర్భావ వేడుకలను కలిసిమెలసి జరుపుకుందాం. – భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యే, తిరుపతి -
‘నాకు సిగ్గేస్తుంది.. ఫోటోలు తీయొద్దని చెప్పు’
చెన్నై: మనుషులు ప్రైవసీకే విలువ ఇవ్వం.. ఇక జంతువుల ప్రైవసీని పట్టించుకుంటామా.. లేదు. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. ఎక్కడ పడితే అక్కడ. ఎప్పుడంటే అప్పుడు విపరీతంగా ఫోటోలు తీయడం సోషల్ మీడియాలో షేర్ చేయడం. ఇదే పని చాలామందికి. ఇక జంతువులను ఫోటోలు, వీడియోలు తీయడం కొందరికి చాలా సరదా. వాటికి ఇబ్బంది కలగనంతవరకు ఓకే. కానీ చిరాకు అనిపించింది అనుకోండి.. అప్పుడు మన ఫోటో గొడెక్కుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఏనుగుకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఫోటోలంటే సిగ్గుపడే ఆ ఏనుగు తనను ఫోటోలు తీయొద్దని చెప్పమంటూ మావటి దగ్గరకి వెళ్లి ఎంతో ముద్దుగా చెప్తుంది. ఆ వ్యక్తి ఏనుగును కన్విన్స్ చేసి.. ఫోటోలు దిగడానికి ఒప్పిస్తాడు. ప్రసుత్తం వీరిద్దరి సంభాషణకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. (చదవండి: గున్న ఏనుగుతో సెల్ఫీలు.. తల్లి ఏనుగు దాడి) ఆ వివరాలు.. ఈ వీడియో తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి ఆలయంలో తీశారు. ఇక దీనిలో కనిపించేది ఆండాల్ అనే ఆడ ఏనుగు. ఇక వీడియోలో ఓ గుమ్మంలో మావటి కూర్చుని ఉంటాడు. ఏనుగు అతడి దగ్గరకు వెళ్లి తన భాషలో మావటితో ‘ఫోటోలు తీయొద్దని చెప్పు.. నాకు సిగ్గేస్తుంది’ అని చెప్తుంది. అతడు ఏనుగు తొండాన్ని కౌగిలించుకుని.. ‘పర్లేదు.. వాళ్లు నీతో ఫోటో దిగాలని ఆశపడుతున్నారు. వెళ్లి దిగు’ అంటూ నచ్చజెప్పడం ఈ వీడియోలో చూడవచ్చు. ఇక మావటి అడిగిన ప్రశ్నలకు ఏనుగు తల ఊపుతూ సమాధానాలు ఇవ్వడం వీడియోలో హైలెట్. ఏనుగు-మావటిల మధ్య జరిగిన సంభాషణ తీరు చూసి నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. ‘‘ఎంత ముద్దుగా మాట్లాడుతుందో.. భాష తెలియకపోతనేం.. భావం అర్థం అవుతుంది కదా’’ అంటూ కామెంట్ చేస్తున్నారు. -
నిఘా నీడలో 'శ్రీరంగం'
తిరుచ్చి శ్రీరంగం శ్రీరంగనాథ స్వామి ఆలయ వెబ్సైట్ హ్యాక్‌కు గురైంది. దీంతో ఆలయ పరిసరాల్ని, శ్రీరంగం పట్టణాన్ని నిఘా నీడలోకి తెచ్చారు. చెన్నై: వైష్ణవ క్షేత్రాల్లో తిరుచ్చి శ్రీరంగం శ్రీరంగనాథ స్వామి ఆలయంలో ఒకటి. ఆధ్యాత్మికతకు నిలయంగా ఉన్న శ్రీరంగనాథ స్వామి ఆలయం అతి పెద్దప్రాకారంతో, దేదీప్యమానంగా కన్పిస్తుంటుంది. ఏడు ప్రాకారాలు, 21 గోపురాలు, 50 సన్నిధులు ఈ ఆలయంలో ఉన్నాయి. ఈ ఆలయంలో జీర్ణోద్ధరణ పనులు ముగిసి , కుంభాభిషేక వేడుకలు గతనెల కోలాహలంగా జరిగాయి. భక్తులు ఆలయానికి రాక పెరిగింది. వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు ఆలయం ముస్తాబు అవుతోంది. ఈ పరిస్థితుల్లో శనివారం ఆలయ వెబ్సైట్ హ్యాక్‌కు గురైంది. ఉదయం రెండన్నర గంటల సమయంలో వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన వ్యక్తులు, కశ్మీర్ కైవసం తమ లక్ష్యం అంటూ, పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి ఉండటంతో కలవరం బయలు దేరింది. దీంతో ఆలయ అధికారులు నగర పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సైబర్ క్రైం రంగంలోకి దిగింది. ఈ వెబ్ సైట్‌ను ఎక్కడి నుంచి హ్యాక్ చేశారో ఆరాతీస్తున్నారు. అదే సమయంలో వైకుంఠ ఏకాదశి వివరాలను ప్రజలకు అందించడం కష్టతరంగా మారింది. ఇక, ఈ హ్యాక్‌తో శ్రీరంగం ఆలయం, పరిసరాల్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇదే వరకే తిరుచ్చి కలెక్టర్ కార్యాలయానికి బాంబు బెదిరింపులు సైతం వచ్చి ఉన్న దృ ష్ట్యా, ముందు జాగ్రత్త చర్యగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆలయ పరిసరాల్లో తనిఖీలు ముమ్మరం చేసి ఉన్నారు. వైకుంఠ ఏకాదశి వేడుకలకు భారీ భద్రత నిమిత్తం మదురై నుంచి బలగాలను రంగంలోకి దించేందుకు నిర్ణయించి ఉన్నారు. ఇదిలా ఉండగా, చెన్నైలోని హిందూ మున్నని ప్రధాన కార్యాలయానికి సైతం బాంబు బూచి రావడంతో ఉత్కంఠ బయలు దేరింది. చింతాద్రి పేటలో ఉన్న ఆ కార్యాలయానికి సిమీ తీవ్ర వాదుల పేరిట వచ్చిన లేఖతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బాంబు దొరకనప్పటికీ, ముందస్తుగా భద్రతను కట్టుదిట్టం చేయక తప్పలేదు.