State Department of Health
-
డిసెంబర్ చివరికల్లా అందరికీ టీకా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన అందరికీ ఈ ఏడాది చివరికల్లా కరోనా టీకాలు వేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ చేపట్టడం ద్వారా మూడో వేవ్‌ను అడ్డుకోవచ్చని భావిస్తోంది. ఈ మేరకు త్వరలో టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేయనున్నట్టు ఉన్నతాధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడినవారు 2.20 కోట్ల మంది ఉన్నారు. అందులో ఇప్పటివరకు 1.15 కోట్ల మందికి టీకాలు వేశారు. వీరిలో 38.21 లక్షల మందికి రెండో డోసు కూడా పూర్తయింది. మిగతా వారికి రెండో డోసు టీకాను.. అదనంగా 1.05 కోట్ల మందికి రెండు డోసుల టీకాలను వేయాల్సి ఉంది. మరోవైపు 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయసువారికి అక్టోబర్ నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో ఈ వయసు వారు 45 లక్షల మందివరకు ఉంటారని పేర్కొంటున్నారు. హైదరాబాద్‌లో 24.63 లక్షలు.. రంగారెడ్డిలో 15.53 లక్షలు రాష్ట్రంలో ఇప్పటివరకు అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 24.63 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. అందులో 8.32 లక్షల మందికి రెండో డోస్ వేశారు. తర్వాత రంగారెడ్డి జిల్లాలో 15.53 లక్షల మందికి టీకాలు (ఇందులో 4.85 లక్షల మందికి రెండో డోస్) వేశారు. అత్యంత తక్కువగా నారాయణపేట జిల్లాలో 59,873 మందికి (ఇందులో 16,364 మందికి రెండు డోసులు) టీకాలు వేశారు. ఇప్పటికే మొదటి డోస్ తీసుకున్నవారికి రెండో డోస్ వేసే ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని భావిస్తున్నారు. అయితే కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య 84 రోజుల గడువు విధించడంతో ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఏడాది చివరిదాకామూడోవేవ్ రాదు రాష్ట్రంలో ఈ ఏడాది చివరినాటికి 18 ఏళ్లు పైబడిన అందరికీ కరోనా వ్యాక్సిన్ అందించేలా ప్రణాళిక రూపొందించాం. కేంద్ర ప్రభుత్వం కూడా డిసెంబర్ నాటికి అందరికీ టీకా వేసేలా కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఈ ఏడాది చివరివరకు మూడో వేవ్ వచ్చే అవకాశమే లేదు. దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగం దాకా ఒక్క కేరళలోనే ఉంటున్నాయి. ప్రస్తుతం రోజుకు 42 వేల కరోనా కేసులు నమోదైతే.. కేరళలో 22 వేలు, మహారాష్ట్రలో 10 వేలు ఉంటున్నాయి. మిగతా అన్ని రాష్ట్రాల్లో కలిపి పది వేల కేసులే నమోదవుతున్నాయి. అంటే ఆ రెండు రాష్ట్రాలను మినహాయిస్తే.. మిగతా రాష్ట్రాల్లో సాధారణ కేసులే నమోదవుతున్నాయి. – డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు. -
నిర్లక్ష్యం పెరిగింది..మూడో వేవ్ ముందుంది!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిందనగానే చాలా మందిలో నిర్లక్ష్యం ఆవరిస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్లా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారని వైద్యారోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కరోనా ఉధృతి ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకున్న వారు కూడా.. ఇప్పుడు ఒకరిని చూసి మరొకరు కోవిడ్ జాగ్రత్తలను పట్టించుకోవడం లేదని పేర్కొంటోంది. ముఖ్యంగా కరోనా నియంత్రణలో కీలకమైన మాస్క్‌లను కూడా ధరించడం లేదని, ఎన్నిసార్లు హెచ్చరించినా చాలా మంది పద్ధతి మార్చుకోవడం లేదని చెబుతోంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై వైద్యారోగ్య శాఖ కొద్దిరోజులుగా వరుస సమీక్షలు నిర్వహిస్తోంది. కరోనా నియంత్రణ చర్యలపై కార్యాచరణ ప్రణాళిక, మూడో వేవ్ వస్తే ఎలా ఎదుర్కోవాలన్న అంశాలపై అధికారులు చర్చిస్తున్నారు. ఈ సందర్భంగానే కోవిడ్ జాగ్రత్తలపై జనం నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. నిజానికి కరోనా రెండో దశ కొనసాగుతూనే ఉందని, సగటున రోజుకు ఏడెనిమిది వందల కేసులు నమోదవుతూనే ఉన్నాయని గుర్తుచేశారు. దీనికితోడు పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు, జాతరల పేరుతో ప్రజలు పెద్దసంఖ్యలో గుమిగూడుతున్నారని.. తిరిగి కరోనా విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, మూడో వేవ్ ముప్పు ముందుందని సూచించారు. యాంటీబాడీస్ తగ్గిపోతున్నాయి రెండో వేవ్‌లో వైరస్ సోకి తగ్గినవారు, వ్యాక్సిన్లు వేసుకున్న వారిలో కరోనా యాంటీబాడీస్ వృద్ధి చెందాయని.. అందువల్లే ప్రస్తుతం కరోనా ఉధృతి కాస్త నియంత్రణలో ఉందని వైద్యారోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే చాలా మందిలో యాంటీబాడీస్ తగ్గిపోతున్నాయని.. కొందరిలో ఆరు నెలలు ఉంటే, మరికొందరిలో రెండు, మూడు నెలలే ఉంటున్నాయని స్పష్టం చేస్తున్నారు. యాంటీబాడీస్ తగ్గిపోయినవారు మళ్లీ కరోనా బారినపడే ప్రమాదం ఉందని, అందువల్ల జాగ్రత్తలు తప్పనిసరి అని చెప్తున్నారు. రెండో వేవ్‌లో 90 శాతం కేసులు డెల్టా వేరియంట్ వల్ల వచ్చినవేనని, వేగంగా వ్యాప్తి చెందడమే కాకుండా, దాని ప్రభావం తీవ్రంగా ఉన్నదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటికీ కేరళ, మహారాష్ట్రలలో కేసులు అధికంగా నమోదవుతున్నాయన్నారు. కరోనా నుంచి రక్షణకు జాగ్రత్తలు తీసుకోవడమే కీలకమని స్పష్టం చేశారు. -
స్పీడ్ పెంచిన ‘కరోనా’.. లక్షణాలు మాత్రం లేవు!
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కోవిడ్ వైరస్ సోకినా ఎలాంటి లక్షణాలూ బయటపడకుండా ఉంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. మొదటి దశ కంటే ఇప్పుడు 30% ఎక్కువ వేగంగా వైరస్ విస్తరిస్తున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అంచనా వేసింది. ర్యాండమ్‌గా ఏదో ఒకచోట గుమిగూడిన 100 మందికి అక్కడికక్కడే పరీక్షలు చేస్తే.. అందులో అటుఇటుగా 15 నుంచి 20 మందికైనా వైరస్ బయటపడే పరిస్థితి ఉందని భావిస్తోంది. కరోనా పాజిటివ్ వచ్చినవారిలో 90% మందికి అసలు లక్షణాలే కనిపించడం లేదని.. ఎవరికి వైరస్ ఉందో, ఎవరికి లేదో తెలియక వారి ద్వారా ఇతరులకు వైరస్ సోకుతోందని స్పష్టం చేసింది. వచ్చే 2 నెలల్లో భారీగానే కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంటోంది. అయితే ఇప్పుడు వస్తున్న కేసుల్లో ఆరోగ్య పరిస్థితి సీరియస్ అవుతున్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశమని వైద్యాధికారులు చెప్తున్నారు. నాడు వేసవిలో.. నేడూ వేసవిలోనే.. గత వేసవిలోనే కరోనా విజృంభించగా ఇప్పుడూ అదే స్థాయిలో ప్రభావం ఉంటుందని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో గత ఏడాది మార్చి నుంచి ఆగస్టు వరకు పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదుకాగా.. తర్వాత తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాదీ మార్చి నుంచి కేసులు పెరుగుతున్నాయి. ఈ నెల ఒకటిన 163 కరోనా కేసులురాగా.. 30న 684 కేసులు నమోదయ్యాయి. ఈ 30 రోజుల్లో 64 మంది కరోనాతో చనిపోయారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 8,477 పడకలుంటే.. 864 మంది చికిత్స పొందుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో కేవలం సీరియస్ కేసులనే తీసుకుంటున్నారు. అంటే ఐసీయూలో చేర్చాల్సిన రోగులకే చికిత్స చేస్తున్నారు. ఆక్సిజన్, ఐసోలేషన్ పడకలను నింపడం లేదని అక్కడి వైద్యాధికారులు అంటున్నారు. చదవండి: (ప్రమాదంలో యావత్ దేశం.. కేంద్రం ఆందోళన) 30 శాతం ఎక్కువ వేగంతో వైరస్ వ్యాప్తి సెకండ్ వేవ్‌లో కరోనా అంచనాలకు మించి విస్తరిస్తోంది. ఏ మాత్రం లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ ఉంటున్నవారి సంఖ్య ఎక్కువైంది. మొదటిసారి కంటే సెకండ్ వేవ్‌లో 30 శాతం ఎక్కువ వేగంతో కరోనా విస్తరిస్తోందని అంచనాలు ఉన్నాయి. రాబోయే రెండు మూడు నెలల్లో ఊహించని స్థాయిలో కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే సెకండ్ వేవ్‌లో నమోదయ్యే కేసుల్లో సీరియస్‌గా మారేవి తక్కువగా ఉంటున్నాయి. ఇది ఊరటనిచ్చే అంశం. నిబంధనల మేరకు అవకాశం ఉన్నవారంతా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి. అందరూ మాస్క్ ధరించాలి. కరోనా జాగ్రత్తలు పాటించాలి. అవే మనల్ని కరోనా నుంచి రక్షిస్తాయి. గురువారం నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా వేస్తాం. రాష్ట్రంలో వారు 80 లక్షల మంది ఉంటారని అంచనా. ఇందులో ఇప్పటికే 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేశాం. ఇంకా 70 లక్షల మందికి వేయాల్సి ఉంది. డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు కరోనాను తక్కువగా అంచనా వేశాం రాష్ట్రంలో ప్రస్తుతం ఊహించని స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. లక్షణాలు లేకుండా ఉండేవే ఎక్కువగా ఉంటున్నాయి. మరోవైపు కరోనా రాగానే భయంతో అనేక మంది ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. బెడ్లు నిండిపోతున్నాయి. పరిస్థితి సీరియస్ అయి ఐసీయూలోకి వెళ్లేవారిలో యువకులు అధికంగా ఉండటం ఆందోళనకరం. పెద్దలు భయంతో మాస్కులు, కరోనా జాగ్రత్తలు తీసుకుంటుంటే.. యువకులు ఏమీ కాదన్న భావనతో నిర్లక్ష్యం వహించడమే దీనికి కారణం. రానున్న రోజుల్లో ఊహించని స్థాయిలో కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. కరోనాను తక్కువ అంచనా వేశాం అనిపిస్తుంది. డాక్టర్ కృష్ణ ప్రభాకర్, చీఫ్ జనరల్ ఫిజీషియన్, సిటీన్యూరో ఆస్పత్రి, హైదరాబాద్ టీకా వేసుకుంటే సేఫ్.. రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడిన వారందరికీ గురువారం నుంచి కరోనా టీకాలు వేయనున్నారు. ఇప్పటివరకు కేవలం 45–59 ఏళ్ల మధ్య వయసులోని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, 60 ఏళ్లు పైబడిన వారికీ టీకాలు వేస్తున్నారు. ఇక నుంచి వ్యాధులతో సంబంధం లేకుండా 45 ఏళ్లు దాటిన అందరికీ ఇస్తారు. ‘ప్రైవేటు’లో బెడ్లు ఫుల్.. హైదరాబాద్‌లో కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో ‘కరోనా’ పడకలన్నీ దాదాపు నిండిపోయాయి. సెకండ్ వేవ్‌లో తీవ్రత తక్కువగానే ఉంటుందని వైద్యులు స్పష్టం చేస్తున్నా, పెద్దగా లక్షణాలు లేకపోయినా.. కరోనా బాధితులు మాత్రం ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. దీంతో పడకల కొరత మొదలైంది. -
కు.ని.కి పురుషులు దూరం..
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని నగరంలో కుటుంబ నియంత్రణ (కు.ని.) ఆపరేషన్లు చేయించుకోవడానికి పురుషులు వెనకడుగు వేస్తున్నట్లు రికార్డుల ద్వారా స్పష్టమైంది. మహిళల కంటే పురుషులకు కు.ని. ఆపరేషన్ చాలా సులభమని ప్రభుత్వం అనేక జనజాగృతి కార్యక్రమాలు చేపట్టింది. అయినప్పటికీ పురుషులు చొరవ తీసుకోకపోవడం రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులను కలవరానికి గురిచేస్తోంది. ఈ ఆపరేషన్ల విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్లే పురుషులు ముందుకు రావడం లేదని అధికారులు భావిస్తున్నారు. కు.ని.ఆపరేషన్ చేయించుకుంటే లైంగిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయోమోననే భయం, అపోహతోనే పురుషులు ఈ ఆపరేషన్‌కు దూరంగా ఉంటున్నారని పలు సర్వేలు తేల్చిచెప్పాయి. గత రెండు, మూడు సంవత్సరాల కాలంలో కు.ని. ఆపరేషన్లు చేయించుకునే పురుషుల సంఖ్య 50 శాతానికి పడిపోయింది. మహిళలకు కు.ని.ఆపరేషన్లు చేయడం చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. ఈ ఆపరేషన్లు విఫలమైన సందర్భాలు ఎక్కువగా మహిళల్లోనే కనిపిస్తుంది. అదే పురుషులకు సంబంధించి 90 శాతానికి పైగా విజయవంతమైనట్లు రికార్డులు చెబుతున్నాయి. అలాగే వారి లైంగిక జీవితానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని వైద్యులు బరోసా ఇస్తున్నారు. అయినప్పటికీ పురుషులు ముందుకు రాకపోవడం అధికారుల్లో కలవరం లేపుతోంది. పురుషులను చైతన్య పరిచేందుకు గతంలో ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపట్టింది. కు.ని. చేయించుకున్న పురుషులకు గతంలో ఇచ్చే రూ.550 ప్రోత్సాహక నగదును కేంద్ర ప్రభుత్వం రూ.1,100 పెంచి ఇచ్చింది. అయినప్పటికీ పురుషులు కు.ని.ఆపరేషన్ చేయించుకునేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం.