ఆరాధ్య దేవతకు సమాధానమిస్తాడా?
ఆమె నటనకు మంత్రముగ్ధుడయ్యాడు....ఆమె అందానికి దాసోహమై భక్తుడిగా మారాడు. ఆమె నటించిన చిత్రాలను లెక్కలేనని సార్లు చూశాడు. అది రెప్ప వాల్చకుండా. ఆమే తన ఆరాధ్య దేవత అని భావించాడు. నీ ఆరాధకుడ్నీ... ఆస్వాదకుడ్నీ... నీ ప్రియభక్తుడ్నీ అంటూ ఇంజినీరింగ్ చదివే రోజుల్లోనే మూరలెక్క కొలిచాడు. ఆ దేవతనే హీరోయిన్గా పెట్టి సినిమా తీయాలని కలలు కన్నాడు. ఆతర్వాత చిత్ర రంగంలో ప్రవేశించి... మొదటి సినిమాతోనే ప్రఖ్యాత దర్శకుడిగా పేరుపొందాడు. ఆ క్రమంలో తన ఆరాధ్య దేవతతో సినిమా తీశాడు. ఆ తర్వాత కూడా ఆమెతో మరో సినిమా తీసి తన భక్తిని చాటుకున్నాడు. అయితే ఆ సినిమా అంతగా ఆడకపోయినా... తాను అనుకున్నది మాత్రం సాధించాడు. ఇప్పటికే ఆయన ఎవరో అర్థమైయ్యే ఉంటుంది. ఆయనే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆ ఆరాధ్య దేవత శ్రీదేవి. ఇక విషయానికి వస్తే ... ఆ ఆరాధ్య దేవత నుంచి ఆ భక్తుడికి నోటీసులు అందాయి.
ఎందుకంటే... సావిత్రి పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు రాంగోపాల్ వర్మ గత వారం ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్లు మీడియాలో హల్చల్ చేశాయి. దీంతో మహిళ సంఘాలు వర్మపై నిప్పులు కక్కాయి. దాంతో వర్మ 'సావిత్రి'ని పక్కన పెట్టి శ్రీదేవి పేరును ఖరారు చేశాడు. ఈ విషయం కాస్తా దేవత భర్తకు చేరింది. ఠాఠ్ నా భార్య పేరు పెట్టి సినిమా తీయటానికి ఎంత ధైర్యం అంటూ వర్మపై నిప్పులు చెరిగినట్లు సమాచారం. ఇంతేకాకుండా గతంలోనూ ఆరాధ్య దేవత భర్తపై జెలసీని పలుమార్లు భక్తుడు పబ్లిక్ గానే చాటుకున్నారు. దీనిని కూడా మనసులో పెట్టుకున్న దేవత భర్త వర్మపై నిప్పలు చెరిగినట్లు సమాచారం.
అదికాక భక్తుడిపై ఆరాధ్య దేవత శ్రీదేవికి కూడా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నటిగా అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన తన పేరు మీద సినిమా తీస్తాడా అంటూ దేవత.... భక్తుడిపై నిప్పులు కక్కింది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆమె తన న్యాయవాదులను సంప్రదించి భక్తుడికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై ఆ భక్తుడు ఎలా స్పందిస్తాడో చూడాలి. అంతా నా ఇష్టం... నా దృష్టి కోణంలో సినిమాలు తీస్తా... నా సినిమాలు చూస్తే చూడండి లేకుంటే మానేయండి అంటూ తరచుగా చెప్పే ఆ భక్తుడు... ఆ దేవతకు అదే సమాధానం చెబుతాడో లేక ఆమెకు ఆగ్రహం వచ్చిందని సినిమా పేరు మారుస్తాడో వేచి చూడాలి.