లెక్చరర్‌పై విద్యార్థుల దాడి
అన్నవరం : అల్లరి చేయవద్దని మందలించిన లెక్చరర్‌పై ఇద్దరు విద్యార్థులు మరో ఇద్దరితో కలిసి దాడి చేసిన ఘటన గురువారం అన్నవరంలోని శ్రీసత్యదేవ జూనియర్ కళాశాలలో జరిగింది. అన్నవరం పోలీసుల కథనం ప్రకారం.. జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం సాయంత్రం స్కూలు విద్యార్థినుల ఆటల పోటీలు జరుగుతున్నాయి. ఆ పోటీలను తిలకిస్తున్న ఆ జూనియర్ కళాశాల ఇంటర్(హెచ్ఈసీ) విద్యార్థులు మిరియాల నూకరాజు, కొల్లు తాతాజీ ఆటలాడుతున్న విద్యార్థినులను, అక్కడ ఉన్న వ్యాయామ టీచర్లను కామెంట్ చేశారు. ఇది గమనించిన కళాశాల బోటనీ లెక్చరర్ మలిరెడ్డి వేంకటరాజు ఆ విద్యార్థులను మందలించి అక్కడ నుంచి వెళ్లిపొమ్మని హెచ్చరించి పంపేశారు.
దీనిని అవమానంగా భావించిన విద్యార్థులు నూకరాజు, తాతాజీ తమ స్వగ్రామం రౌతులపూడి మండలం డి.జగన్నాథపురం వెళ్లి వారి అన్నలు మిరియాల అప్పలరాజు, కొల్లు లోవరాజును తీసుకుని గురువారం మధ్యాహ్నం కళాశాలకు వచ్చారు. ఆ సమయంలో లెక్చరర్ వేంకటరాజు స్టాఫ్‌రూమ్‌లో ఉండగా ఆయనను దుర్బాషలాడుతూ ఆ నలుగురూ దాడి చేశారు. అప్పుడు కళాశాలలో ఉన్న ఇతర లెక్చరర్లు, విద్యార్థినులు వారిని అడ్డుకోగా, వారినీ తోసేశారు. ఆ దాడిలో వేంకటరాజుకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆయన స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. లెక్చరర్ ఫిర్యాదుతో ఆ నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అన్నవరం పోలీసుస్టేషన్ అడిషనల్ ఎస్ఐ వై.వి.రామ్మోహనరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.