రూ.8.15కోట్లతో వంతెన నిర్మాణం: మంత్రి రఘువీరా
పెదనందిపాడు, న్యూస్‌లైన్ :గుంటూరు-పర్చూరు ఆర్ అండ్‌బీ రోడ్డులో పెదనందిపాడు సమీపంలో నల్లమడ వాగుపై శిధిలావస్థకు చేరిన వంతెన స్థానంలో రూ. 8.15 కోట్లతో నూతన వంతెన నిర్మాణాన్ని త్వరలో చేపడతామని రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి చెప్పారు. వరద ముంపు పరిశీలనలో భాగంగా శనివారం మంత్రులు రఘువీరారెడ్డి, కాసు వెంకట కృష్ణారెడ్డి తదితరులు పెదనందిపాడు వచ్చి, శిథిలావస్థకు చేరిన వంతెనను పరిశీలించారు. కొత్త వంతెన నిర్మాణం అవశ్యంపై బాపట్ల ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, విజయవాడ, గుంటూరు, తెనాలి మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ ( వీజీటీఎం ఉడా) చైర్మన్ వణుకూరి శ్రీనివాస్‌రెడ్డి, గుంటూరు ఏఎంసీ వైస్‌చైర్మన్ దూళిపాళ్ల మోహన్‌రావు తదితరులు మంత్రి దృష్టికి తెచ్చారు.
పాత మద్రాస్ రోడ్డులో నల్లమడ వాగుపై బ్రిటీష్ కాలంలో నిర్మించిన పురాతన వంతన కూలిపోవడంతో 1974లో వంతెన నిర్మించారన్నారు. నల్లమడ ఆధునికీకరణ పనుల అనంతరం వంతెనను పటిష్టపరచకపోవడంతో వరదనీటి ఉద్ధృతికి ప్రమాదం వాటిల్లి కూలిపోయే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో మంత్రి రఘువీరా స్పందిస్తూ వంతెన నిర్మాణానికి సంబంధించిన ఫైల్ ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందన్నారు. ప్రాధాన్యత క్రమంలో వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్, ల్యాండ్ సీలింగ్ డిప్యూటీ కలెక్టర్ ఆలపాటి ప్రభావతి, గుంటూరు ఆర్డీవో శ్రీరామ్మూర్తి, స్పెషల్ ఆఫీసర్ రవికుమార్, తహశీల్దార్ చావా పద్మావతి, పొన్నూరు ఏఎంసీ చైర్మన్ బొణిగల వేణుప్రసాద్ తదితరులు ఉన్నారు. అనంతరం పాలపర్రు, అన్నారం, ఉప్పలపాడు మీదుగా పంట పొలాలు, ఓగేరు వాగును పరిశీలిస్తూ మంత్రుల బృందం చిలకలూరిపేట వెళ్లింది. అన్నారం, ఉప్పలపాడుకు చెందిన రైతులు ఓగేరు వాగుపై వంతెన నిర్మించాలని మంత్రుల బృందానికి విజ్ఞప్తి చేశారు. అన్నారం మాజీ సర్పంచి గద్దె వరప్రసాద్ ఆధ్వర్యంలో మంత్రులకు పలు సమస్యలు విన్నవించారు.