‘స్త్రీ శక్తి’కి గ్రహణం
సాక్షి, కొత్తగూడెం: స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలకు మండల స్థాయిలో వేదికలైన స్త్రీ శక్తి భవనాలకు గ్రహణం పట్టుకుంది. మండలాలకు ఈ భవనాలు మంజూరై రెండేళ్లయినా.. కొన్ని చోట్ల ఇంకా నిర్మాణాలు పూర్తికాక పోగా, మరికొన్ని చోట్ల నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోవడం లేదు. దీంతో ఐకేపీ పరిధిలో నిర్వహించే కార్యకలాపాలు అస్తవ్యస్తంగా సాగుతున్నాయి.
మండలానికో భవనం చొప్పున జిల్లా వ్యాప్తంగా 46 మండలాలకు 46 భవనాలు, మున్సిపాలిటీ పరిధిలో మరో 6 స్త్రీ శక్తి భవనాలను ప్రభుత్వం 2011 నవంబర్‌లో మంజూరు చేసింది. మొత్తం 52 భవనాలకు ఒక్కోభవనానికి రూ.25 లక్షల చొప్పున రూ.13 కోట్లను విడుదల చేసింది. జిల్లాలో 47,818 స్వయం సహాయక గ్రూపు(ఎస్‌హెచ్‌జీ)లున్నాయి. సంఘాల కార్యకలాపాలకు సంబంధించి సమావేశాల చర్చలకు వేదికగా ఈ భవనాలను నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగా పలుచోట్ల నిర్మాణ పనులు నత్తనడకగా సాగుతుండగా...పనులు పూర్తయిన చోట ప్రారంభానికి నోచుకోలేదు. మెప్మా పరిధిలో ఖమ్మం, మణుగూరు, కొత్తగూడెం, సత్తుపల్లి, పాల్వంచ, ఇల్లెందు మున్సిపాలిటీలకు ఈ భవనాలు మంజూరైతే కేవలం కొత్తగూడెం, సత్తుపల్లి, మణుగూరులో భవన నిర్మాణాలు పూర్తి అయ్యాయి. ఖమ్మం, పాల్వంచ, ఇల్లెందులో స్థలం దొరకలేదన్న కారణంతో ఈ నిర్మాణాలను అధికారులు మరువడం వారి నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. ఈ పట్టణాల్లో ప్రభుత్వ భూమిని అక్రమార్కులు దర్జాగా కబ్జా చేస్తున్నా చోద్యం చూస్తున్నారే తప్ప.. ప్రజాహిత భవనాలకు స్థల సేకరణలో శ్రద్ధచూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిర్మాణం పూర్తి అయినా మీనమేషాలు....
ఏజెన్సీలో పలు మండలాల్లో స్త్రీశక్తి భవనాల నిర్మాణం పూర్తి అయింది. అయితే రాజకీయ నాయకుల జోక్యంతో ఈ భవనాల ప్రారంభోత్సవానికి గ్రహణం పట్టింది. భద్రాచలం డివిజన్లో వెంకటాపురం మినహా మిగతా చోట్ల నిర్మాణాలు పూర్తి అయినా ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదు. గుండాల, వెంకటాపురం,కొణిజర్ల, కుక్కునూరు, మధిర, బోనకల్, చింతకాని, ఎర్రెపాలెం, తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో అసలు నిర్మాణమే పూర్తికాలేదు. మైదాన ప్రాంతంలోని పలు మండలాల్లో నిర్మాణం పూర్తి అయినా ప్రారంభోత్సవానికి అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు ఈ భవనాల ప్రారంభోత్సవానికి గడువులు పెడుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు. అయితే పూర్తి అయిన భవనాలు తమకు ఎప్పుడు అప్పగిస్తారోనని మండల మహిళా సమాఖ్యలు ఎదురుచూస్తున్నాయి. ప్రైవేట్ భవనాలకు నెలకు రూ.వేల చొప్పున అద్దె చెల్లిస్తున్నామని, నిర్మాణం పూర్తి అయినా భవనాలను ఎందుకు ప్రారంభించడం లేదని సమాఖ్యల సభ్యులు ప్రశ్నిస్తున్నారు.
నిధులున్నా నిర్లక్ష్యం..
ఈ భవనాలు మంజూరుకు నిధులు విడుదలైనా కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యంతో కొన్ని చోట్ల నిర్మాణాలు ముందుకు సాగడంలేదు. రెండేళ్లు గడిచినా సంబంధిత అధికారులు ఆయా కాంట్రాక్టర్లను హెచ్చరించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. అయితే నిర్మాణాలు పూర్తి అయిన చోట కాంట్రాక్టర్లు నాణ్యతను పాటించ లేదనే ఆరోపణలున్నాయి. భద్రాచలం ఏజెన్సీలో ఈ భవనాల నిర్మాణంలో నాసిరకం సిమెంట్‌ను వాడారని ఆరోపణలు వెలువడుతున్నాయి. నిర్మాణాలను పర్యవేక్షించాల్సిన అధికారులకు కాంట్రాక్టర్లు చేయి తడపడంతో ఇష్టారీతిన నిర్మించారని, ఇక ఈ భవనాలు మున్నాళ్ల ముచ్చటగా మారనున్నాయినే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.