Year Ender 2024: ఈ ఏడాది పెళ్లి చేసుకున్న సీనీ తారలు వీళ్లే
‘శ్రీరస్తూ శుభమస్తు... శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం... ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం’... ‘పెళ్ళి పుస్తకం’ చిత్రంలోని ఈ పాట తెలుగింటి పెళ్లి వేడుకల్లో వినబడుతుంటుంది. 2024లో పెళ్లితో ‘కల్యాణం... కమనీయం...’ అంటూ తమ జీవిత పుస్తకంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించిన స్టార్స్ చాలామందే ఉన్నారు. ఇక ఏయే తారలు ఏయే నెలలో, ఏ తేదీన పెళ్లి చేసుకున్నారనే విశేషాలు తెలుసుకుందాం.ఫిబ్రవరిలో... నార్త్, సౌత్‌లో హీరోయిన్గా ఓ మంచి స్థాయికి వెళ్లిన ఉత్తరాది భామ రకుల్ ప్రీత్ సింగ్ ఉత్తరాది ఇంటి కోడలు అయ్యారు. బాలీవుడ్ నటుడు–నిర్మాత జాకీ భగ్నానీతో 21న ఆమె ఏడడుగులు వేశారు. వీరిది ప్రేమ వివాహం. పెద్దల సమ్మతితో గోవాలో పెళ్లి చేసుకున్నారు. మార్చిలో... పంజాబీ భామ కృతీ కర్బందా, బాలీవుడ్ నటుడు పుల్కిత్ సామ్రాట్‌తో మార్చి 15న ఏడు అడుగులు వేశారు. వీరిది ప్రేమ వివాహం. గుర్గావ్లో వీరి వివాహం జరిగింది. ⇒ సౌత్, నార్త్‌లో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోని 23న వివాహం చేసుకున్నారు. పదేళ్లు రిలేషన్షిప్లో ఉన్న వీరిద్దరూ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకున్నారు. జూన్‌లో... నటుడు అర్జున్ పెద్ద కుమార్తె, నటి ఐశ్వర్యా అర్జున్, తమిళ స్టార్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు, నటుడు ఉమాపతిల వివాహం చెన్నైలో జరిగింది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఐశ్వర్య–ఉమాపతి పెద్దల అంగీకారంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ⇒ ప్రముఖ బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా కుమార్తె, హీరోయిన్ సోనాక్షీ సిన్హా, బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బాల్ ఏడడుగులు వేశారు. 23న వీరి వివాహం ఘనంగా జరిగింది. జూలైలో... వరలక్ష్మీ శరత్ కుమార్ తన ప్రేమికుడు, ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడైన నికోలయ్ సచ్దేవ్తో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో థాయ్‌ల్యాండ్‌లో 2న వీరి పెళ్లి జరిగింది. ఆగస్టులో... ‘రాజావారు రాణిగారు’ (2019) సినిమాతో తెలుగులో హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్. రీల్ లైఫ్‌లో ప్రేమికులుగా నటించిన ఈ ఇద్దరూ రియల్ లైఫ్‌లో భార్యాభర్తలయ్యారు. ఆ మూవీ సమయంలో వీరి మధ్య ఏర్పడిన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో కర్నాటకలోని కూర్గ్‌లో 22న కిరణ్–రహస్య వివాహం చేసుకున్నారు. సెప్టెంబరులో... హీరోయిన్ మేఘా ఆకాశ్ తన ప్రియుడు సాయి విష్ణుని పెళ్లాడారు. వీరి వివాహం 15న చెన్నైలో ఘనంగా జరిగింది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన సాయి విష్ణుతో మేఘా ఆకాశ్ చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి పచ్చజెండా ఊపడంతో ఏడడుగులు వేశారు. ⇒ గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న హీరో సిద్ధార్థ్, హీరో యిన్ అదితీరావు హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తొలుత తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల పురాతన రంగనాథస్వామి ఆలయంలో మార్చి 27న, ఆ తర్వాత రాజస్థాన్‌లోని ఓ రిసార్ట్‌లో సెప్టెంబరు 16న డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. నవంబరులో... ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పెళ్లి పీటలెక్కారు. డాక్టర్ ప్రీతీ చల్లాతో 11న ఆయన ఏడడుగులు వేశారు. ‘వేదం, గమ్యం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి చిత్రాలతో తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు క్రిష్. ప్రీతీతో ఆయన వివాహం హైదరాబాద్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. ⇒ తెలుగు చిత్ర పరిశ్రమలో గాయకులుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న రమ్య బెహరా, అనురాగ్ కులకర్ణి 15న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ⇒ నటుడిగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దక్షిణాదిలో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్న సుబ్బరాజు పెళ్లి పీటలెక్కారు. స్రవంతితో ఆయన ఏడడుగులు వేశారు. 26న వీరి వివాహం జరిగింది. డిసెంబరులో.. హీరో అక్కినేని నాగచైతన్య– హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక పెళ్లి పందరిలో వీరిద్దరూ ఏడడుగులు వేశారు. ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా చైతన్య–శోభితల పరిచయం ప్రేమగా మారి, ఆ తర్వాత పెళ్లి పీటల వరకూ వచ్చింది. పెద్దల అంగీకారంతో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ⇒ ‘కలర్ ఫొటో’ (2020) సినిమా డైరెక్టర్ సందీప్ రాజ్, నటి చాందినీ రావుతో కలిసి ఏడడుగులు వేశారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో తిరుమలలో 7న వీరి వివాహం జరిగింది. ‘కలర్ ఫొటో’ చిత్రంలో చిన్న పాత్ర చేసిన చాందినీ రావుతో ఆయన పెళ్లి జరగడం విశేషం. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ⇒ ‘నువ్వేకావాలి, ప్రేమించు’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సాయికిరణ్. ఆ తర్వాత సీరియల్స్ వైపు వెళ్లిన ఆయన బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ నెల 9న ఆయన స్రవంతి అనే సీరియల్ ఆర్టిస్ట్‌ని వివాహం చేసుకున్నారు. ⇒ మహానటిగా ప్రేక్షకుల మనసుల్లో స్థానం సొంతం చేసుకున్నారు కీర్తీ సురేష్ తన చిన్న నాటి స్నేహితుడు, వ్యాపారవేత్త ఆంటోనీ తట్టిల్‌తో ఈ నెల 12న ఏడడుగులు వేశారు. వీరిద్దరి మధ్య 15 ఏళ్లుగా స్నేహం, ప్రేమ కొనసాగుతోంది. ఇరు కుటుంబ సభ్యులు ఓకే చెప్పడంతో గోవాలో వీరి వివాహం జరిగింది. ⇒ ‘మత్తు వదలరా, మత్తు వదలరా 2’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు శ్రీసింహా (సంగీతదర్శకుడు కీరవాణి తనయుడు). ఆయన వివాహం నటుడు మురళీమోహన్ మనవరాలు మాగంటి రాగతో దుబాయ్‌లో 14న జరిగింది. ⇒ ఇలా 2024లో ఎక్కువమంది తారలు వివాహబంధంలోకి అడుగుపెట్టం విశేషం.