జాతి మెచ్చేలా...
రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలకు సర్వంసిద్ధం
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
నగరంలో పటిష్ట బందోబస్తు
వాహనాలకు ట్రాఫిక్ మళ్లింపు
పాసులుంటేనే ప్రవేశం
అనంతపురం అర్బన్: స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా అనంతపురంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. వేడుకలు నిర్వహిస్తున్న నీలం సంజీవరెడ్డి స్టేడియాన్ని (పోలీసు శిక్షణ కళాశాల మైదానం) యంత్రాంగం అందంగా ముస్తాబు చేసింది. సోమవారం ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించనున్నారు. వేడుకల నేపథ్యంలో నగరంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకలకు అనుకూలంగా ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. వేడుకలను తిలకించేందుకు పాసులున్న వారినే మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తారు.
ఉదయం 7.30 గంటలకే చేరుకోవాలి
పాసులున్న వారు ఉదయం 7.30 గంటలకు స్టేడియం చేరుకోవాలి. ఆ తర్వాత లోపలికి అనుమతించరు. ఒకసారి లోపలికి వెళ్లిన వారిని మధ్యాహ్నం 12 గంటలకు వేడుకలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి బయలుదేరి వెళ్లాకే బయటికు పంపిస్తారు.
పాసులున్న వారు ఇలా వెళ్లాలి
స్టేడియం చుట్టూ ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేశారు. సాధారణ ప్రజలు, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు. వీరందరికి బి–3 పాసులు ఇచ్చారు. వీరంతా 4, 5, 6, 7 ద్వారా గుండా వెళ్లేందుకు వీలు కల్పించారు. స్టేడియం తూర్పు వైపున లక్ష్మీనగర్ రోడ్డు మీదుగా చేరుకోవాల్సి ఉంటుంది. ఈ మార్గంలోనే వాహనాల పార్కింగ్ కోసం స్థలం కేటాయించారు.
వీఐపీలకు వేరుగా ద్వారం
ఎఎ, ఎ–1,ఎ–2 పాసులున్న వారు పీటీసీ ప్రధాన ద్వారా నుంచి లోపలికి వెళ్లాలి. కేటాయించిన స్థానంలో వాహనాలను పార్కింగ్ చేయాలి. జన్మభూమి రోడ్డులోని 2వ ద్వారం నుంచి ఎ–3 పాసులున్న వారు వెళ్లాలి. ఇక బి–2 పాసులున్న వారు స్టేడియం తూర్పు వేపున ఉన్న 3వ ద్వారం నుంచి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది.
వాహనాలకు ట్రాఫిక్ మళ్లింపు
వాహనాల రాకపోకలకు ట్రాఫిక్‌ను మళ్లించారు. కళ్యాణదుర్గం, ఉరవకొండ, ఆలమూరు మీదుగా వచ్చే ఆర్టీసీతోపాటు ప్రైవేటు వాహనాలు జాతీయ రహదారి మీదుగా తపోవనం కూడలి, అక్కడి నుంచి ఒకటవ రోడ్డు మీదుగా రామచంద్రానగర్ ప్లైఓవర్ బ్రిడ్జి మీదుగా బస్టాండ్‌కు చేరుకోవాలి. రుద్రంపేట నుంచి వచ్చే టూవీలర్, ఆటోలు, కారు తెలుగుతల్లి విగ్రహం కూడలి చేరుకుని వైద్య కళాశాల ఎదురు రోడ్డు మీదుగా సాయినగర్ వైపు వెళ్లాలి. అదే విధంగా సూర్యనగర్ రోడ్డు మీదుగా కూడా ప్రయాణించవచ్చు.
ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
వేడుకల సందర్భంగా నగరంలో పలు రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. తెలుగు తల్లి విగ్రహం నుంచి సప్తగిరి సర్కిల్, టవర్ క్లాక్ మీదుగా వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నారు.
ఏర్పాట్ల పరిశీలన
అనంతపురం సెంట్రల్ : రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జిల్లాలో జరగడం అదృష్టంగా భావిస్తున్నట్లు మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత తెలిపారు. వేడుకలు జరుగనున్న పీటీసీ మైదానాన్ని మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, డీజీపీ సాంబశివరావు, పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ, స్వాతంత్య్ర వేడుకలకు కలెక్టర్ శశిధర్, డీఐజి ప్రభాకర్‌రావు, ఎస్పీ రాజశేఖరబాబు పకడ్బందీ ఏర్పాట్లు చేశారని కితాబు ఇచ్చారు. అనంతరం అధునాతన హంగులతో నిర్మించిన పోలీస్ కన్వన్షన్‌హాలును పరిశీలించారు.