ఆస్కారం లేదా?
మార్చి 4, 2018. ఆదివారం.
సాయంత్రం 5 గంటలకు..
(భారత కాలమానం ప్రకారం
సోమవారం ఉదయం 6:30 గంటలకు..)
లాస్‌ఏంజిలెస్‌లోని హాలీవుడ్
డాల్బీ థియేటర్లో కన్నుల పండువగా ఒక
వేడుక జరుగుతుంది. 10 కోట్లమందికి పైనే
ఆ వేడుకను టీవీల్లో, ఆన్లైన్లో చూస్తారని అంచనా. ‘ఆస్కార్ అవార్డ్స్’ పేరుతో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నిర్వహించే ఈ వేడుక కోసం సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఈసారి జరిగే వేడుక 90వది. మొత్తం ఇరవై నాలుగు విభాగాల్లో అవార్డులిస్తారు. ‘అన్డ్ ది అవార్డ్ గోస్ టూ..’ అనే మాట తర్వాత ఎవరి పేరైతే వినిపిస్తుందో ఆ పేరు ఇంక చరిత్రలో రికార్డయిపోతుంది. మన ఇండియా తరఫున ఇందులో ఎన్ని పేర్లు నమోదయ్యాయి? ఇండియన్ సినిమా ప్రస్తావన ఆస్కార్ వేడుకలో ఎన్నిసార్లొచ్చింది? మన సినిమాకు ఆస్కార్ అందుకునే ఆస్కారం లేదా?
ఈ ఏడాది ఆస్కార్ వేడుకను ఇండియన్ ప్రేక్షకుల కోసం స్టార్మూవీస్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. భారత కాలమానం ప్రకారం మార్చి 5 (సోమవారం) ఉదయం 5:30 గంటలకు లైవ్ మొదలవుతుంది.
ఆస్కార్స్నే ‘అకాడమీ అవార్డ్స్’ అని కూడా అంటారు. 1929లో మొదటిసారి ఆస్కార్ అవార్డులు ప్రారంభమయ్యాయి. ఆస్కార్స్ కేవలం హాలీవుడ్ సినిమాలకు మాత్రమే ఇస్తారు. మొదట్లో 12 క్యాటగిరీల్లో అవార్డులు ఇచ్చేవారు. ఈ తొంభై ఏళ్లలో మూవీ మేకింగ్‌లో వచ్చిన మార్పులు, మారిన టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని ఆ అవార్డుల సంఖ్యను 24కు పెంచారు. ఈ ఇరవై నాలుగులోనే వచ్చి చేరిన ‘బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్’ అనే క్యాటగిరీ ఇంగ్లిష్ భాషలో కాకుండా తెరకెక్కిన ఇతర ప్రపంచ భాషల సినిమాలను కూడా తమలో కలుపుకునేందుకు ఆస్కార్ చేర్చుకున్న ఓ అవార్డు.
బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్
‘బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్’ అనే క్యాటగిరీని ఆస్కార్స్ 1956లో మొదటిసారి తీసుకొచ్చింది. ఆ తర్వాతి సంవత్సరం నుంచే ఇండియన్ సినిమా ఈ క్యాటగిరీ కింద ఆస్కార్‌కు ఎంట్రీలను పంపిస్తూనే ఉంది. 1957నుంచి 2017 వరకూ మొత్తం యాభై సినిమాలను ఆస్కార్‌కు ఎంట్రీలుగా పంపింది ఇండియన్ సినిమా. 1984 తర్వాత ఒక్క 2003లో తప్పితే క్రమం తప్పకుండా ఇండియా ఆస్కార్‌కు ఎంట్రీలను పంపుతూనే ఉంది.
