శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఈ నెల 13న 38 పోలింగ్ స్టేషన్లలో రీ పోలింగ్ నిర్వహించనున్నారు.
న్యూఢిల్లీ: శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఈ నెల 13న 38 పోలింగ్ స్టేషన్లలో రీ పోలింగ్ నిర్వహించనున్నారు. మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం జరిగిన శ్రీనగర్ ఉప ఎన్నికల్లో భారీగా హింస, అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే.
కాల్పుల్లో ఎనిమిది మంది పౌరులు మరణించగా, 100 మందికి పైగా భద్రత సిబ్బంది గాయపడ్డారు. ఈ ఎన్నికల్లో 6.5 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. గత మూడు దశాబ్దాలలో ఇదే అతి తక్కువ ఓటింగ్. ఈ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారులు, పరిశీలకుల నుంచి నివేదికలు తెప్పించుకున్న ఈసీ 38 పోలింగ్ స్టేషన్ల పరిధిలో రీ పోలింగ్ నిర్వహించాలని జమ్ము కశ్మీర్ ఎన్నికల సంఘం అధికారిని ఆదేశించింది.