బతుకమ్మ కోసం జిల్లాకు రూ.10 లక్షలు
బతుకమ్మ పండుగకు విశేష ప్రాచుర్యాన్ని కల్పిస్తూ నిర్వహించాలని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శి బి.వెంకటేశం తెలిపారు. బతుకమ్మ పండుగ నిర్వహణపై ఆయన మంగళవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈనెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగే ఉత్సవాలకు గాను ప్రభుత్వం జిల్లాకు రూ.10 లక్షల చొప్పున కేటాయించిందని వివరించారు. ఇంకా నిధులు అవసరమైతే ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఈనెల 21న హైదరాబాద్లో బతుకమ్మ పండుగ ముగింపు ఉత్సవాల కోసం ప్రతి జిల్లా నుంచి 100 మంది మహిళా కళాకారులను పంపాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆయా జిల్లాల సాంస్కృతిక వైభవం, చారిత్రక నేపథ్యం తెలిపే శకటాల ప్రదర్శన కూడా ఉంటుందని వెల్లడించారు. 21న మధ్యాహ్నం మహిళా కళాకారులంతా ఎల్బీనగర్స్టేడియం చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.