మహిళలపై ‘స్త్రీనిధి’ వడ్డీ భారం
జగిత్యాల రూరల్ : మహిళా సంఘాల సభ్యులకు స్త్రీనిధి వడ్డీలు భారమయ్యాయి. గతంలో వడ్డీలేని రుణాల కింద స్త్రీశక్తి రుణాలు మంజూరు చేసిన ప్రభుత్వం వాటిపై వడ్డీ వసూలు చేస్తుండడంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు. మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయమని ప్రకటించిన ప్రభుత్వమే వడ్డీ వసూలు చేస్తుండడంతో ఏం చేయాలో తోచక ఆందోళన చెందుతున్నారు. 2012, జూలైలో మహిళా సంఘాలకు స్త్రీనిధి కింద వడ్డీలేని రుణాలు ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లాలో ఈ పథకం కింద 24,031 సంఘాల్లోని 9,612 మంది మహిళలు రూ.121 కోట్ల రుణాలు పొందారు.
వీటిని వడ్డీ లేకుండా ప్రతి నెల చెల్లిస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం స్త్రీనిధి రుణాలకు సైతం వడ్డీ చెల్లించాలని ఆదేశాలు జారీ చేయడంతో మహిళలు జంకుతున్నారు. జిల్లా వ్యాప్తంగా స్వయం ఉపాధి కోసం రుణాలు తీసుకున్న 9,612 మంది స్త్రీశక్తి రుణాలకు వడ్డీ చెల్లిస్తూ వస్తున్నారు. వడ్డీ చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అసలుతోపాటు వడ్డీ చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. స్త్రీనిధి కింద రుణాలు పొందిన సభ్యులు ప్రతి నెల సజావుగా చెల్లించాలని నిబంధన ఉండడంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు.
అసలుతోపాటు వడ్డీ..
మహిళా సంఘాల సభ్యులకు స్త్రీనిధి కింద వడ్డీలేకుండా రుణం ఇచ్చారు. కొద్దిరోజులుగా వడ్డీలేకుండా ప్రతి నెల చెల్లిస్తూ వచ్చాం. ప్రస్తుతం రెండు నెలలుగా వడ్డీతోపాటు రుణాలు చెల్లించాలని చెబుతున్నారు. దీంతో నెలనెలా అసలుతోపాటు వడ్డీ చెల్లించుకుంటూ వస్తున్నాం. - తోట జమున, రుణగ్రహీత, పొరండ్లవడ్డీ చెల్లిస్తున్నారు
గతంలో మహిళాసంఘాల సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే స్త్రీనిధి రుణాలను వడ్డీలేకుండా ఇచ్చారు. ప్రస్తుతం ఆ రుణాలకు వడ్డీ చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం వడ్డీలను తర్వాత వారి ఖాతాల్లో జమచేస్తామంటున్నారు.
- రమాదేవి, ఐకేపీ ఏపీఎం, జగిత్యాల