Staff strike
-
ఈఫిల్ టవర్ సందర్శన నిలిపివేత
పారిస్ : పారిస్‌లోని ఈఫిల్ టవర్ సందర్శనను అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిలిపివేశారు. సైట్ యాజమాన్యం తీసుకొచ్చిన నూతన విధానంతో ఈఫిల్ టవర్ సందర్శనకులు భారీ క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వారిని నిలువరించడం సిబ్బందిగా కష్టంగా మారింది. దీంతో బుధవారం మధ్యాహ్నం సమ్మెకు దిగిన ఉద్యోగులు టవర్ మూసివేశారు. అప్పటికే లోనికి వెళ్లిన పర్యాటకులకు మాత్రం మినహాయింపునిచ్చారు. గురువారం కూడా ఇదే రకంగా నిరసన తెలుపనున్నట్టు ఉద్యోగులు ముందుగానే ప్రకటించారు. గతేడాది ప్రఖ్యాత కట్టడాన్ని దాదాపు 60 లక్షల మంది సందర్శించారు. గత నెలలో ఈఫిల్ టవర్ సందర్శన టిక్కెట్లను సగం వరకు ఆన్లైన్లో ఉంచుతూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో బుక్ చేసుకునే వారికి టైమ్‌స్లాట్‌లను ఎంచుకునే అవకాశం కల్పించారు. అంతేకాకుండా సందర్శకులు తీసుకునే టికెట్‌ను బట్టి వారికి ఒక్కోరకం ఎలివేటర్లను కేటాయించారు. దీంతో అసలు సమస్య తలెత్తింది. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి కేటాయించే ఎలివేటర్లు మధ్యాహ్నం వరకు సగం మేర ఖాళీగా దర్శనమిస్తాయి. ఆ తర్వాత ఎలివేటర్లలో రద్దీ పెరుగుతోంది. దీంతో పర్యాటకులు భారీ క్యూలైన్లలో నిరీక్షించాల్సిన పరిస్థితి. దీనిపై ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. చాలా మంది పర్యాటకులు కూడా క్యూ లైన్లలో వేచి ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సందర్శకులను నియంత్రించడంలో తాము సహనం కొల్పోతున్నామని పేర్కొన్నారు. ఏ రకం టికెట్ తీసుకున్నా వారైనా అన్ని ఎలివేటర్లను ఉపయోగించుకునేలా నిబంధనల్లో మార్పులు చేయాలని కోరారు. కాగా ఈఫిల్ టవర్‌ను నిర్వహిస్తున్న ఎస్ఈటీఈ కంపెనీ మాత్రం తాము రోజుకు 10,000 టికెట్లు మాత్రమే ఆన్లైన్లో విక్రయిస్తున్నామని చెప్పారు. వేచి చూడాల్సిన సమయం కూడా చాలా తక్కువని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ఏదో ఒక అంశంపై ఇక్కడి సిబ్బంది నిరసనలకు దిగడం తరచు జరుగుతూనే ఉంది. -
మెట్రో సిబ్బంది సమ్మె బాట
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ)కు చెందిన 9000 మంది ఉద్యోగులు తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించకుంటే ఈనెల 30 నుంచి సమ్మె బాట పడతామని హెచ్చరించారు. డిమాండ్ల సాధన కోసం డీఎంఆర్సీకి చెందిన స్టాఫ్ కౌన్సిల్లో ఓ వర్గం ఈనెల 19 నుంచి యమునా నదీ తీరంలో, శారదా మెట్రో స్టేషన్ల వద్ద ప్రదర్శనలు చేపడుతున్నాయి. జూన్ 29లోగా తమ డిమాండ్లను నెరవేర్చనిపక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని డీఎంఆర్సీ స్టాఫ్ కౌన్సిల్ తేల్చిచెప్పింది. తమ డిమాండ్లను ఇప్పటికే ఢిల్లీ మెట్రో అధికారులకు, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్లామని పేర్కొంది. డీఎంఆర్సీ స్టాఫ్ కౌన్సిల్‌ను డీఎంఆర్సీ ఉద్యోగుల సంఘంగా మార్చాలన్నది తమ ప్రధాన డిమాండ్ అని, మూడవ వేతన సవరణ స్కేల్‌కు అనుగుణంగా తమకు ఐడీఏ వర్తింప చేయాలన్నవి ఇతర డిమాండ్లని కౌన్సిల్ సెక్రటరీ రవి భరద్వాజ్ చెప్పారు. నిరసనలో భాగంగా తొలిరోజు మెట్రో డ్రైవర్ల నుంచి స్టేషన్ కంట్రోలర్లు, ఇతర సిబ్బంది నల్ల రిబ్బన్లతో విధులకు హాజరవుతారని తెలిపారు. తదుపరి దశలో నిరాహార దీక్షలు చేపడతామని, ఎలాంటి ఆహారం తీసుకోకుండా విధులకు హాజరై ఫ్లాట్‌ఫాంలపై ప్రదర్శనలు చేపడతామని చెప్పారు. కాగా, మెట్రో సిబ్బంది సమ్మెతో మెట్రో రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడుతుందని భావిస్తున్నారు. -
ఎక్కడి చెత్త అక్కడే
జిల్లాలోని మునిసిపాలిటీల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. డిమాండ్ల సాధనకోసం పారిశుద్ధ్య కార్మికులు నాలుగురోజులుగా సమ్మెబాట పట్టారు. దీంతో వ్యర్థాలను తొలగించేవారు లేక అన్ని పట్టణాల్లో దుర్గంధం వెదజల్లుతోంది. సమ్మెకు దిగుతామని కార్మికులు ముందుగానే ప్రకటించినా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. - ‘పురం’.. దుర్గంధభరితం - మునిసిపాలిటీల్లో పేరుకుపోయిన చెత్తా చెదారం - సిబ్బంది సమ్మెతో లోపించిన పారిశుద్ధ్యం - ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేయని అధికారులు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జిల్లాలోని 11 మునిసిపాలిటీల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానంలో 964 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా సమ్మె చేపడుతుండగా, వీరికి మద్దతుగా 256మంది సిబ్బంది సమ్మెకు దిగడంతో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగామారింది. దీంతో మునిసిపాలిటీల్లో రోడ్లపై తిరగలేని దుస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించేంత వరకు సమ్మెను ఆపే పరిస్థితి కనిపించడం లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాల్సిన అధికారులు వాటి ఊసేఎత్తడం లేదు. కాంట్రాక్ట్ విధానంతో పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులరైజ్ చేసి సమస్యలు పరిష్కరించాలని గతంలో ఎన్నోసార్లు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. వెట్టిచాకిరీ చేయలేక సమ్మెకు దిగామని తెలంగాణ మునిసిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఖమర్ అలీ అన్నారు. నాలుగు రోజులుగా సమ్మెను కొనసాగిస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వం స్పందించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.