ఆస్కార్ అవార్డులకు ఉన్న ప్రాముఖ్యత, పేరు, క్రేజ్ దృష్ట్యా ఒక సినిమా ‘బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్’ క్యాటగిరీలో అవార్డు అందుకుంటే ఆ సినిమాను దేశానికే పేరు తెచ్చే సినిమాగా చూస్తారు. ఈ నేపథ్యంలోనే అన్ని దేశాలూ ఈ క్యాటగిరీకి తమ సినిమాలను ఎంట్రీగా పంపడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి, అఫీషియల్‌గా సెలెక్ట్ చేస్తాయి. ఇండియా తరఫున ఆస్కార్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్ఐ) సంస్థ ఎంట్రీలను పంపిస్తుంది. దేశవ్యాప్తంగా ఎఫ్ఎఫ్ఐకి వచ్చే సినిమాలను ఒక కమిటీ చూసి, బెస్ట్ అనుకున్న సినిమాను ఇండియా నుంచి ఆస్కార్‌కు ఎంట్రీగా పంపిస్తుంది. 2017 సంవత్సరానికి సంబంధించి ఇండియా తరఫున ‘న్యూటన్’ అనే సినిమా ఆస్కార్‌కు ఎంట్రీగా వెళ్లింది. అయితే ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్‌లో న్యూటన్ చోటు దక్కించుకోలేదు.
వందకు పైగా దేశాలు పంపించే సినిమాల్లో ఐదు సినిమాలను ఫైనల్ లిస్ట్‌లో నామినేషన్స్‌గా తీసుకుంటుంది ఆస్కార్. ఇండియా నుంచి వెళ్లిన సినిమాల్లో ఇప్పటివరకూ అలా ఫైనల్ నామినేషన్స్ దక్కించుకున్న సినిమాలు మూడే మూడు.. మదర్ ఇండియా (1957), సలామ్ బాంబే (1988), లగాన్ (2001). అయితే ఈ మూడు సినిమాలూ ఆస్కార్‌ను మాత్రం అందుకోలేకపోయాయి. మిగతా నలభై ఏడు సినిమాలు ఎంట్రీలుగానే వెళ్లి వెనక్కి వచ్చేశాయి. ఈ నలభై ఏడులో ఉన్న ఒకే ఒక్క తెలుగు సినిమా స్వాతిముత్యం (1986).
ఇండియా నుంచి ఆస్కార్ ఎంట్రీకి వెళ్లిన ఫస్ట్ సినిమా మదర్ ఇండియా వెళ్లడమే నామినేషన్ దక్కించుకుంది. అయితే చివర్లో ఒకే ఒక్క ఓటు తేడాతో అవార్డును కోల్పోయింది. ఇక ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ను ఒక ఊపు ఊపిన లగాన్ ఆస్కార్ తప్పకుండా అందుకుంటుందన్న ఆశలు రేకెత్తించినా, ఆ సినిమా కూడా అదృష్టానికి నోచుకోలేదు. లగాన్ తర్వాత ఇన్నేళ్లైనా ఒక్క సినిమా కూడా ఇండియా నుంచి ఆస్కార్‌కు నామినేట్ అవ్వలేదు.
ఈ క్యాటగిరీలో టాప్ ప్లేస్‌లో ఉన్న ఇటలీ దేశం 14 అవార్డులను సొంతం చేసుకుంది. ఫ్రాన్స్ (12), స్పెయిన్ (4), జపాన్ (4), స్వీడన్ (3) టాప్ ఫైవ్‌లో ఉన్నాయి. అవార్డులు, నామినేషన్స్ కలిపిచూస్తే ఇండియా (0 అవార్డులు, 3 నామినేషన్లు) 33వ స్థానంలో ఉంది.
మనకు ఆస్కారం లేదా?
సంవత్సరానికి వెయ్యికి పైగా సినిమాలను నిర్మిస్తూ, ప్రపంచంలోనే అతిపెద్ద సినీ పరిశ్రమగా పేరున్న ఇండియన్ సినిమా, ఆస్కార్‌లో మాత్రం 60 ఏళ్ల కాలంలో ఒక్క అవార్డు కూడా దక్కించుకోలేకపోవడం బాధాకరం. మరి మన సినిమా ఆస్కార్ దగ్గర నిలబడలేదా? మన సినిమాకు అంత సీన్ లేదా? అంటే సరైన సమాధానం నిజంగా లేదు. ప్రపంచ సినిమాతో పోటీ పడగల సినిమాలు మనదగ్గర రావడం లేదన్నది, ఇక్కడ వచ్చేవన్నీ కమర్షియల్ సినిమాలే అన్న వాదన ప్రధానంగా వినిపిస్తోంది.
