ఐదేళ్ల తరువాత..
సాక్షి, కాకినాడ :ఏలేరు ఆధునికీకరణ కోసం మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.138 కోట్లు మంజూరు చేశారు. పనులకు పరిపాలనామోదం కూడా ఇచ్చారు. ఆయన హఠాన్మరణం తరువాత ఆ పనులను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. ఫలితంగా వరుస తుపానులు, వరదలతో ఏలేరు రైతులు నాలుగేళ్లుగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఏలేరు ఆధునికీకరణ పనులపై ప్రభుత్వం కంటితుడుపు ప్రకటనలు చేసిందే తప్ప చిత్తశుద్ధితో ఎటువంటి కృషీ చేయలేదు. మెట్ట ప్రాంతం నుంచి తోట నరసింహం మంత్రిగా రాష్ర్ట క్యాబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నా ఇదే దుస్థితి. ఇటువంటి తరుణంలో మరోసారి ఏలేరు రైతాంగాన్ని మోసగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మరో ఆర్నెల్లలో ప్రస్తుత ప్రభుత్వ కాలం ముగియనుంది.
ఈ తరుణంలో మహానేత మంజూరు చేసిన రూ.138 కోట్ల నిధుల్లో రూ.127.60 కోట్ల విడుదలకు అనుమతులు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఏలేరు ఆధునికీకరణ పనులపై మంగళవారం హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో కాకినాడ ఎంపీ, కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ఎంఎం పళ్లంరాజు, రాష్ర్ట నీటిపారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డితో కలిసి సమీక్షించారు. ఏలేరు రిజర్వాయర్ కాలువలు, డ్రైన్ల ఆధునికీకరణ పనుల నిమిత్తం రూ.127.60 కోట్లకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటివరకూ ఒక్క రూపాయి పనులు కూడా జరగనప్పటికీ రూ.10 కోట్ల పనులు పూర్తయినట్టు ఈ సమావేశంలో ఇంజనీర్లు ప్రకటించడం గమనార్హం. ఈ ప్రాజెక్టు ఆధునికీకరణ పూర్తయితే 64 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. ఈ పనులు పూర్తయ్యేలోపు భవిష్యత్తులో చేపట్టబోయే పనుల నిమిత్తం అవసరమయ్యే మరో రూ.155 కోట్ల విలువైన పనులకు అంచనాలు తయారు చేయాల్సిందిగా మంత్రులు ఇరిగేషన్ అధికారులను ఆదేశించడం చూస్తుంటే ఈ పనులపై రాష్ర్ట ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. ఈ సమావేశ విషయాలను కేంద్ర మంత్రి పళ్లంరాజు కాకినాడలో విలేకర్లకు విడుదల చేశారు.