సీబీఐకి మరికొన్ని ‘బొగ్గు’ ఫైళ్లు!
న్యూఢిల్లీ: బొగ్గు కేటాయింపులకు సంబంధించి తాజాగా మరికొన్ని ఫైళ్లు, పత్రాలు సోమవారం సీబీఐకి అందాయి. బొగ్గు శాఖ నుంచి తాజాగా వచ్చిన ఫైళ్లు, పత్రాల పరిశీలన మొదలైందని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాతే ఇంకా తమకు ఎన్ని ఫైళ్లు రావాలో అనే విషయంపై అంచనాకు వస్తామని పేర్కొన్నాయి. కాగా, ఫైళ్లు, పత్రాలతోపాటు గల్లంతైన ఫైళ్లకు సంబంధించి బొగ్గు మంత్రిత్వ శాఖ సీబీఐకి సమగ్ర నివేదిక సమర్పించినట్టు ఆశాఖ అధికారి ఒకరు తెలిపారు.
అయితే అందులో ఉన్న వివరాల గురించి వెల్లడించేందుకు నిరాకరించారు. అది అత్యంత రహస్యమైన అంశమని, దాని గురించి తాను మాట్లాడబోనని పేర్కొన్నారు. కాగా, బొగ్గు కేటాయింపులకు సంబంధించిన ఫైళ్లను సీబీఐకి పంపించారా లేదా అనే అంశంపై ఆ శాఖ మంత్రి శ్రీప్రకాశ్ జైశ్వాల్ ఏ విషయమూ వెల్లడించలేదు. మరోవైపు గల్లంతైన బొగ్గు ఫైళ్ల వ్యవహారంపై ఎప్పుడు ఫిర్యాదు చేస్తారని అడగ్గా.. ‘సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా, చట్టప్రకారం నిర్దేశించిన సమయంలోనే తగిన చర్యలు తీసుకుంటాం’ అని బొగ్గుశాఖ అధికారి బదులిచ్చారు.