అదేవిధంగా ఎఫ్ఎఫ్ఐ ఏటా పంపించే సినిమాల విషయంలో కూడా ఎప్పుడూ వివాదాలు తలెత్తుతూనే ఉంటాయి. ఆస్కార్ వద్ద నిలబడే సత్తా ఉన్న సినిమాలను తప్పించి మరీ, అర్హతలేని సినిమాలను పంపిస్తున్నారన్న వివాదం ఎక్కువగా వినిపిస్తూంటుంది. దీనికి పరిష్కారంగా నేషనల్ అవార్డ్ దక్కించుకున్న సినిమానే ఆస్కార్‌కు పంపిస్తే బాగుంటుందన్న ఒక ప్రతిపాదన వచ్చినా, దాన్ని కూడా పక్కనబెట్టేశారు. ఇలాంటి విచిత్ర పరిస్థితుల్లో వందకు పైగా దేశాలు పోటీపడే అవార్డుకు మన సినిమా ఎంపికవ్వాలంటే? ప్యారలల్ సినిమాకు మార్కెట్ పెరగాలన్నది సినిమా పెద్దలు పరిష్కారంగా చెబుతున్నారు.
అలాంటి సినిమాలకు ఇక్కడ మార్కెట్ లేకపోవడంతో ప్యారలల్ సినిమాలు రావడం లేదని, ఒకవేళ వచ్చినా క్వాలిటీలో రాజీపడే సినిమాలే వస్తున్నాయన్నది చాలామంది చెప్పే మాట. భారీ బడ్జెట్ సినిమాల వైపే మొగ్గు చూపుతోన్న పెద్ద నిర్మాణ సంస్థలు కూడా కంటెంట్ ఉన్న, కొత్తదనమున్న క్వాలిటీ సినిమాలను ప్రోత్సహిస్తే ఫలితాలు ఉంటాయని ఆశించొచ్చు. కరణ్ జోహర్, అనురాగ్ కశ్యప్, యూటీవీ పిక్చర్స్.. ఇలా పేరున్న నిర్మాతలు, నిర్మాణ సంస్థలు కలిసి చేసిన ‘లంచ్‌బాక్స్’ లాంటి ప్రయోగాలు పెరిగితే, ఆస్కార్ బరిలో నిలిచి, మన సినిమా అవార్డు అందుకునేందుకు ఎంతో దూరం లేదని ఆశించొచ్చు. ముందు ఆ దిశగా ఇండియన్ సినిమా అడుగులు వెయ్యాలి!
స్పీల్బర్గ్ దేవుడికంటే ఎక్కువ!
దర్శకుడు స్పీల్బర్గ్ను తమ ఇన్స్పిరేషన్గా చెప్పుకునేవాళ్లు ఎందరో! ఆయన సినిమాలన్నీ కలిపి ఇప్పటివరకూ ఆస్కార్ వద్ద వివిధ క్యాటగిరీల్లో 112 నామినేషన్స్ దక్కించుకున్నాయి. ఇది అతిపెద్ద రికార్డ్! అలాగే అవార్డు వేదిక మీద విన్నర్స్ ఇచ్చే థ్యాంక్యూ స్పీచ్‌లో కూడా స్పీల్బర్గ్దే రికార్డు. థ్యాంక్యూ స్పీచ్‌లలో ఆయన పేరు 43సార్లు వినిపించింది. ఈ లిస్ట్‌లో దేవుడు (19) కూడా స్పీల్‌బర్గ్‌కు చాలా దూరంలోనే ఉండిపోయాడు.
ఆస్కార్‌కు అర్హత పొందేదెలా?
‘బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్’, కొన్ని హానరరీ అవార్డులను మినహాయించి మిగతా ఆస్కార్ అవార్డులన్నీ హాలీవుడ్ సినిమాలకు, ఆ సినిమాలకు పనిచేసిన వాళ్లకే ఇస్తారు. ఆస్కార్‌కు అర్హత పొందాలంటే ఒక సినిమా..
40 నిమిషాలకు మించిన నిడివి ఉండాలి ∙లాస్ ఏంజెలెస్‌లోని ఏదో ఒక కమర్షియల్ థియేటర్లో వారంరోజుల పాటు ఆ సినిమా ఆడాలి ∙థియేటర్లో కాకుండా నేరుగా డీవీడీల్లో, ఆన్లైన్లో విడుదలైన సినిమాలను లెక్కలోకి తీసుకోరు.
