సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ)కు చెందిన 9000 మంది ఉద్యోగులు తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించకుంటే ఈనెల 30 నుంచి సమ్మె బాట పడతామని హెచ్చరించారు. డిమాండ్ల సాధన కోసం డీఎంఆర్‌సీకి చెందిన స్టాఫ్ కౌన్సిల్‌లో ఓ వర్గం ఈనెల 19 నుంచి యమునా నదీ తీరంలో, శారదా మెట్రో స్టేషన్ల వద్ద ప్రదర్శనలు చేపడుతున్నాయి. జూన్ 29లోగా తమ డిమాండ్లను నెరవేర్చనిపక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని డీఎంఆర్‌సీ స్టాఫ్ కౌన్సిల్ తేల్చిచెప్పింది.
తమ డిమాండ్లను ఇప్పటికే ఢిల్లీ మెట్రో అధికారులకు, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్లామని పేర్కొంది. డీఎంఆర్‌సీ స్టాఫ్ కౌన్సిల్‌ను డీఎంఆర్‌సీ ఉద్యోగుల సంఘంగా మార్చాలన్నది తమ ప్రధాన డిమాండ్ అని, మూడవ వేతన సవరణ స్కేల్‌కు అనుగుణంగా తమకు ఐడీఏ వర్తింప చేయాలన్నవి ఇతర డిమాండ్లని కౌన్సిల్ సెక్రటరీ రవి భరద్వాజ్ చెప్పారు.
నిరసనలో భాగంగా తొలిరోజు మెట్రో డ్రైవర్ల నుంచి స్టేషన్ కంట్రోలర్లు, ఇతర సిబ్బంది నల్ల రిబ్బన్లతో విధులకు హాజరవుతారని తెలిపారు. తదుపరి దశలో నిరాహార దీక్షలు చేపడతామని, ఎలాంటి ఆహారం తీసుకోకుండా విధులకు హాజరై ఫ్లాట్‌ఫాంలపై ప్రదర్శనలు చేపడతామని చెప్పారు. కాగా, మెట్రో సిబ్బంది సమ్మెతో మెట్రో రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడుతుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment