రక్తదానంలో నం.1
పదేళ్లుగా మహారాష్ట్రదే రికార్డు
సాక్షి, ముంబై: రక్తదానం చేయడంలో మహారాష్ట్రవాసులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. గత పదేళ్లుగా రక్త దానం చేయడంలో వారే అగ్రస్థానంలో ఉన్నారు. గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాల ద్వారా 15,59,669 రక్తపు సంచులను పోగు చేశారు. గత సంవత్సరం వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, కళాశాలలు, రైల్వే స్టేషన్లతోపాటు వ్యాపార, వాణిజ్య సంస్థల్లో, ప్రార్థన స్థలాల్లో ‘స్టేట్ బ్లడ్ ట్రాన్సిషన్ కాన్ఫరెన్స్’ ఏకంగా 24,647 రక్తదాన శిబిరాలు నిర్వహించి 15.59 లక్షలకుపైగా బ్లడ్ బ్యాగులు పోగు చేసింది.
ఇలా పోగుచేసిన రక్తాన్ని ఆర్బీసీ, ప్లేట్లెట్స్, ప్లాజ్మా రూపంలో విడదీసి ఏ రాష్ట్రానికైనా అవసరాన్ని బట్టి సరఫరాచేసే సామర్థ్యం మహారాష్ట్రకు ఉందని స్టేట్ బ్లడ్ ట్రాన్సిషన్ కాన్ఫరెన్స్ అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ సంజయ్‌కుమార్ జాదవ్ చెప్పారు. రాష్ట్రంలో 310 బ్లడ్ బ్యాంకులు ఉండగా ఇందులో 75 ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థలకు చెందినవి ఉన్నాయి.
గత సంవత్సర కాలంలో ప్రభుత్వ, మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న మూడున్నర లక్షల మంది రోగులకు ఆపరేషన్ల కోసం ఉచితంగా రక్తం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రక్తాన్ని గ్రూపులుగా విడదీసే సౌకర్యం 244 చోట్ల ఉంది. దీంతో రక్తాన్ని విడ దీయడం యావత్ దేశంతో పోలిస్తే మహారాష్ట్రలో 65 శాతం ఉంది.