పద్మప్రియ కోసం ఆస్తంతా రాసిచ్చేశాను!
బిహైండ్ ది రీల్ శ్రీనివాస చక్రవర్తి
నాడు...
పదివేళ్లకు పన్నెండు ఉంగరాలు..
మెడలో నాలుగైదు బంగారు గొలుసులు...
కళ్లకు ఖరీదైన చలవ కళ్లద్దాలు...
సిల్కు దుస్తులు... లెదర్ బూట్లు...
ఈ వేషధారణలో శ్రీనివాస చక్రవర్తి అచ్చం దొరబాబే.
అందుకేనేమో ‘ఉంగరాల చక్రవర్తి’ అనే నిక్ నేమ్.
నేడు...
సాదాసీదా కాటన్ దుస్తులు.. మసకబారిన కళ్లజోడు... అరిగిపోయిన హవాయి చెప్పులు.. బోసిపోయిన మెడ... నరాలు తప్ప ఇంకేమీ కనపడని చేతివేళ్లు.
నో బ్యాంక్ బ్యాలెన్స్... నో రెసిడెన్స్..
ఆల్మోస్ట్ ఆల్ ‘కేరాఫ్ ప్లాట్‌ఫామ్’...
అసలు ఎవరీ శ్రీనివాస చక్రవర్తి.. ఆయన కథేంటి?
ఏలూరులో పుట్టి, బీఎస్సీ వరకూ చదివిన శ్రీనివాస చక్రవర్తికి సినిమాలంటే పిచ్చి. హిందీ హీరో రాజ్‌కపూర్‌కి తను వీరాభిమాని. ఆ అభిమానమే ఆయన్ను ముంబై రైలెక్కించేలా చేసింది. ఆర్.కె. స్టూడియో గేటు ముందు పడిగాపులు కాసేలా చేసింది. మొత్తానికి శ్రీనివాస చక్రవర్తి నక్కతోక తొక్కారు. ‘బాబి’ సినిమాకు తన దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేర్చుకున్నారు రాజ్‌కపూర్. గోల్డెన్ ఛాన్స్. కానీ, ఆ ఆనందం కొన్నాళ్లే. సినిమాలు మానేసి బుద్ధిగా ఉద్యోగం చేసుకోమని ఇంటి నుంచి పిలుపు.
కట్ చేస్తే... బెంగళూరులో సేల్స్‌మన్ ఉద్యోగం. అయినా మనసంతా సినిమాల మీదే. సరిగ్గా అదే టైమ్‌లో అంతా కొత్తవాళ్లతో ‘నీడలేని ఆడది’ సినిమా మొదలైంది. అందులో చిన్న వేషం. తొలిసారి మేకప్. మనసు రంగుల్లో తేలియాడింది. వెనువెంటనే తాతమ్మ కల, చుక్కలో చంద్రుడు సినిమాల్లో కూడా వేషాలు. అమ్మయ్య.. ఇంక నటునిగా స్థిరపడిపోవచ్చనుకున్నారు శ్రీనివాస చక్రవర్తి.
అన్నీ మనం ఊహించినట్టు జరిగితే అది విధి ఎలా అవుతుంది?
బాపుతో ఉన్న పరిచయం ‘అందాల రాముడు’ చిత్రానికి అసిస్టెంట్ డెరైక్టర్ని చేసింది. మళ్లీ కెరీర్లో కొత్త మలుపు. వేషాలొదిలేసి డెరైక్షన్ డిపార్ట్మెంట్లో పని. అది కూడా.. కేయస్ ప్రకాశరావు, కమలాకర కామేశ్వరరావులాంటి హేమాహేమీల దగ్గర. హాయిగా తానూ డెరైక్టరైపోవచ్చని ఈస్ట్‌మన్ కలర్ కలలు...
మళ్లీ టర్నింగ్...
