ఫెయిల్ చేశాడని టీచర్‌ను చెట్టుకు కట్టేసి కొట్టిన విద్యార్థులు
రాంచీ: విద్యాబుద్ధులు నేర్పే గురువులను ధైవంతో సమానంగా చూడాలంటారు పెద్దలు. కొన్నేళ్ల క్రితం అలాగే ఉండేది.. గురువుల పట్ల ఎంతో వినయంగా, భయం, భక్తితో మెలిగేవారు విద్యార్థులు. కానీ, ఇప్పుడు కాలం మారింది. గురువులనే ఎదురించే శిష్యులు తయారయ్యారు. అలాంటి సంఘటనే జార్ఖండ్‌లోని డుమ్కా జిల్లాలో వెలుగు చూసింది. 9వ తరగతి ప్రాక్టికల్ పరీక్షల్లో తక్కువ మార్కులు వేసి ఫెయిల్ చేశారని ఓ గణితం టీచర్, క్లర్క్‌ను చెట్టుకు కట్టేసి చితకబాదారు కొందరు విద్యార్థులు. గోపికందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్లో గత సోమవారం ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
తొమ్మిదో తరగతి పరీక్షల ఫలితాలను జార్ఖండ్ అకాడమీ కౌన్సిల్ గత శనివారం విడుదల చేసింది. స్కూల్లోని 9వ తరగతిలో 32 మంది ఉండగా.. అందులో 11 మందికి ప్రాక్టికల్ పరీక్షలో గ్రేడ్ ‘డీడీ’ వచ్చింది. అంటే ఫెయిల్ అయినట్లే. దీంతో మార్కులు వేసిన ఉపాధ్యాయుడు, వాటిని జేఏసీ సైట్లో అప్లోడ్ చేసిన క్లర్క్‌ను పట్టుకుని చితకబాదారు. అయితే.. ‘ఈ సంఘటనపై స్కూల్ యాజమాన్యం ఎలాంటి ఫిర్యాదు చేయకపోవటంతో ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఈ అంశాన్ని పరిశీలించిన తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ని కలిసి ఫిర్యాదు చేయాలని కోరాం. కానీ, విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందనే కారణంతో ఇచ్చేందుకు నిరాకరించారు.’ అని గోపికందర్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ నిత్యానంద్ భోక్తా తెలిపారు.
బాధిత ఉపాధ్యాయుడు సుమన్ కుమార్, క్లర్క్ సొనేరామ్ చౌరేగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. వారు సైతం ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. పాఠశాలలో మొత్తం 200 మంది విద్యార్థులు ఉండగా అందులో చాలా మంది ఈ సంఘటనలో పాల్గొన్నట్లు బీడీవో అనంత్ ఝా తెలిపారు. బాధిత టీచర్ గతంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేయగా.. ఆయన్ను తొలగించారు. ప్రస్తుత సంఘటనతో 9, 10వ తరగతులకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు.
In #Jharkhand’s Dumka district, a group of school students tied their teachers to a tree and allegedly beat them up for giving them low scores which resulted in the students failing their exams. pic.twitter.com/vdr1Amubp4
— Samira Nabila (@SamiraNabila1) August 31, 2022
ఇదీ చదవండి: అంకిత సజీవ దహన ఉదంతంలో ట్విస్ట్.. ఆమె మైనర్, ఆ ఫొటోలు మార్ఫింగ్ చేసినవే!