Srinagar Lok Sabha by poll
-
బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్ సర్వీసులు బంద్
శ్రీనగర్: కశ్మీర్ లోయలో బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్ సర్వీసులను సస్పెండ్ చేశారు. శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా భారీగా హింస చెలరేగడం, 38 పోలింగ్ స్టేషన్లలో రీ పోలింగ్‌కు ఈసీ ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఎలాంటి కారణం చెప్పకుండా గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అధికారులు ఇంటర్నెట్ సర్వీసులను ఆపివేశారు. వేర్పాటువాదులు ఎన్నికలకు ఆటంక కలిగిస్తారని భావించి.. శ్రీనగర ఉప ఎన్నికకు కొన్ని గంటల ముందు ఈ నెల 8వ తేదీ అర్ధరాత్రి ఇంటర్నెట్ సర్వీసులను అధికారులు ఆపివేశారు. ఎన్నికలు ముగిశాక మంగళవారం పునరుద్ధరించారు. ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లలో ఎనిమిది మంది పౌరులు మరణించగా, 100 మందికి పైగా భద్రత సిబ్బంది గాయపడ్డారు. చాలా తక్కువ శాతం పోలింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో మరోసారి ఇంటర్నెట్ సర్వీసులపై ఆంక్షలు విధించారు. -
శ్రీనగర్‌లో 38 చోట్ల రీ పోలింగ్
న్యూఢిల్లీ: శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఈ నెల 13న 38 పోలింగ్ స్టేషన్లలో రీ పోలింగ్ నిర్వహించనున్నారు. మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం జరిగిన శ్రీనగర్ ఉప ఎన్నికల్లో భారీగా హింస, అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. కాల్పుల్లో ఎనిమిది మంది పౌరులు మరణించగా, 100 మందికి పైగా భద్రత సిబ్బంది గాయపడ్డారు. ఈ ఎన్నికల్లో 6.5 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. గత మూడు దశాబ్దాలలో ఇదే అతి తక్కువ ఓటింగ్. ఈ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారులు, పరిశీలకుల నుంచి నివేదికలు తెప్పించుకున్న ఈసీ 38 పోలింగ్ స్టేషన్ల పరిధిలో రీ పోలింగ్ నిర్వహించాలని జమ్ము కశ్మీర్ ఎన్నికల సంఘం అధికారిని ఆదేశించింది.