దర్శకుడు కేఎస్సార్ దాస్ సలహా మేరకు కలం పట్టాల్సి వచ్చింది. ‘ఎంగళ్ వాదియార్’ అనే తమిళ సినిమాకి స్టోరీ రైటర్. ఉత్తమ కథాచిత్రంగా తమిళనాడు ప్రభుత్వం నుంచి అవార్డు. తెలుగులో దాన్నే రామానాయుడు ‘గురుబ్రహ్మ’గా తీశారు. చకచకా బోల్డన్ని కథలు తయారు చేసుకున్నారు.
ఈసారి ఇంకో టర్నింగ్...
మలయాళ టాప్‌స్టార్స్ మధు, షీలాతో మలయాళంలో ‘పతివ్రత’ సినిమా డెరైక్ట్ చేసే అవకాశం. ఆ వెంటనే మరో రెండు సినిమాలు. మధుర స్మరణై, ఒరు నిమిషం తారు. ఈ మూడు చిత్రాలూ దర్శకునిగా మంచి పేరు తెచ్చాయి.
ఇప్పుడు శ్రీనివాస చక్రవర్తి లైఫ్ క్రాస్‌రోడ్స్‌లో ఉంది. డైరెక్టర్‌గా అవకాశం కోసం ఎదురచూడాలా? రచయితగా ప్రయత్నించాలా? నటన కొనసాగించాలా? ఏవేవో డైలమాలు. ఈసారి స్టోరీ రైటర్‌గా ఛాన్సులొచ్చాయి. ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’ ఐడియా ఆయనదే. ఆ సినిమా బ్లాక్‌బస్టర్. రైటర్‌గా నాలుగైదు సినిమాలొచ్చాయి. చుట్టాలబ్బాయ్, పుణ్యదంపతులు, పెళ్లి... ఈ సినిమా కథలన్నీ శ్రీనివాస చక్రవర్తివే. ఇంకా తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలకు కథలు అందిస్తూ, ఫుల్ బిజీ. ఆ సమయంలోనే హీరోయిన్లు కాంచన, చంద్రకళ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు.
‘‘తమిళ సినిమా ‘ఉరవు సొల్ల ఒరువన్’ను తెలుగులో రీమేక్ చేద్దాం. నువ్వు డెరైక్టర్‌వి. మేం నిర్మాతలం’’ అన్నారు. శ్రీనివాస చక్రవర్తి ఎగిరి గంతేశారు. కానీ, చిన్న ట్విస్ట్... అందులో ఇద్దరు హీరోయిన్లుంటారు. ఆ రెండూ మేమే చేస్తామన్నారు కాంచన, చంద్రకళ. లేదు.. ఒక్కరికే ఛాన్స్. ఇంకో పాత్రను ఒరిజినల్లో చేసిన పద్మప్రియతో చేయిస్తా అన్నారాయన. వాళ్లు కుదరదన్నారు.. ఈయనా కుదరన్నారు.. దాంతో ఆ ప్రతిపాదన డ్రాప్.
సినిమా ఎందుకు వదులుకున్నట్టు?
అక్కడే ఉంది అసలు కథ. పద్మప్రియ అంటే టాప్ హీరోయిన్. దక్షిణాది హేమా మాలిని అనేవారంతా. ఆమెపై మనసు పారేసుకున్నారు శ్రీనివాస చక్రవర్తి. ఆమెక్కూడా ఇతనంటే ఇష్టం. అచ్చం సినిమాల్లోలాగా విలన్లు అడ్డుపడ్డారు. ఇక్కడ విలన్లు పద్మప్రియ తల్లిదండ్రులు..
‘‘నీ ఆస్తి మొత్తం మాకు రాసిస్తే పద్మప్రియ నీదే’’ అని కండీషన్.
ప్రేమ గొప్పదా? డబ్బు గొప్పదా?.. శ్రీనివాస చక్రవర్తికి ప్రేమే గొప్ప.
కట్ చేస్తే.. ఆస్తి లేదు.. పద్మప్రియ మిగిలింది.
పోనీ - ఈ ఫ్యామిలీ లైఫ్ అన్నా బాగుందా అంటే అదీ లేదు.
