ఎకరం రూ.4 లక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువల సవరణ కసరత్తు కొలిక్కి వస్తోంది. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియలో భాగంగా వ్యవసాయ భూముల కనీస విలువపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఓ అభిప్రాయానికి వచ్చింది. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. రాష్ట్రంలోని ప్రతి ఎకరా వ్యవసాయ భూమి కనీస విలువను రూ.4 లక్షలుగా నిర్ధారించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. వాస్తవానికి ఈ విలువను రూ.4–5 లక్షలుగా నిర్ణయించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మౌఖికంగా సూచించింది. అయితే ఏజెన్సీ ఏరియాల్లో ఈ విలువలు సరిపోయే అవకాశం లేనందున భద్రాచలం, ములుగు, ఆసిఫాబాద్ లాంటి ఏజెన్సీ ప్రాంతాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూమి కనీస రిజిస్ట్రేషన్ విలువను రూ.4 లక్షలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అదే విధంగా నివాస స్థలాల కనీస విలువ ప్రతి చదరపు గజానికి రూ.1,000, అపార్ట్మెంట్ల కంపోజిట్ విలువ (చదరపు అడుగు) రూ.1,500గా ప్రతిపాదించాలని నిర్ణయించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చదరపు గజం కనీస విలువ రూ.500గా ప్రతిపాదించనున్నారు. ఈ మేరకు జరుగుతున్న కసరత్తు 90 శాతం పూర్తయిందని, సోమవారం సాయంత్రానికి రిజిస్ట్రేషన్ విలువల సవరణ ప్రతిపాదనలను క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు సమరి్పంచనున్నాయని తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ ప్రతిపాదనలపై ఈ నెల 25వ తేదీన ఆ శాఖ ఐజీ సమీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే ఆర్సీసీ నిర్మాణాలు, రేకుల షెడ్లకు సంబంధించిన కనీస విలువల నిర్ధారణకు సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా వెలువడాల్సి ఉందని, ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. మూడు కేటగిరీల్లో వ్యవసాయ భూముల విలువల సవరణ రాష్ట్రంలోని భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువను సవరించే ప్రక్రియలో భాగంగా వ్యవసాయ భూముల విలువలను మూడు కేటగిరీలుగా నిర్ధారించనున్నారు. గ్రామాల్లోని వ్యవసాయ భూములు (ఎక్కువ సర్వే నంబర్లలో ఇదే విలువ ఉంటుంది), రాష్ట్ర, జాతీయ రహదారుల పక్కన ఉండే వ్యవసాయ భూములు, వ్యవసాయేతర అవసరాలకు (వెంచర్లకు) వినియోగించేందుకు సిద్ధంగా ఉన్న భూములు..ఇలా మూడు కేటగిరీల్లో విలువలను నిర్ణయించనున్నారు. హైవేల పక్కన వ్యవసాయ భూముల విలువను రూ.40–50 లక్షల వరకు సవరించే అవకాశముందని, వ్యవసాయేతర అవసరాలకు సిద్ధంగా ఉన్న (ప్లాట్లుగా చేసేందుకు) భూమి విలువను రూ.కోటి వరకు సవరిస్తారని తెలుస్తోంది. అయితే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమీపంలో ఉన్న భూములకు, హైవేల పక్కనే ఉన్న నివాస ప్రాంతాలకు దూరంగా ఉండే భూములకు విలువల్లో తేడా ఉంటుందని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. సబ్ డివిజన్ సర్వే నంబర్లు, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలు, హెచ్ఎండీఏ, ఇతర నగర అభివృద్ధి సంస్థలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ప్రాతిపదికన వ్యవసాయ భూములు, ఆస్తుల సవరణ ప్రక్రియ సాగుతోందని అంటున్నారు. వాణిజ్య ప్రాంతాలు మిస్ కాకుండా ప్రత్యేక దృష్టి తాజాగా జరుగుతున్న రిజిస్ట్రేషన్ విలువల సవరణ ప్రక్రియలో భాగంగా వాణిజ్య ప్రాంతాలపై రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. గతంలో సవరణ జరిగినప్పుడు అప్పటివరకు వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టుగా నిర్ధారణ అయిన డోర్ నంబర్ల విలువలను మాత్రమే వాణిజ్య కేటగిరీలో పరిగణనలోకి తీసుకున్నారు. కానీ ఇప్పుడు వాణిజ్య డోర్ నంబర్లను ముందే ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించారు. నగర, పట్టణ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉండే వాణిజ్య సముదాయాలన్నింటికీ సంబంధించిన విలువల సవరణ ఆటోమేటిక్గా జరిగేలా ఈ సాఫ్ట్వేర్ను రూపొందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలోని ఏ ఒక్క కమర్షియల్ డోర్ నంబర్ తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని క్షేత్రస్థాయి కమిటీలకు వచ్చిన ఆదేశాల మేరకు చాలా పకడ్బందీగా వాణిజ్య ప్రాంతాల్లోని రిజిస్ట్రేషన్ విలువల సవరణ జరుగుతోంది. తక్కువ ఉన్న చోట భారీగా.. సవరణ ప్రక్రియకు రిజిస్ట్రేషన్ల శాఖ కొన్ని నిబంధనలను రూపొందించుకుంది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులు, నివాస స్థలాలకు సంబంధించి బహిరంగ మార్కెట్లో ఉన్న విలువను ప్రాతిపదికగా తీసుకుంటోంది. బహిరంగ మార్కెట్ విలువకు, ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రభుత్వ విలువకు భారీగా వ్యత్యాసం ఉన్న చోట (ప్రస్తుతం రిజిస్ట్రేషన్ విలువ తక్కువ ఉన్న ప్రాంతాల్లో) ఈసారి విలువలు భారీగా పెరగనున్నాయి. ఇందుకోసం రియల్ ఎస్టేట్ సంస్థల బ్రోచర్లు, ప్రకటనలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు రెవెన్యూ, మున్సిపల్ వర్గాల నుంచి సమాచారాన్ని తీసుకుంటున్నారు. ఇలాంటి చోట్ల 40 నుంచి 100 శాతం విలువలు పెరగనున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇప్పటికే రిజిస్ట్రేషన్ విలువ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఓ మోస్తరు సవరణలుండే అవకాశముంది. ఈ ప్రాంతాల్లో కనిష్టంగా 10 నుంచి గరిష్టంగా 20 శాతం వరకు మాత్రమే విలువలు సవరించనున్నారు. మొత్తం మీద ఈ విలువల సవరణ ప్రక్రియ ఈ నెల 29వ తేదీతో పూర్తి కానుండగా, అదే రోజు క్షేత్రస్థాయి కమిటీలు ఆ విలువను నిర్ధారించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నాయి. ఆ తర్వాత ఈ విలువలను ప్రభుత్వ వెబ్సైట్లో అప్లోడ్ చేసి ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం మరోమారు విలువల్లో మార్పులు, చేర్పులు చేసి ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలను అమల్లోకి తెచ్చేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సిద్ధమవుతోంది.