Srikakulam Parliament
-
సిక్కోలు ప్రగతే మా పథం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘‘ఏదో అభివృద్ధి చేస్తారని ప్రజలు టీడీపీకి అవకాశం ఇస్తే... విలువైన ఐదేళ్ల పరిపాలనా కాలం బూడిదలో పోసిన పన్నీరైంది. టీడీపీ ప్రజాప్రతినిధులు ఇసుక, మట్టి, గ్రానైట్ కొండలను కరిగించేసి దోచుకోవడంపై పెట్టిన శ్రద్ధ జిల్లా ప్రగతిపై పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ఏవో చిన్నా చితకా సిమెంట్ రోడ్లు వేసి అదేదో తమ ఘనకార్యంగా చెప్పుకుంటున్నారు. కానీ నాణేనికి మరోవైపు చూస్తే అక్రమాలు హోరెత్తాయి. చివరకు జన్మభూమి కమిటీలు సాగించిన అప్రజాస్వామ్య పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారు. వారంతా మా నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన ప్రజాసంకల్ప యాత్రలో అడుగడుగునా తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ న్యాయం చేస్తానని ఆయన ఇచ్చిన భరోసా వారికెంతో ఊరట కలిగించింది. దీని ప్రభావంతో జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సానుకూల స్పందనలు కనిపించాయి. ఒక్క చాన్స్ ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం’’ అని వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ‘సాక్షి ప్రతినిధి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే... గత ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు ఈ జిల్లాకు వచ్చినప్పుడు అనేక హామీలు గుప్పించారు. ప్రజలు అడిగిందీ అడగనిదీ అన్నీ చేసేస్తానన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. చివరి మూడు నెలల్లో టీడీపీ ప్రజాప్రతినిధులకు మెలకువ వచ్చింది. ఎన్నికల వేళ హడావుడి చేస్తున్నారు. ప్రజలు వారిని ఈసారి నమ్మే పరిస్థితిలేదు. తుఫాను ముందు సముద్రంలా ప్రశాంతంగా ఉన్నారు. రానున్న ఎన్నికలలో ఉప్పెనలా మారి ఓటుతో తీర్పు ఇవ్వనున్నారు. టీడీపీ పాలనలో నిర్లక్ష్యం... ఐదేళ్ల పాలనలో టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు కానీ, ఇద్దరు మంత్రులు కానీ, టీడీపీ ప్రజాప్రజాప్రతినిధులు కానీ జిల్లా అభివృద్ధి పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంజూరు చేసిన సాగునీటి ప్రాజెక్టులు తప్ప జిల్లాకు టీడీపీ ఇచ్చిన ప్రాజెక్టులు ఏవీ లేవు. ఒకటీ రెండు చిన్నపాటి ఎత్తిపోతల పథకాలను ప్రారంభించేసి తామేదో అపర భగీరథులమని చెప్పుకుంటున్నారు. జిల్లా రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందట్లేదు. జిల్లాలో ఈ ఐదేళ్లలో చెప్పుకోదగిన పరిశ్రమ ఏదీ ప్రారంభం కాలేదు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కనుమరుగయ్యాయి. జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు పెరిగాయి. వాటిని ఆపడానికి ఉద్దేశించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) నిధులన్నీ కమీషన్లకు కక్కుర్తిపడి సిమెంట్ రోడ్లకే మళ్లించారు. వాటివల్ల ప్రజలకు ఉపాధి కలగలేదు. కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తిన టీడీపీ నాయకుల జేబులు మాత్రం గలగలలాడుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ ప్రకటనలకే సరి... తండ్రి చనిపోయారన్న సానుభూతి ఓట్లతో గెలిచిన శ్రీకాకుళం సిట్టింగ్ ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు ఈ ఐదేళ్లూ ప్రకటనలు, ప్రసంగాలకే పరిమితమయ్యారు. జిల్లా అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించారు. కేంద్ర రైల్వే బడ్జెట్ వచ్చినప్పుడల్లా జిల్లాలోని రైల్వేస్టేషన్లను బాగుచేయడానికి నిధులు మంజూరు చేయిస్తానని ఎంపీ చెప్పడమే తప్ప ఐదేళ్లలో ఏ ఒక్కసారీ ఆచరణలోకి రాలేదు. జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి పరిశ్రమలు