సోనియా.. క్విట్ ఇండియా
స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటీషు వారిని తరిమికొట్టేందుకు క్విట్ ఇండియా ఉద్యమం మొదలైందని, రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్న సోనియాగాంధీని తరిమికొట్టేందుకు మరో క్విట్ ఇండియా ఉద్యమం చేయాలని పలువురు నాయకులు, సమైక్యవాదులు పిలుపునిచ్చారు.
కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ :
క్విట్ ఇండియా అంటూ విదేశీయురాలైన సోనియా గాంధీని దేశం నుంచి సాగనంపాలని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఆయన మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, హఫీజుల్లా కాల్టెక్స్, అల్లాడు పాండురంగారెడ్డి, సంపత్‌కుమార్‌లతో కలిసి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష రెండవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర మంత్రులు తమ పదవుల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, వీరు చరిత్ర హీనులుగా మిగిలిపోవడం తథ్యమన్నారు. ఏకే ఆంటోని నేతృత్వంలో గతంలో పలు స్కామ్‌లపై వేసిన కమిటీలు సరైన నివేదికలు ఇవ్వలేదన్నారు. నేడు సమైక్యాంధ్రపై వేసిన హై లెవెల్ కమిటీ కూడా అదే రీతిలో పయనిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీలోగానీ, దేశంలోగానీ ప్రజాస్వామ్యం లేకుండా చేస్తోందని మండిపడ్డారు. ఆంగ్లేయులు పాలించిన దానికంటే సోనియా నిరంకుశంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు సీబీఐ కేసులకు భయపడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. రాష్ట్ర విభజన దోషులు సోనియా, చంద్రబాబులేనని, ప్రజలు వీరికి అత్యంత కఠినమైన శిక్ష విధిస్తారని హెచ్చరించారు.
కనుసైగతో ఎంపీలను శాసిస్తున్నారు: ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి
పార్లమెంటులో కేంద్ర మంత్రులు, ఎంపీలను సోనియాగాంధీ కనుసైగతో శాసిస్తున్నారని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి అన్నారు. 1950 నుంచి తెలంగాణ ఉద్యమం ఉందని, ఎన్ని ఉద్యమాలు జరిగినా అప్పటి నాయకులు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచారన్నారు. జగన్‌కు అడ్డుకట్ట వేయడం, రాహుల్‌ను ప్రధాని చేయడమే లక్ష్యంగా రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎలా విడదీస్తే ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయో ఆలోచించి, తుపాకీ ఎక్కుపెట్టి బెదిరింపు ధోరణిలో విభజన చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఒకేరోజు హడావుడిగా మూడు సమావేశాలు నిర్వహించి తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివారావు, పురంధేశ్వరి, పల్లంరాజులు సీమాంధ్ర ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారన్నారు. చంద్రబాబు సమైక్యమా? తెలంగాణమా? తేల్చి చెప్పకపోతే ఆయన ఏ యాత్ర చేసినా ప్రజలు చెప్పులు, రాళ్లతో కొట్టి తరుముతారన్నారు. వైఎస్ కల నేరిందని దిగ్విజయ్‌సింగ్ చెప్పడం దారుణమన్నారు. వైఎస్ ఉండి ఉంటే అసలు తెలంగాణ ప్రస్తావన వచ్చేదా? అని అమర్నాథరెడ్డి సూటిగా ప్రశ్నించారు. నరేంద్రమోడీని బాలకృష్ణ కలువడంలో గల ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు.
గౌరవంగా తప్పుకోకపోతే రోశయ్యకు పట్టిన గతే : రఘురామిరెడ్డి
రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకుని సోనియాగాంధీ ఆయన కుర్చీ లాగేసిందని వైఎస్సార్ సీపీ క్రమశిక్షణా కమిటీ సభ్యుడు ఎస్.రఘురామిరెడ్డి తెలిపారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా గౌరవంగా తప్పుకోకపోతే రోశయ్యకు పట్టిన గతే ఆయనకూ పడుతుందని హెచ్చరించారు. 33 ఎంపీ సీట్లు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌కు సోనియా ఇచ్చే బహుమతి ఇదేనా? అని ఆయన ప్రశ్నించారు. 60 సంవత్సరాలుగా సీమాంధ్రులు హైదరాబాదులో తమ పెట్టుబడులు, ఆదాయం పెట్టారని, ఇప్పటికప్పుడు వెళ్లిపొమ్మంటే ఎక్కడికి వెళ్లాలన్నారు. 2008లో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ నేడు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ మునిగే పడవ అని తెలుసుకుని బీజేపీతో మళ్లీ కలవడానికి చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ ఏ ధ్యేయంతో టీడీపీని స్థాపించారో అందుకు పూర్తి విరుద్ధంగా ఆ పార్టీ నడుస్తోందన్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు పార్లమెంటును బహిష్కరించి బిల్లు పెట్టకుండా అడ్డుకోవాలన్నారు.
ఒకరిని తొక్కి, మరొకరిని అందలమెక్కించడానికే.. -ఎమ్మెల్యే కొరముట్ల
వైఎస్ జగన్‌ను అణగదొక్కి రాహుల్‌గాంధీని ప్రధాని చేయడానికే దుష్ట శక్తులన్నీ ఏకమై రాష్ట్రాన్ని విభజిస్తున్నాయని రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు. వైఎస్ పాలనలో ఒక వెలుగు వెలిగిన రాష్ట్రాన్ని ముక్కలు చేయడం దుర్మార్గమన్నారు. విడిపోవడానికి సాగునీరు, తాగునీరు, హైదరాబాద్ రాజధాని వంటి ఎన్నో సమస్యలు ముడిపడి ఉన్నాయన్నారు. ఒక రాత్రిలో సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రం ఉలిక్కి పడిందన్నారు. సోనియా నిర్ణయాన్ని పునః పరిశీలించుకోవాలని సూచించారు. దేశంలో ఏ భాష మాట్లాడే వారికి ఆ రాష్ట్రం ఉందని, తెలుగు మాట్లాడే వారికి మాత్రం రెండు రాష్ట్రాలు ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని మాట్లాడటం అన్యాయమన్నారు.