ఎక్కడి చెత్త అక్కడే
జిల్లాలోని మునిసిపాలిటీల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. డిమాండ్ల సాధనకోసం పారిశుద్ధ్య కార్మికులు నాలుగురోజులుగా సమ్మెబాట పట్టారు. దీంతో వ్యర్థాలను తొలగించేవారు లేక అన్ని పట్టణాల్లో దుర్గంధం వెదజల్లుతోంది. సమ్మెకు దిగుతామని కార్మికులు ముందుగానే ప్రకటించినా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
- ‘పురం’.. దుర్గంధభరితం
- మునిసిపాలిటీల్లో పేరుకుపోయిన చెత్తా చెదారం
- సిబ్బంది సమ్మెతో లోపించిన పారిశుద్ధ్యం
- ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేయని అధికారులు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జిల్లాలోని 11 మునిసిపాలిటీల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో 964 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా సమ్మె చేపడుతుండగా, వీరికి మద్దతుగా 256మంది సిబ్బంది సమ్మెకు దిగడంతో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగామారింది. దీంతో మునిసిపాలిటీల్లో రోడ్లపై తిరగలేని దుస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించేంత వరకు సమ్మెను ఆపే పరిస్థితి కనిపించడం లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాల్సిన అధికారులు వాటి ఊసేఎత్తడం లేదు.
కాంట్రాక్ట్ విధానంతో పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులరైజ్ చేసి సమస్యలు పరిష్కరించాలని గతంలో ఎన్నోసార్లు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. వెట్టిచాకిరీ చేయలేక సమ్మెకు దిగామని తెలంగాణ మునిసిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఖమర్ అలీ అన్నారు. నాలుగు రోజులుగా సమ్మెను కొనసాగిస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వం స్పందించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.