పెద్ద సంఖ్యలో రావాలి. కానీ ఇక్కడ కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయారు. చివరకు వెనుకబడిన జిల్లాగా శ్రీకాకుళానికి రావాల్సిన నిధులను తెచ్చుకునే విషయంలోనూ ఎంపీ విఫలమయ్యారు. కేంద్ర ప్రభుత్వం నుంచి జిల్లాకు వచ్చిన సుమారు రూ.275 కోట్ల నిధులకు పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు పంపకపోవడంతో అవి కాస్తా మళ్లిపోయాయి. టీడీపీ నాయకులందరిదీ అదే దారి... జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో పాత కోడిరామ్మూర్తి స్టేడియాన్ని కూల్చేశారు. ఆధునిక స్టేడియం నిర్మించడానికి మూడేళ్ల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా శంకుస్థాపన చేశారు. దాని నిర్మాణం ఇంకా పునాది స్థాయి దాటలేదు. కిడ్నీ రోగులకు తగిన వైద్యం అందే పరిస్థితి లేదు. జీడి, కొబ్బరి రైతులను ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి ఆసరాగా ఉన్న ఎన్ఆర్ఈజీఎస్ను నీరుగార్చి ఆ నిధులను నీరు–చెట్టు పేరుతో టీడీపీ కార్యకర్తలు దోచుకునే విధంగా చేశారు. ఆమదాలవలస సుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించలేక చేతులెత్తేశారు. టెక్కలి మండలం రావివలసలో వందలాది కుటుంబాలకు ఆధారంగా ఉన్న ఫెర్రో ఎల్లాయ్స్ పరిశ్రమ మూతపడేలా చేశారు. జిల్లా సమస్యలపై అవగాహన ఉంది... జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉంది నాకు. జిల్లాలో ప్రతీ సమస్యపై అవగాహన ఉంది. ప్రజా పోరాటాల్లోనూ ముఖ్య భూమిక పోషించాను. ప్రజలు ఎంపీగా ఒక్క అవకాశం ఇస్తే జిల్లాను అభివృద్థి పథంలో నడిపిస్తాను. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనలో జగనన్నకు తోడుగా నిలుస్తాను. జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టులన్నీ పూర్తిచేయించి రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందేలా కృషి చేస్తాను. కిడ్నీ రోగులకు ఆసరాగా డయాలసిస్ కేంద్రాలు ఎక్కువ చోట్ల ఏర్పాటు చేయిస్తాను. మత్స్యకారులకు, కూరగాయల రైతులకు అవసరమైన కోల్డ్ స్టోరేజ్‌లు అందుబాటులోకి తెస్తాను. ఉప్పు కార్మికుల సమస్యలపైనా నాకు అవగాహన ఉంది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు అవసరమైన పరిశ్రమలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాను. గిరిజనులకు అవసరమైన నిధులను తెస్తాను. వంశధార నిర్వాసితులకు అండగా ఉంటాను. ప్రతీ ఒక్కరికీ విద్యా, వైద్యం అందేవిధంగా ప్రత్యేక దృష్టి సారిస్తాను. ఆశలు రేపిన జగనన్న హామీలు... టీడీపీ పాలకులు చివరకు వంశధార నిర్వాసితులకూ తగిన న్యాయం చేయలేదు. అందుకే తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే వారిని అన్నివిధాలా ఆదుకుంటానని జగనన్న రెండేళ్ల క్రితం హిరమండలంలో జరిగిన బహిరంగ సభలో స్పష్టమైన హామీ ఇచ్చారు. అదే సమయంలో ఉద్దాన ప్రాంతంలోని జగతిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలోనూ కిడ్నీ రోగులకు భరోసా ఇచ్చారు. నెల నెలా రూ.10 వేలు పింఛను కూడా ప్రకటించారు. దీంతో ఉలిక్కిపడిన టీడీపీ ప్రభుత్వం రూ.2 వేలు పింఛను ప్రకటించింది. కానీ జిల్లాలో కిడ్నీ రోగులు వేల సంఖ్యలో ఉంటే పింఛను ఇస్తుంది మాత్రం మూడొందల మందికి మించలేదు. ఇటీవల తిత్లీ తుఫానుతో దెబ్బతిన్న మత్స్యకారులు, జీడిమామిడి, కొబ్బరి రైతులు కష్టాల్లో ఉన్నారు. నష్టపరిహారం పంపిణీలోనూ టీడీపీ నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారు. బాధితులకు న్యాయం జరగలేదు. వారందరికీ పూర్తిస్థాయిలో పరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని పలాస, టెక్కలి బహిరంగ సభల్లో జగనన్న హామీ ఇచ్చారు. -
శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి
