ఆసియాలోనే అతి పిన్నవయసు డేటా సైంటిస్ట్
అతనో అద్భుతం.. అసాధ్యాలను సుసాధ్యం చేయగల బాలనగధీరుడు. అంతర్జాతీయ స్థాయిలో అసమాన ప్రతిభాపాటవాలను చాటి అబ్బురపరిచిన జ్ఞానయోధుడు.. 15 ఏళ్లకే ఆసియాలోనే అతిపిన్న వయసున్న డేటా సైంటిస్టుగా గుర్తింపు పొందిన శక్తిమాన్.. తెలంగాణ ప్రభుత్వమూ అతని మహత్తర ప్రజ్ఞకు ముగ్ధురాలైంది. భూకంపాల రాకను ముందుగానే గుర్తించే ప్రాజెక్టు రూపకల్పన బాధ్యతను అప్పగించింది. ఈ బృహత్తర ఆవిష్కరణను భుజానికెత్తుకున్న బాలమేధావి ఎవరో కాదు.. పిల్లి సిద్ధార్థ శ్రీవాత్సవ్. స్వస్థలం తెనాలి.
తెనాలి: ప్రియ మానస, రాజ్‌కుమార్ దంపతుల ముద్దుల కొడుకు పిల్లి సిద్ధార్థ శ్రీవాత్సవ్. సిద్ధార్థకు చిన్ననాటి నుంచి కంప్యూటర్ అంటే మక్కువ ఎక్కువ. అతడి ఆసక్తిని గుర్తించిన తండ్రి నాలుగో తరగతినుంచే కంప్యూటర్ బేసిక్స్, టెక్నాలజీ, లాంగ్వేజెస్‌ను నేర్పిస్తూ వచ్చారు. నాలుగైదేళ్లు గడిచేసరికి సిద్ధార్థకు కంప్యూటర్‌పై పట్టు చిక్కింది. అడ్వాన్స్ లెవెల్‌కు చేరుకోగలిగాడు. సొంతంగా ఆన్లైన్లో కొన్ని నమూనా ప్రాజెక్టులు చేశాడు. ఉద్యోగం చేస్తానని తండ్రిని కోరాడు. కానీ ఆయన పెద్దగా పట్టించుకోలేదు. కంప్యూటర్ సంస్థలో అతడిని చేర్చాలని తీసుకువెళ్లగా బాలుడన్న కారణంతో తిరస్కరించారు. చేసేదిలేక రాజ్‌కుమార్ ఆన్లైన్ కోర్సులను కొనిచ్చారు. ఆ వీడియోలు చూస్తూ స్వయం అధ్యయనం ప్రారంభించిన సిద్ధార్థ వాటిపై కమాండ్ సాధించాడు.
సడలని సంకల్పం
ఉద్యోగం చేయడం భారత్‌లో సాధ్యం కాదని తండ్రి నిరాశపరిచినా సిద్ధార్థ పట్టు సడలలేదు. స్వయంగా రెజ్యూమ్ తయారుచేసుకుని ప్రముఖ కంపెనీలకు పంపాడు. కొన్ని కంపెనీలు ఫోన్లో సంప్రదించాయి. అతడి కంప్యూటర్ పరిజ్ఞానానికి అబ్బురపడినా వయసు తెలిసి మిన్నకున్నాయి. ఈ విషయం మోంటెగ్న్ కంపెనీ సీఈఓ వరకు వెళ్లడంతో ఆయన సిద్ధార్థను స్వయంగా పిలిపించుకుని సుదీర్ఘ ఇంటర్వ్యూ చేశారు. ‘నీతో వండర్స్ చేయిస్తా’నంటూ ఉద్యోగ ఆఫర్ ఇచ్చారు. చదువుకు ఆటంకం కలగరాదన్న తండ్రి షరతుతో వారంలో మూడురోజుల ఉద్యోగానికి సిద్ధార్థ ఓకే చేశాడు. పాఠశాల యాజమాన్యం సహకారంతో ఏడో తరగతిలోనే ఐటీ ఉద్యోగిగా నెలకు రూ.25 వేల జీతంతో చేరాడు. ప్రస్తుతం ఇనిఫినిటీ లెర్న్ అనే సంస్థలో డేటా సైంటిస్ట్‌గా నెలకు రూ.45 వేల వేతనం అందుకుంటున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వినూత్నమైన గేమ్ డిజైనింగ్‌లో కృషి చేస్తున్నాడు.