ఆస్కార్ ఎలా ఇస్తారు?
ఆస్కార్ అవార్డు పొందేందుకు అర్హత ఉన్న సినిమాలను నిర్మాతలనుంచి ఆస్కార్ కమిటీ ఆహ్వానిస్తుంది. అలా ఏటా మూడొందలకుపైనే సినిమాలు ఆస్కార్ పరిశీలనకు వస్తాయి. కమిటీ ఈ సినిమాలను పరిశీలించి, వివిధ క్యాటగిరీల్లో నామినేషన్స్ ప్రకటిస్తుంది. సాధారణంగా జనవరి నెలలో ఈ నామినేషన్స్ ప్రకటిస్తారు. ఫిబ్రవరి నెలాఖర్లో, మార్చి మొదటివారంలో విజేతలను ఆస్కార్ వేడుకలో ప్రకటిస్తారు. విజేతలను ఎంపిక చేయడానికి ఆస్కార్‌లో ఆరు వేలకు పైనే మెంబర్స్ ఉంటారు. ఓటింగ్ ద్వారా ఈ మెంబర్స్ విజేతలను ఎంపిక చేస్తారు.
ఆస్కార్ బిగ్ ఫైవ్..
ఆస్కార్‌లో ఉన్న అన్ని క్యాటగిరీల్లోకి టాప్ ఫైవ్ అనదగ్గవి.. బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్, అడాప్టెడ్). ఈ ఐదు అవార్డులను కలిపి బిగ్ ఫైవ్ అంటారు. ఇప్పటివరకూ బిగ్ ఫైవ్ అవార్డులను సొంతం చేసుకున్న సినిమాలు మూడు మాత్రమే. ఇట్ హ్యాపెండ్ వన్ నైట్ (1934), వన్ ఫ్లూ ఓవర్ ది కుక్కూస్ నెస్ట్ (1975), ది సైలెన్స్ ఆఫ్ ది ల్యాంబ్స్ (1991).
ఆ సీల్ వెనుక పెద్ద కథ..
ఆస్కార్ సీల్డ్ ఎన్వలప్ వెనుక ఒక కథ ఉంది. 1939కి ముందు ప్రత్యేకంగా ఆస్కార్ విజేతల పేర్లు దాచడమంటూ ఉండేది కాదు. ప్రెస్‌కి కూడా ఆ పేర్లు ముందే ఇచ్చేసి, రాత్రి పదకొండు తర్వాతే ప్రింట్‌కి పంపించాలన్న నిబంధన పెట్టేవారు. అయితే 1939లో న్యూయార్క్ మ్యాగజైన్ రాత్రి పదకొండుకు ముందే విజేతల పేర్లు ప్రకటించడంతో 1940 నుంచి సీల్డ్ ఎన్వలప్‌ను పట్టుకొచ్చారు. 120 గ్రాములుండే గోల్డ్ ఎన్వలప్లో విజేతల పేర్లు రాసి ఉంటాయి. దాన్ని సీల్ చేసి ఉంచుతారు. అందులో ఏ పేరు ఉంటుందన్న విషయం ఆస్కార్ కమిటీకి తప్ప ఎవ్వరికీ తెలియదు.
ఆస్కార్ ట్రోఫీ అంతా బంగారం కాదు!
ఆస్కార్ ప్రతిమను ఎప్పుడైనా సరిగ్గా గమనించారా? బంగారువర్ణంలో ఉండే ఆ ట్రోఫీని నిజానికి కంచుతో చేస్తారు. కత్తిని నిలువునా పట్టుకున్న ఒక సైనికుడి రూపంలో ఉన్న బొమ్మ, ఫిల్మ్ రీల్‌పై నిలబడి ఉంటుంది. ఆ బొమ్మకంతా 24 క్యారెట్ బంగారంతో కోటింగ్ ఇస్తారు. పదమూడున్నర అంగుళాల పొడవుండే ఆస్కార్ ట్రోఫీ, 3.85 కిలోల బరువు ఉంటుంది. సెడ్రిక్ గిబ్బన్స్ ఈ ఆస్కార్ ట్రోఫీని డిజైన్ చేశాడు.
ఆస్కార్‌ను అమ్ముకోవచ్చా?
