పాఠశాల ఘటన బాధ్యులపై చర్యలు తప్పవు
వేముల : స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శుక్రవారం జరిగిన సంఘటనకు సంబంధించి బాధ్యులపై చర్యలు తప్పవని ఎస్ఎస్ఏ రాష్ట్ర అధికారి గీత పేర్కొన్నారు. పాఠశాలలో పురుగుల అన్నం తిని 21 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో స్పందించిన ఎస్ఎస్ఏ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు పాఠశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అస్వస్థతకు గురైన 21 మంది విద్యార్థినులు కోలుకున్నారని, ప్రస్తుతం వారంతా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఈ ఘటనపై సిబ్బంది, ప్రత్యేకాధికారి ఉమాదేవిని విచారించినట్లు తెలిపారు. పాఠశాలలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్వో నిర్వాకం వల్లే ఇలా జరిగినట్లు విచారణలో తేలిందని, ఈ సంఘటనలో బాధ్యులైన వారిపై చర్యలు తప్పక తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జీసీడీవో ప్రమీల పాల్గొన్నారు.
పాఠశాల సంఘటనపై కలెక్టర్కు నివేదిక
పాఠశాలలో జరిగిన సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో కలెక్టర్ కె.వి.సత్యనారాయణకు నివేదిక ఇవ్వనున్నట్లు సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు. ఆయన శనివారం పాఠశాలను సందర్శించి బాలికల ఆరోగ్యంపై ఆరా తీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థినులు కోలుకున్నారని, పాఠశాలలో బాధ్యతలు నిర్వహిస్తున్న సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందన్నారు. గురువారం రాత్రి నుంచే విద్యార్థినులు కడుపు నొప్పితో బాధపడుతున్న విషయంపై సమాచారం ఇవ్వలేదన్నారు. ముందస్తు సమాచారం ఉన్నట్లయితే ఇలా జరిగేది కాదన్నారు. పాఠశాలకు సరఫరా అయిన బియ్యం నాసిరకంగా ఉన్నాయని తెలిపారు. దీనిపై పూర్తి వివరాలతో కలెక్టర్కు నివేదిక ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
ఎస్వో, ఇద్దరు వంట మనుషుల సస్పెన్షన్
విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్వో ఉమాదేవితో పాటు ఇద్దరు వంట మనుషులను కలెక్టర్ కేవీ సత్యనారాయణ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు సర్వశిక్షా అభియాన్ పీవో వెంకటసుబ్బయ్య తెలిపారు.