చదువుకు ఆటంకం కలగకుండానే..
స్వస్థలం తెనాలి అయినా సిద్ధార్థ కుటుంబం హైదరాబాద్‌లోనే ఉంటోంది. సిద్ధార్థ హైదరాబాద్‌లోని శ్రీచైతన్యలో పదోతరగతి చదువుతున్నాడు. వారంలో మూడురోజులు స్కూలుకు వెళ్లే అతను మూడురోజులు ‘ఇన్ఫినిటీ లెర్న్’ ఐటీ సంస్థలో ఉద్యోగానికి వెళ్తాడు. అంతేకాకుండా అమెరికన్ కంపెనీ ‘రైట్ ఛాయిస్’తరపున అక్కడి విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా కోడింగ్ క్లాసులనూ నిర్వహిస్తున్నాడు. అందుకే సిద్ధార్థను బైజూస్ కంపెనీ ‘యంగ్ జీనియస్’ అవార్డుతో సత్కరించింది.
బృహత్తర బాధ్యత
ఈ నేపథ్యంలో సిద్ధార్థకు తెలంగాణ ప్రభుత్వం బృహత్తర బాధ్యతను అప్పగించింది. భూకంపాల రాకను ముందుగానే గుర్తించే కేంద్రప్రభుత్వ రీసెర్చ్ ప్రాజెక్టుకు రూపకల్పన చేయాలని కోరింది. తెలంగాణ ఐటీ మంత్రిత్వశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేష్ రంజన్ స్వయంగా సిద్ధార్థను ఆహ్వానించి ఈ ప్రాజెక్టును అప్పగించారు. సిద్ధార్థ పరిశోధనలు ఫలిస్తే ఆ పరిజ్ఞానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తారని అతడి తండ్రి రాజ్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో ఈ ప్రాజెక్టు రీసెర్చ్ కొనసాగిస్తున్న సిద్ధార్థ.. మరోవైపు కోడింగ్ క్లాసులు చెబుతూ ఉద్యోగం చేస్తూ బాగానే ఆర్జిస్తున్నాడు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పైనా ఫ్రీలాన్సర్‌గా చేస్తున్నాడు. (క్లిక్: పుష్పపై ‘ఫైర్’.. స్మగ్లర్ వీరప్పన్‌కే ముచ్చెమటలు పట్టించి..)
లక్ష్యాల సాధనకు ప్రతిక్షణం కష్టపడతా..
తల్లిదండ్రుల ప్రోత్సాహంతోపాటు జుకర్ బర్గ్, సుందర్ పిచాయ్‌ల జీవితచరిత్రలు, బిల్‌గేట్స్ మాటలు, స్టీవ్‌జాబ్స్ పనితీరు నాకు ఆదర్శం. వారి ప్రేరణతోనే నా కలల సౌధాన్ని నిర్మించుకుంటున్నా. ప్రపంచ టాప్ ఫైవ్‌లోని గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం కంపెనీల్లో రీసెర్చ్ అండ్ అనాలసిస్ విభాగాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుల్లో భాగస్వామిని కావాలని ఉంది. మంచి గేమ్ డిజైన్ చేయాలనేది నా లక్ష్యం. ప్రజోపయోగ ప్రాజెక్టులు చేయాలనేది ధ్యేయం. వీలైతే మైక్రోసాఫ్ట్ లాంటి అప్లికేషన్ రూపొందించాలని ఉంది. నా లక్ష్యాల సాధనకు ప్రతిక్షణం కష్టపడతా.
– పిల్లి సిద్ధార్థ శ్రీవాత్సవ్, డేటా సైంటిస్టు