ఆస్కార్‌ను కళాకారులు తమకిచ్చిన గౌరవంగా భావిస్తారు. అలాంటి ఆస్కార్‌ను ఎలాంటి సందర్భంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా అమ్మేసుకునే అధికారం విజేతలకు లేదు. ఈమేరకు ఆస్కార్స్ వారిచేత ఒక అగ్రిమెంట్ కూడా రాయించుకుంటుంది. ఆస్కార్‌ను ఓపెన్ మార్కెట్లో అమ్మేయాలని అనుకునేవారు ముందుగా ఆస్కార్‌కు ఒక్క డాలర్‌కు ఆఫర్ చేయాల్సి ఉంటుంది. 1950లో ఈ నిబంధనను ప్రవేశపెట్టారు.
ఆస్కార్ సినిమాల్లో ఇండియా
ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాల్లో కొన్ని ఆస్కార్ అవార్డుల్లో సత్తా చాటిన సందర్భాలు ఉన్నాయి. ‘గాంధీ’, ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’, ‘లైఫ్ ఆఫ్ పై’ సినిమాలు బిగ్ ఫైవ్ అవార్డుల్లో కీలక అవార్డులు గెలిచాయి. ‘గాంధీ’, ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఈ రెండు సినిమాలూ కీలకమైన బెస్ట్ పిక్చర్ అవార్డును దక్కించుకుంటే, ‘లైఫ్ ఆఫ్ పై’ నామినేషన్ వరకూ వచ్చింది.
మన ఆస్కార్ విజేతలు..!
ఇండియన్ సినిమా ఆస్కార్ వద్ద ప్రతిసారీ ఖాళీ చేతులతోనే వెనక్కి వచ్చినా, ఇండియన్ స్టార్స్ కొందరు ఆస్కార్ అందుకొని మన సినిమా పేరును ప్రపంచం మొత్తం వినిపించారు. హాలీవుడ్ సినిమాలకు పనిచేయడం ద్వారా, ఆస్కార్స్‌లో వివిధ క్యాటగిరీల్లో వీళ్లు అవార్డులు అందుకున్నారు.
ఆస్కార్ అందుకున్న భారతీయులు వీళ్లే..
భాను ఆతేయ: 1983లో ‘గాంధీ’ సినిమాకుగానూ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్‌కు ఆస్కార్ అవార్డు అందుకుంది. ఇండియా నుంచి ఫస్ట్ ఆస్కార్ అందుకున్న వ్యక్తి కూడా ఈమే కావడం విశేషం.
సత్యజిత్‌రే: ఇండియన్ సినిమా పేరును ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన దర్శకుడు సత్యజిత్‌రే సినీ పరిశ్రమకు అందించిన సేవలను గుర్తిస్తూ 1992లో ఆస్కార్స్ ఆయనకు ‘అకాడమీ హానరరీ అవార్డ్’ను ప్రదానం చేసింది.
ఎ.ఆర్.రెహమాన్: ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథతో తెరకెక్కిన స్లమ్‌డాగ్ మిలియనీర్’ సినిమాకుగానూ ఎ.ఆర్. రహమాన్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ సాంగ్ అవార్డులను అందుకున్నాడు.
గుల్జార్: స్లమ్‌డాగ్ మిలియనీర్లోనే బెస్ట్ సాంగ్‌కు ఎ.ఆర్.రహమాన్‌తో కలిసి అవార్డును పంచుకున్నాడు గుల్జార్.
రసుల్ పోకుట్టి: స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాకే రసుల్ బెస్ట్ సౌండ్ మిక్సింగ్ అవార్డు అందుకున్నాడు.
క్యూట్ అండ్ స్వీట్ స్పీచ్
1976లో బెస్ట్ యాక్ట్రెస్‌గా అవార్డు అందుకున్న లూయీజ్ ఫ్లెచర్, థ్యాంక్యూ స్పీచ్ మధ్యలో.. ‘‘నన్ను క్షమించాలి..’’ అంటూ మూగ భాషలో సంకేతాలు ఇవ్వడం మొదలుపెట్టింది. లూయీజ్ తల్లిదండ్రులిద్దరూ డెఫ్ అండ్ మ్యూట్. వాళ్లకు అర్థమయ్యేలా ఆమె ఆ భాషలో వారికి థ్యాంక్స్ చెప్పింది.
