కరీంనగర్లో ఫిలిం ఇండస్ట్రీ
* సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ ప్రకటన
* తెలంగాణ ఉద్యమ పురిటి గడ్డకు 18న రాక
* ఔత్సాహికులను ప్రోత్సహించే దిశగా అడుగులు
* ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఎస్సారార్కళాశాల వేదికగా చర్చాగోష్టి
శాతవాహన యూనివర్సిటీ : సినిమా రంగమంటేనే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది హైదరాబాద్, ముంబయి, చెన్నై. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా ఏర్పడ్డాక కూడా సినీ పెద్దల చూపు విజయవాడ, వైజాగ్లవైపే పడుతోంది. అందరికీ భిన్నంగా ఆలోచిస్తూ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ మాత్రం కరీంనగర్లో సినీ పరిశ్రమను ఏర్పాటుపై దృష్టి సారించారు.
సాంకేతిక రంగంలో శరవేగంగా దూసుకుపోతున్న నేటికాలంలో ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్‌గా మారిన తరుణంలో చిత్ర పరిశ్రమ ఇంకా హైదారాబాద్, ముంబయి మీదే ఆధారపడాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ ఉద్యమ పురిటగడ్డ కరీంనగర్లో ‘న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ’ని ఏర్పాటు చేయాలని వర్మ భావిస్తున్నారు. ఒక ప్రాంతంలో ఎలాంటి సంబంధాలు, పరిచయాలు లేకపోయినా సినిమా నిర్మాణం చేసి దానిని ఎలా రిలీజ్ చేయవచ్చో వివరించేందుకు ఆయన సిద్ధమయ్యారు. అందుకు జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలను వేదికగా చేసుకున్నారు.
‘సాక్షి’ ఆధ్వర్యంలో కళాశాల వేదికగా ‘కరీంనగర్లో ఫిలిం ఇండస్ట్రీ-సాధ్యాసాధ్యాలు’ అనే అంశంపై ఈ నెల 18న ఉదయం 11 గంటలకు చర్చాగోష్టి నిర్వహించనున్నారు. సినిమా రంగంలో రాణించాలనే ఆసక్తి గలవారు ఈ సందర్భంగా రాంగోపాల్‌వర్మను కలిసే అవకాశాన్ని పొందవచ్చు. సినీ రంగంపై ఆసక్తి, అనుభవం, సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు, గతంలో షార్ట్‌ఫిల్మ్ చేసినవారు, సినిమా గేయాలు, రచనలు చేసినవారు, ఆసక్తి ఉండి అవకాశం కోసం ఎదురుచూసే ఔత్సాహికులెవరైనా తమ బయోడేటాను ‘సాక్షి’ జిల్లా కార్యాలయానికి పంపవచ్చు. పూర్తి వివరాలకు 92480 20207, 90100 31916, 85238 61961 నంబర్లలో సంప్రదించవచ్చు.