ఒక్కగానొక్క కూతురికి అనారోగ్యం. కిడ్నీ సమస్య. డాక్టర్లు పెళ్లి చేయకూడదని చెప్పేశారు. వైద్యం కోసం డబ్బులన్నీ కరిగిపోయాయి. ఈలోగా పద్మప్రియ కూడా పై లోకాలకు వెళ్లిపోయారు. అప్పట్నుంచీ ఒంటరి జీవితమే.
మరి.. కూతురి సంగతేంటి...?
బంధువులతో కలిసి చెన్నయ్‌లో ఉంటున్నారామె. ‘‘అనారోగ్యం కారణంగా పెళ్లి చేయకూడదని చెప్పేశారు డాక్టర్లు. అదే నాకు పెద్ద బాధ’’ అన్నారు శ్రీనివాస చక్రవర్తి. తండ్రి హైదరాబాద్‌లో... కూతురు చెన్నయ్‌లో కాలం వెళ్లదీస్తున్నారు.
జీవనోపాధి ఎలా...?
పోతన వెంకటరమణ అని ఛాయాగ్రాహకుడు, శ్రీనివాస చక్రవర్తి ఉంటున్న హాస్టల్ అద్దె కట్టేస్తారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఇందిరా నగర్‌లోని పీవీఆర్ టిఫిన్స్ సెంటర్లో. ‘‘దాదాపు ఏడాదిన్నరగా అక్కడే టిఫిన్ తింటున్నా. యజమాని శ్రీనివాస్ ఏనాడూ నన్ను డబ్బడగలేదు’’ అన్నారు శ్రీనివాస చక్రవర్తి. దాసరి నారాయణరావు, భోగవల్లి ప్రసాద్, నందిగం రామలింగేశ్వరరావు, శ్రీనివాస్, తమ్మారెడ్డి భరద్వాజ్, యలమంచలి నాగేశ్వరరావు, యలమంచిలి సాయిబాబు, దామోదరప్రసాద్, కె. మురళీమోహన్రావు, పీడీ ప్రసాద్, నళిని తదితరులు చేసే ఆర్థిక సహాయంతో రోజులు నెట్టుకొచ్చేస్తున్నారు.
కథలు రాయడం మానేశారా? అనడిగితే.. ‘‘దాదాపు పది కథలు ఉన్నాయి. కానీ, పాత తరంవారి దగ్గర పాత కథలే ఉంటాయని ఎవరూ వినడానికి ఇష్టపడటంలేదు. అసలు కథ వినడానికి టైమ్ ఇస్తే నా కథల్లో ఎంత దమ్ముందో తెలుస్తుంది. అదేమంటే జనరేషన్ గ్యాప్ అంటారు. అదే నా పాలిట శాపం అయ్యింది. కానీ, ప్రస్తుత హీరోలకు పనికొచ్చే కథలు నా దగ్గర ఉన్నాయి. వినేవారెక్కడ? అవకాశం ఇచ్చేవారేరి? ఆ అవకాశాలిస్తే నా ఇబ్బందులు తీరిపోతాయ్. నాడు గోల్డెన్ డేస్.. నేడు మనీ డేస్’’ అన్నారు బాధగా. శ్రీనివాస చక్రవర్తి తయారు చేసుకున్న కథల్లో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’కి సీక్వెల్ కూడా ఉంది. ఆయన వయసిప్పుడు 67. మళ్లీ జన్మంటూ ఉంటే.. ‘‘మనిషిగానే పుట్టాలనుకుంటున్నా’’ అన్నారు. కానీ, సినిమా పరిశ్రమలోకి మాత్రం రాకూడదనుకుంటున్నారా? అంటే.. ‘‘లేదు. సినిమా రంగంలోకే రావాలనుకుంటున్నా. వచ్చే జన్మలోనూ కష్టాలపాలైనా ఫర్వాలేదు.. సినిమాల్లోనే ఉంటా. దక్షిణాది రంగానికి చెందిన అన్ని భాషలకూ కథ ఇచ్చాను. ఈ జన్మకు ఆ సంతృప్తి మిగిలింది.. చాలు’’ అన్నారు.
- డి.జి.భవాని