1993లో తన 11 ఏళ్ల వయసులో బెస్ట్ యాక్ట్రెస్ సపోర్టింగ్ రోల్ అవార్డు అందుకున్న అన్నా పాక్విన్, థ్యాంక్యూ స్పీచ్‌లో చాలాసేపు ఏం మాట్లాడకుండా, నవ్వుతూ, ఏడుస్తూ, చిన్న చిన్న సౌండ్స్ చేస్తూ నిలబడింది. ఆ ఈవెంట్‌కు వచ్చిన వారంతా నవ్వుతూంటే అన్నా అలాగే నిలబడింది. కొద్దిసేపయ్యాకే ఆమె ‘‘థ్యాంక్యూ..’’ అంటూ నాలుగు పేర్లు తలుచుకుంది.
ఈ రెండూ ఆస్కార్‌లో క్యూట్ అండ్ స్వీట్ అనిపించుకున్న స్పీచ్‌ల లిస్ట్‌లో టాప్‌లో ఉంటాయి.
ఆస్కార్ వేడుకలో మన మెగాస్టార్!
ఆస్కార్ అవార్డు వేడుకలో కమిటీ ఆహ్వానించిన వ్యక్తులకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. 1986లో జరిగిన 59వ ఆస్కార్ అవార్డు వేడుకలకు మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. ఆయన ఆ వేడుకకు హాజరయ్యాడు కూడా!
ఆస్కార్ రికార్డులు
రికార్డు నంబర్ అవార్డులు గెలుచుకున్న సినిమాలు: బెన్హర్ (11), టైటానిక్ (11), లార్డ్ ఆఫ్ ది రింగ్స్ – ది రిటర్న్ ఆఫ్ ది కింగ్ (11)
రికార్డు నంబర్ నామినేషన్స్ దక్కించుకున్న సినిమాలు: ఆల్ ఎబౌట్ ఈవ్ (14), టైటానిక్ (14), లా లా లాండ్ (14)
నామినేట్ అయిన అన్ని క్యాటగిరీల్లో అవార్డు కొట్టిన సినిమా: లార్డ్ ఆఫ్ ది రింగ్స్ – ది రిటర్న్ ఆఫ్ ది కింగ్ (11)
రికార్డ్ నంబర్ ఆస్కార్లు అందుకున్న వ్యక్తి: వాల్ట్ డిస్నీ (22)
బెస్ట్ డైరెక్టర్‌గా ఎక్కువ అవార్డులు అందుకున్న వ్యక్తి: జాన్ ఫోర్డ్ (4 – ది క్వైట్ మ్యాన్, హవ్ గ్రీన్ వాజ్ మై వ్యాలీ, ది గ్రేప్స్ ఆఫ్ వ్రాత్, స్టేజ్‌కోచ్, ది ఇన్ఫార్మర్ సినిమాలకు)
బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డు అందుకున్న ఏకైక మహిళ: కాథ్రిన్ బైగ్లో (1 – ది హర్ట్ లాకర్ సినిమాకు)
బెస్ట్ యాక్ట్రెస్‌గా ఎక్కువ నామినేషన్స్ దక్కించుకున్న వ్యక్తి: మెరిల్ స్ట్రీప్ (21)
అతిచిన్న వయసులో ఆస్కార్ గెలుచుకున్న వ్యక్తి: టేటుమ్ ఓనీల్ (1974లో 10 ఏళ్ల 148 రోజుల వయసులో ‘పేపర్ మూన్’ సినిమాకుగాను ‘బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ ఎ సపోర్టింగ్ రోల్’ క్యాటగిరీలో టేటుమ్ ఓనీల్ ఆస్కార్ అందుకుంది.)
అతిపెద్ద వయసులో ఆస్కార్ గెలుచుకున్న వ్యక్తి: క్రిస్టొఫర్ ప్లమ్మర్ (2012లో 82 ఏళ్ల 75 రోజుల వయసులో ‘బిగినర్స్’ సినిమాకుగాను ‘బెస్ట్ యాక్టర్ ఇన్ ఎ సపోర్టింగ్ రోల్’ క్యాటగిరీలో ప్లమ్మర్ ఆస్కార్ అందుకున్నాడు.)