జిల్లాలోని శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేయనున్నారు. వీరి వివరాలను ఒకసారి పరిశీలిస్తే.... పేరు: దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ నేపథ్యం: భార్య దువ్వాడ వాణి(టెక్కలి మాజీ జెడ్పీటీసీగా పనిచేశారు). విద్యార్హత: బీఏ లిటరేచర్, ఎంఏ లిటరేచర్, బీఎల్ (పీఆర్ కళాశాల, కాకినాడ) రాజకీయ ప్రవేశం: 2001లో జిల్లా యువజన కాంగ్రెస్ జనరల్ కార్యదర్శిగా, 2006 జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. 2009లో పీఆర్పీ తరఫున టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009 ఉప ఎన్నికల్లో మళ్లీ పీఆర్పీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో టెక్కలి నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. ఉద్యమాలు: సంతబొమ్మాళి మండలం కాకరాపల్లిలో నిర్మాణం తలపెట్టిన ఈస్ట్ కోస్ట్ పవర్‌ప్లాంట్‌కు వ్యతిరేకంగా 2010 నుంచి పోరాడుతున్నారు. -
అధైర్యపడకండి.. అండగా ఉంటాం
ఎల్.ఎన్.పేట, హిరమండలం, కొత్తూరు: చెన్నైలో గత నెల 28న నిర్మాణంలో ఉన్న బహుళ అంత స్తుల భవనం కూలిన ఘట నలో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని పాతపట్నం ఎమ్మె ల్యే కలమట వెంకటరమణ, వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి అన్నారు. ఎల్ఎన్ పేట, హిరమండలం, కొత్తూరు మండలాల్లో బాధిత కుటుంబాలను ఆది వారం పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన తక్షణ సహాయం రూ.25 వేలు ఇంకా ఇవ్వలేదని బాధితులు ఎమ్మెల్యేకు చెప్పారు. సాయం అందేందుకు సీఎంపై ఒత్తిడి తీసుకురావడంతోపాటు, ఎమ్మెల్యే కోటా నుంచి ఇళ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సహాయాలను అందేలా కృషి చేస్తామని రెడ్డి శాంతి అన్నారు. అందవరపు అబ్బాయి, శివ్వాల కిశోర్, లుకలాపు రాజారావు, ముగడ జనార్థనరావు, కొమరాపు తిరుపతిరావు, కె.చిరంజీవి, పి.ఆదినారాయణ, గేదెల జగన్మోహనరావు, శిమ్మ సాంబశివరావు, కిలారి త్రినాథరావు, యారబాటి రామకృష్ణ, కొల్ల రాము, ఎర్ర జనార్థనరావు, ముగడ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వలసలు నివారించి ఉపాధి కల్పించండి... హిరమండలం మండలంలోని గొట్ట,లక్ష్మీపురంకు చెందిన మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, రెడ్డిశాంతి పరామర్శించారు.ఈ దుర్ఘటనలో భర్త శ్రీను, కుమార్తె భవానీలను కోల్పోయిన మీసాల వరలక్ష్మిని పరామర్శించారు. పల్లెల్లో వలసలు నివారించి గ్రామీణులకు ఉపాధి వనరులు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. జెడ్పీటీ సీ ప్రతినిధి, సర్పంచ్ లోలుగు.లక్ష్మణరావు, ఎ.అబ్బాయి, ఎ.వి సురేష్, గేదెల.జగన్మోహనరావు, టి.రమేష్ ఉన్నారు. రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి... చెన్నై ప్రమాద ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని రెడ్డి శాంతి డిమాండ్ చేశారు. కొత్తూరు మండలంలోని ఇరపాడుకు చెందిన అన్నదమ్ములు అమాలపురం శ్రీనివాసరావు(రమేష్), రాజేష్, కిమిడి సుబ్బారావులు కుటుంబాలను ఆదివారం రెడ్డిశాంతి, ఎంఎల్ఏ కలమట వెంకటరమణలు పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులు సూర్యారావు, రమణమ్మ, దశాలుమ్మలను ఓదార్చారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా ప్రకటించిన రూ. 25 వేలను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఎంపీపీ ఆరిక రాజేశ్వరి, పీఏసీఎస్ అధ్యక్షుడు ఏ. అరుణ్ కుమార్, వైఎస్సార్ సీపీ మండల పార్టీ కన్వీనర్ పొత్రకొండ మోహన్‌రావు, సర్పంచ్ బర్రి గోవిందరావు, మాజీ ఉప సర్పంచ్ జి. భానుమూర్తి, పీఏసీఎస్ మాజీ ఉపాధ్యక్షుడు బూర్లె శ్రీనివాసరావు, పోర్న గోవింద, మునకోటి సీతారాం, మండల ఎస్సీ సెల్ కన్వీనర్ గొంటి రమేష్, గంగరాజు, సింహచలం తదితరులు పాల్గొన్నారు.