ప్రైవేటు వాహనాల్లో వెళ్లొద్దు..
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్ : ప్రైవేటు వాహనాలను ఆశ్రయించవద్దని, ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని ఆర్టీసీ ఎండీ జె.పూర్ణచంద్రరావు ప్రయాణికులకు పిలుపునిచ్చారు. ఈ విషయంలో విజయనగరం జిల్లా పెంట శ్రీరాంపురం గ్రామస్తులను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరగా గమ్యస్థానం చేరుకోవాలనే తొందరలో జనం ప్రైవేట్ బస్సులు, వాహనాలను ఆశ్రయించి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారన్నారు. పెంట శ్రీరాంపురంలో ఆటోలు ఎక్కినవారికి గ్రామ పెద్దలు రూ.100 జరిమానా వేస్తున్నారని, దీంతో గ్రామస్తులందరూ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారని వివరించారు. దీనిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
పల్లె వెలుగు బస్సులకు మరమ్మతులు
ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో సంస్థ ముందుంటుందని పూర్ణచంద్రరావు చెప్పారు. విజయనగరం జోన్లో వెయ్యి వరకు పల్లె వెలుగు బస్సులు తిరుగుతున్నాయని, వీటికి మరమ్మతులు చేయించటంతోపాటు రంగులు వేయిస్తామని తెలిపారు. వీటిలో ఆక్యుపెన్సీ రేషియోను పెంచాల్సి ఉందని, దీనిపై ప్రయాణికులకు కూడా అవగాహన కల్పిస్తామని చెప్పారు. వచ్చే నెల 5 తర్వాత సమ్మె ప్రభావం ఉంటుందని, సంక్రాంతికి బస్సులు తిరగవని కార్మిక సంఘాలు చెబుతున్నాయని విలేకరులు ప్రస్తావించగా సంస్థను నష్టపరిచే పని కార్మికులు చేయరన్నారు. అందువల్ల పండగకు బస్సులు తిరుగుతాయని, సమ్మె విషయమై కార్మిక సంఘాలతో చర్చిస్తామని చెప్పారు. సంక్రాంతి బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీ వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించగా ఆ సొమ్మును తమ జేబుల్లో వేసుకోమని, సంస్థ అభివృద్ది కోసమే వినియోగిస్తామని అన్నారు. 50 శాతం చార్జీలు పెంచినా ఇంకా 25 శాతం మేర నష్టం వస్తోందన్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు వోల్వో బస్సులను ఎన్నాళ్లు నడుపుతాయో తెలియదని, అదే ఆర్టీసీ మొదలుపెడితే చివరి వరకూ నడుపుతుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తొలుత ఈయూ, ఎన్ఎంయూల ప్రతినిధు లు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం కాం ప్లెక్స్ ఆవరణలోని మరుగుదొడ్లు, నాన్‌స్టాప్ కౌంటర్లను ఎండీ పరిశీలించారు. ఆవరణలో మొక్క నాటారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ ఎ.రామకృష్ణ, ఆర్ఎం అప్పడు, డీసీటీఎం జి.సత్యనారాయణ, శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల మేనేజర్లు ఎం.సన్యాసిరావు, ఎం.ముకుందరావు, కాంప్లెక్స్ ఎస్ఎం బీఎల్పి రావు, ఈయూ ప్రతినిధులు కొర్లాం గణేశ్వరరావు, భానుమూర్తి, సుమన్, శంకరరావు, ఎస్.వి.రమణ, ఎన్ఎంయూ నేత బాషా తదితరులు పాల్గొన్నారు. కాగా, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, మరో 26 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఎండీకి వినతిపత్రం సమర్పించారు.
జర్నలిస్టుల వినతి
రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఏసీ బస్సుల్లో రాయితీ సౌకర్యాన్ని కల్పించాలని కోరుతూ ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు కొంక్యాన వేణుగోపాలరావు, సత్తారు భాస్కరరావు తదితరులు వినతపత్రం సమర్పించారు. ప్రస్తుతం రాజధానిలోని జర్నలిస్టులకే దీనిని పరిమితం చేశారన్నారు. అలాగే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌లకు కూడా బస్‌పాస్ సౌకర్యం కల్పించాలని కోరారు. పరిశీలిస్తామని పూర్ణచంద్రరావు హామీ ఇచ్చారు.
విజయవాడ-శ్రీకాకుళం ‘వెన్నెల’ బస్సు ప్రారంభం
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్ : విజయవాడ-శ్రీకాకుళం వెన్నెల ఏసీ స్లీపర్ బస్సు సర్వీసు శుక్రవారం విజయవాడలో ప్రారంభమైంది. ఈ విషయాన్ని శ్రీకాకుళం పర్యటనకు వచ్చిన ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు విలేకరులతో చెప్పారు. విజయవాడలో రాత్రి 8.45 గంటలకు బయలుదేరిన ఈ బస్సు శనివారం ఉదయం ఆరు గంటలకు శ్రీకాకుళం కాంప్లెక్స్‌కు చేరుకుంటుంది. శనివారం రాత్రి 8.45 గంటలకు శ్రీకాకుళంలో బయలుదేరి ఆదివారం ఉదయం 6 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. నిత్యం నడిచే ఈ బస్సులో టిక్కెట్ ధర పెద్దలకు రూ.1231, పిల్లలకు 980 రూపాయలుగా నిర్ణయించారు. ఈ బస్సులో 24 సీట్లు మాత్రమే ఉంటాయి. విశాఖపట్నం, అన్నవరం, రాజమండ్రి, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరుల్లో ఆగే ఈ బస్సు సర్వీసును ప్రయాణీకులు వినియోగించుకోవాలని పూర్ణచంద్రరావు కోరారు.