‘స్త్రీశక్తి’కి గూడుగోడు
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: మహిళల కోసం అనేక అభివృద్ధి పథకాలు చేపడుతున్నామని గొప్పలు చెప్పుకునే పాలకులు ఆచరణలో ఘోరంగా విఫలమవుతున్నారు. మహిళల సాధికారత ఎండమావిగానే మారుతోంది. జిల్లాలో 56 మండల సమాఖ్యలు, వీటి పరిధిలో 47,400 గ్రూపులున్నాయి. వీటిలో 5 లక్షలకు పైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరు కనీసం కూర్చోవడానికి స్థలం కూడా లేని పరిస్థితి జిల్లాలో ఉంది. ఈ భవనాల్లోనే జాతీయ ఉపాధి హామీ పథకం సిబ్బంది, ఇందిరా క్రాంతి పథం సిబ్బంది కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయాలి. జిల్లాలోని మహిళలకు సమావేశాలు నిర్వహించుకోవడానికి, వారి సమస్యలను చర్చించుకోవడానికి ప్రతి మండల పరిధిలోని మండల సమాఖ్యలకు స్త్రీ శక్తి భవనాలు నిర్మించాలని 2010 వ సంవత్సరంలో నిర్ణయించారు. ఈ మేరకు 2011లో శిలాఫలకాలు వేశారు.
2014 వచ్చినా ఇప్పటి వరకూ కేవలం 2 భవనాలు మాత్రమే పూర్తి అయి ప్రారంభానికి నోచుకున్నాయి. స్త్రీశక్తి భవనాల తీరుతెన్నులపై ‘న్యూస్‌లైన్’ బృందం శనివారం జిల్లావ్యాప్తంగా పరిశీలించింది. స్త్రీ శక్తి భవనాల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. చాలాచోట్ల శిలాఫలకాలే దర్శనమిస్తున్నాయి. 56 మండలాలకు గాను 52 మండలాల్లో స్త్రీ శక్తి భవనాలకు అనుమతులు వచ్చాయి. వాటిలో 34 భవనాలకు నిధులు విడుదలయ్యాయి. ఇందులో 18 భవనాలకు నిర్మాణ పనులే ప్రారంభం కాలేదు. మూడేళ్ల క్రితం అంచనా వేసిన నిర్మాణ వ్యయం ప్రస్తుతం భారీగా పెరిగిపోయింది.
అద్దంకి నియోజకవర్గంలో భవనాల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. చీరాల నియోజకవర్గ పరిధిలోని చీరాల మండలంలో గత 27 నెలల నుంచి నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయి. వేటపాలెంలో నిధులు లేక పనులు మొదలు కాలేదు. దర్శి, గిద్దలూరు నియోజకవర్గాల పరిధిలో భవనాలు నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. నిధులు మంజూరయ్యాయి. అయితే ఇప్పటి వరకు నిర్మాణం పూర్తి కాలేదు. కందుకూరు నియోజకవర్గంలో మొత్తం 12 భవనాలు మంజూరయ్యాయి. ఆరు భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయి. కొండపి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో స్త్రీ శ క్తి భవనాల నిర్మాణానికి నిధులు సరిపోకపోవడంతో అర్ధాంతరంగా పనులు నిలిచిపోయాయి.
యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో కొన్నిచోట్ల నిర్మాణ పనులు మొదలు కాలేదు. మరికొన్నిచోట్ల బిల్లులు సకాలంలో అందించక పనులు నిలిచిపోయాయి. కనిగిరి నియోజక వర్గ పరిధిలో కనిగిరిలో మినహా మిగిలిన 5 మండలాల్లో స్త్రీశక్తి భవన నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. నిధుల జాప్యంతో నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. రెండేళ్ల గడచినా పూర్తిస్థాయి నిర్మాణాలు జరగలేదు. మార్కాపురం నియోజకవర్గ పరిధిలో ఒక్క భవనం కూడా నిర్మాణ దశలో లేదు. పర్చూరు నియోజకవర్గ పరిధిలో కొన్నిచోట్ల నిధులు మంజూరైనా నిర్మాణ బాధ్యతలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కొన్ని చోట్ల నిర్మాణం ప్రారంభమైనప్పటికీ ఇంకా పూర్తి చేయలేదు. సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో నిధులు మంజూరైనా అధికారుల మధ్య సమన్వయం లేక ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదు. కొన్నిచోట్ల అనువైన స్థలం లేదని, మరోచోట నిధులు చాలవని నిర్మాణాలు చేపట్టలేదు.