ఎన్ని ‘కల’
రూ. 4,599 కోట్ల బడ్జెట్‌కు ‘స్టాండింగ్’ పచ్చజెండా !
24న సర్వసభ్య సమావేశం
అక్కడ ఆమోదం లాంఛనమే
సంక్షేమ పథకాలకు పెద్దపీట
ఎన్నికల గాలి మొదలైంది. ఇదివరకెన్నడూ లేని విధంగా భారీ మొత్తంతో ‘గ్రేటర్’ బడ్జెట్‌కు స్టాండింగ్ కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రానున్న(2014-15) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 4599 కోట్ల బడ్జెట్‌కు బుధవారం జరిగిన స్టాండింగ్కమిటీ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ నెల 24న జరగనున్న సర్వసభ్య సమావేశంలో మమ అనిపించి ప్రభుత్వానికి నివేదించనున్నారు. రానున్నది ఎన్నికల సీజన్ అయినందున బడ్జెట్లో పేదలపై ప్రేమ కనబరుస్తూ సంక్షేమ పథకాలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు.
‘గ్రేటర్’ బడ్జెట్‌కు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. త్వరలోనే పార్లమెంటు.. అసెంబ్లీ.. ఆ తర్వాత జీహెచ్ఎంసీ పాలకమండలికి ఎన్నికలు జరుగనున్న తరుణంలో జీహెచ్ఎంసీ బడ్జెట్లో సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇచ్చారు. కమిషనర్ ప్రతిపాదించిన రూ.3850 కోట్ల బడ్జెట్‌కు మార్పులు, చేర్పులు చేసిన స్టాండింగ్ కమిటీ అదనంగా రూ. 749 కోట్లు చేర్చి, మొత్తం రూ. 4599 కోట్ల బడ్జెట్‌కు బుధవారం ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీలో తొలిసారిగా పేదల కడుపు నింపే పథకానికి అంకురార్పణ చేయనున్నారు. రూ. 5లకే సబ్సిడీపై భోజనాన్ని అందజేసే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
స్వచ్ఛమైన నీరందించే ప్లాంట్ల ఏర్పాటుకూ సిద్ధమయ్యారు. యువతను, విద్యార్థులను ఆకట్టుకునేందుకు క్రీడల్లో నైపుణ్యం కనబరిచేవారికి స్కాలర్‌షిప్‌ల కార్యక్రమాన్ని చేపడుతున్నారు. శివారు ప్రజలకు సంపూర్ణ మౌలిక సదుపాయాల కల్పనకు గతంలో హామీ ఇచ్చిన ఁటిప్*ను తిరిగి తెరపైకి తెచ్చారు. మొత్తంగా ఎవరికి వారుగా ఎంఐఎం.. కాంగ్రెస్ తామే ఈ సంక్షేమఫలాలు అందుబాటులోకి తెచ్చామని చెప్పి రానున్న ఎన్నికల్లో ప్రజల ఓట్లు కొల్లగొట్టేందుకు పాచిక వేశాయి. స్టాండింగ్ కమిటీ పచ్చజెండా ఊపిన బడ్జెట్.. అందులోని ముఖ్యాంశాలను మేయర్ మాజిద్‌హుస్సేన్, కమిషనర్ సోమేశ్‌కుమార్ బుధవారం విలేకరులకు వెల్లడించారు.
శి‘వార్’
గ్రేటర్లో విలీనమైన శివారు మునిసిపాలిటీలకు మౌలిక సదుపాయాల కల్పనకు తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ పార్టీలకతీతంగా పలువురు కార్పొరేటర్లు మేయర్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఒకవైపు స్టాండింగ్ కమిటీ సమావేశం జరుగుతుండగా మరోవైపు వీరు ఈ ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే టిప్ కింద నిధులు కేటాయించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సుమలతా రెడ్డి, సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి, హరివర్ధన్ రెడ్డి, సురేష్‌రెడ్డి, ప్రసన్నకుమారి తదితరులు పాల్గొన్నారు.
రూ.ఐదు కే 15 వేల మందికి భోజనం
పేదలకు రూ. 5కే భోజనాన్ని అందించే కొత్త కార్యక్రమానికి శ్రీకారం.
‘గ్రేటర్’లో ఎంపిక చేసిన 50 ప్రాంతాల్లో...
తొలుత వచ్చిన 300 మందికి భోజనం అందిస్తారు.
రోజుకు 15,000 మందికి ఈ సదుపాయం.
ప్రముఖ సంస్థకు ఈ బాధ్యతలు అప్పగిస్తారు.
సబ్సిడీ వ్యయాన్ని జీహెచ్ఎంసీ భరిస్తుంది.
రోజుకు ఒక పూట మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది.
క్రీడాకారులకు ‘స్పోర్ట్స్ ఫెలోషిప్స్’
ఎన్నికల వేళ యువతను ఆకట్టుకునేందుకు ‘స్పోర్ట్స్ ఫెలోషిప్’ ఇవ్వనున్నారు.
క్రీడల్లో జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి నెలకు రూ.ఐదు వేలు, రాష్ట్రస్థాయి వారికి రూ. రెండు వేలు ఇవ్వనున్నారు.
జిల్లా స్థాయి వారికి రూ. 1000, క్రీడాకారులకు రూ. 500 ఫెలోషిప్ అందించనున్నారు.
ఇందుకోసం బడ్జెట్లో రూ. 5 కోట్లు ప్రతిపాదించారు.
అవసరమైతే ఈ నిధుల్ని మరింత పెంచుతామని మేయర్ చెప్పారు.
పేద లకు స్వచ్ఛమైన తాగునీరు
మురికివాడల్లోని పేదలకు స్వచ్ఛమైన తాగునీరు అందించనున్నారు.
ఇందుకు 400 నీటిశుద్ధి కేంద్రాలు ఏర్పాటు.
ఈ కార్యక్రమ అమలుకు రూ. 20 కోట్లు కేటాయిస్తారు.
నిధుల సేకరణకు టాక్స్ఫ్రీబాండ్లు జారీ చేస్తారు.
వీటి ద్వారా రూ. 300 కోట్లు సేకరించాలనేది లక్ష్యం.
మళ్లీ తెరపైకి ‘టిప్’
‘టిప్’(సంపూర్ణ మౌలిక సదుపాయాల కల్పన)ను మళ్లీ తెరపైకి తెచ్చారు.
ఇందుకు రూ. 300 కోట్లు ప్రతిపాదించారు.
గ్రేటర్లో కలిసిన శివారు ప్రాంతాల్లో (50 డివిజన్లలో) సదుపాయల కల్పనకే ఈ నిధులు.
వీటిని బ్యాంకు రుణాల ద్వారా సేకరిస్తారు.
కాలనీ ప్రజల నుంచి 30 శాతం నిధులు సేకరిస్తారు.