state Department of Transportation
-
కాలుష్య వాహనాలపై కొరడా!
సాక్షి, అమరావతి: కాలుష్య ఉద్గారాలు వెదజల్లే వాహనాలపై రాష్ట్ర రవాణా శాఖ కొరడా ఝుళిపించనుంది. ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న కాలుష్య వాహనాలకు భారీ జరిమానాలు విధించనుంది. కాలుష్య వాహనాలతో చర్మ క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ వాహనాలు వెదజల్లే నైట్రోజన్, కార్బన్ మోనాక్సైడ్.. ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమవడంతోపాటు శరీరంలోని ముఖ్య అవయవాలకు ఆక్సిజన్ అందకుండా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో కాలం చెల్లిన వాహనాలను రోడ్లపైకి తిరగకుండా చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సెస్ విధించనుంది. ఈ మేరకు రవాణా శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. కేటగిరీలగా వాహనాల విభజన మూడు కేటగిరీల కింద రవాణేతర వాహనాలను, నాలుగు కేటగిరీల కింద రవాణా వాహనాలను విభజించారు. రవాణేతర వాహనాల కింద ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలను 15 ఏళ్ల లోపు, 15–20 ఏళ్లు, 20 ఏళ్లు పైబడినవాటిగా విడగొట్టారు. రవాణా వాహనాల విభాగంలో గూడ్స్, బస్సులను ఏడేళ్ల లోపు, 7–10 ఏళ్లు, 10–12 ఏళ్లు, 12 ఏళ్లకు పైబడిన వాహనాలుగా పేర్కొన్నారు. 15 ఏళ్ల లోపు, 15–20 ఏళ్ల కేటగిరీలో కాలుష్యం వెదజల్లే ద్విచక్ర వాహనాలకు ఏడాదికి రూ.2 వేలు, కార్లకు రూ.4 వేలు చొప్పున జరిమానా విధించనున్నారు. 20 ఏళ్లు పైబడిన వాహనాలకు భారీగా జరిమానాలు ఉంటాయి. గూడ్స్, బస్సులకు క్వార్టర్లీ పన్నుల విధానంలో అదనంగా పన్నులు విధించనున్నారు. ఈ జరిమానాలపై త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. -
అద్దె అదిరే... కమిషనరేట్లు బెదిరే!
► అద్దెల భారంతో నగర శివారులకు.. ► ప్రసాదంపాడులో 30 వేల చదరపు ► అడుగుల్లో ఎక్సైజ్ కమిషనరేట్ ► ఆర్టీసీ హౌస్ కాంప్లెక్స్‌లో రాష్ట్ర రవాణా శాఖ ► అద్దెలతో సతమతమవుతున్న రాష్ట్ర కార్యాలయాలు సాక్షి, విజయవాడ : జూన్ 27 కల్లా నవ్యాంధ్రకు రావాలని సీఎం ఆదేశాలు.. మరో వైపు భయపెట్టే అద్దెలతో రాష్ట్ర కార్యాలయాల ఏర్పాటు సమస్యాత్మకంగా మారింది. ప్రభుత్వం నిర్ణయించిన అద్దెకు నగరంలో భవనాలు దొరక్కపోవడంతో వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాల అన్వేషణ నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. కొన్ని శాఖలు దూరప్రాంతమైనా పర్వాలేదనే రీతిలో నగర శివారు ప్రాంతాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉద్యోగులకు రవాణాపరంగా కొంత ఇబ్బందైనా ముందు భవనం దొరికితే చాలు అనే రీతిలో వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనరేట్, డెరైక్టరేట్ కార్యాలయాలు నగర శివారు గ్రామం ప్రసాదంపాడులో ఏర్పాటు కాగా రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ కార్యాలయం ఆర్టీసీ హౌస్‌లో ఏర్పాటవుతోంది. విజయవాడలో అద్దె భవనాల అన్వేషణ ప్రభుత్వ అధికారులకు తలనొప్పిగా మారింది. చదరపు అడుగకు ప్రభుత్వం రూ.16 ధర నిర్ణయించింది. విజయవాడలోని బందరు రోడ్డు, బీసెంట్ రోడ్డు, ఏలూరు రోడ్డు, ఇతర ప్రధాన ప్రాంతాల్లో భవనాలు తక్కువ అద్దెకు దొరికే పరిస్థితి లేదు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో చదరపు అడుగుకు నెల అద్దె సగటున రూ.40 నుంచి రూ.100 వరకు ఉంది. బందరు రోడ్డు, బెంజ్ సర్కిల్లో రూ.100 వరకు ఉండగా మిగిలిన ప్రాంతాల్లో వాణిజ్య భవనాల అద్దె రూ.40 పైమాటగానే ఉంది. ఈ క్రమంలో రవాణా శాఖ, ఎక్సైజ్ శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఇలా అనేక విభాగాలకు అద్దె భవనాల కోసం 20 రోజులుగా నిరంతర అన్వేషణ సాగుతోంది. ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఇతర అధికారులు అపార్ట్‌మెంట్‌ను పరిశీలించి యజమానులతో మాట్లాడుకొని అద్దెను ఖరారు చేసి ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 25 నుంచి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్ కార్యాలయం, డెరైక్టరేట్ కార్యాలయం ఇక్కడ కార్యకలాపాలు మొదలు కానున్నాయి. ఎక్సైజ్ శాఖకు విజయవాడలోని లెనిన్ సెంటర్లో సుమారు 500 గజాల స్థలం ఉంది. దానిలో గతంలో రూ.50 లక్షలు ఖర్చు పెట్టి మరీ పునాదులు వేశారు. ఆ తర్వాత మళ్లీ పనులు ముందుకు సాగలేదు. మంత్రి కొల్లు రవీంద్ర కూడా దానిలో భవనం నిర్మిస్తామని ప్రకటించినా అది ఆచరణలోకి రాకపోవటంతో శివారు గ్రామంలో అద్దె భవనానికి వెళ్లాల్సివస్తోంది. ఆర్టీసీ హౌస్‌లో రాష్ట్ర రవాణా శాఖ కార్యాలయం పండిట్ నెహ్రు బస్టాండ్ ప్రాంగణంలో ఉన్న ఆర్టీసీ హౌస్‌లో ఒక ఫ్లోర్‌ను రాష్ట్ర రవాణా శాఖ కార్యాలయానికి కేటాయించారు. ఆర్టీసీ కార్పొరేషన్ కావటంతో చదరపు అడుగుకు రూ.16 అద్దె నిర్ణయించింది. ఆ మేరకు అద్దె చెల్లించి రవాణా శాఖ కార్యాలయం ఇక్కడ ప్రారంభం కానుంది. ఆర్టీసీ హౌస్‌లో ఇతర విభాగాలు తమకు కేటాయించాలని కోరుతుండటంతో రవాణా శాఖ దీనిని ఖరారు చేసుకొని గురువారం ఉదయం కమిషనర్ ఎన్.బాలసుబ్రహ్మణ్యం కార్యాలయంలో పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 27 కల్లా 80 మంది ఉద్యోగులతో విజయవాడ నుంచి కార్యకలాపాలు మొదలుపెట్ట నున్నారు. -
ఎంవీఐపై చీటింగ్ కేసు
=కానిస్టేబుల్ ఉద్యోగాల ఎర..రూ.5 కోట్లు వసూలు =23 జిల్లాల్లోని 98 మంది హోంగార్డులకు టోకరా =హైదరాబాద్ సీసీఎస్‌లో బాధితుల ఫిర్యాదు సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర రవాణా శాఖలో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ)గా విధులు నిర్వహిస్తున్న ఓ అధికారిపై హైదరాబాద్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. అతని వద్ద పనిచేస్తున్న మరో నలుగురు హోంగార్డులను సైతం నిందితులుగా చేర్చారు. ఆర్టీఏలో కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తానని అదే సంస్థలో పనిచేస్తున్న 98 మంది హోంగార్డులను నమ్మించి సుమారు రూ.5 కోట్లు వసూలు చేసి మోసగించారని ఎంవీఐపై ఆరోపణ. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన కొందరు హోంగార్డులు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మకు ఫిర్యాదు చేయడంతో సీసీఎస్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన భీంరావు అదే జిల్లాలో కత్తిపూడి చెక్‌పోస్టు వద్ద రవాణా శాఖలో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. సరిగ్గా రెండేళ్ల క్రితం మోసానికి తెర లేపాడు. రవాణా శాఖలో 23 జిల్లాల్లో పనిచేస్తున్న సుమారు 98 మంది హోంగార్డులకు నేరుగా కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. తనకు ప్రభుత్వ పెద్దలతో పరిచయం ఉందని నేరుగా ప్రత్యేక జీవోను విడుదల చేసి తద్వారా కానిస్టేబుల్‌గా పదోన్నతులు కల్పిస్తానని కూడా నమ్మించాడు. అందుకు ఒక్కొక్కరు రూ.5 లక్షలు ఇవ్వాలని బేరం పెట్టాడు. అతని వలలో పడ్డ అన్ని జిల్లాల హోంగార్డులు అధికారి అడిగిన దాంట్లో విడతల వారీగా ఒక్కొక్కరు రూ.4 లక్షల చొప్పున చెల్లించారు. ఇక హైదరాబాద్ జిల్లాలో పనిచేస్తున్న 13 మంది హోంగార్డులు బెల్సన్ తాజ్ హోటల్లో భీంరావుకు ఒకసారి రూ.20 లక్షలు మరోసారి రాజమండ్రిలోని అతని గెస్ట్‌హౌస్‌లో అతని వద్ద విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు మస్తాన్‌రావు, కృష్ణ, సత్తిబాబు, రాజేష్‌లకు మరో రూ.20 లక్షలు, భీంరావుకు మూడు విడతలుగా రూ.12 లక్షలు ఇచ్చారు. ఇలా అన్ని జిల్లాల హోంగార్డుల నుంచి అతను సుమారు రూ.5 కోట్లు వసూలు చేశాడు. సంవత్సరాలు గడుస్తున్నా కానిస్టేబుల్ ఉద్యోగాలు రాకపోవడంతో ఒక్కో జిల్లా నుంచి హోంగార్డులు పలుమార్లు భీంరావుకు ఫోన్‌చేసి తమ బాధను వెళ్లబోసుకునేవారు. అయినా అతను రేపుమాపు అంటూ దాటవేస్తూ వచ్చాడు. అనుమానం వచ్చిన ఆయా జిల్లాల హోంగార్డులు రెండు నెలల నుంచి రాజమండ్రిలోని అతని నివాసానికి రావడం మొదలు పెట్టడంతో వారికి చిక్కకుండా తిరిగాడు. అతను విధులు నిర్వహిస్తున్న కత్తిపుడి చెక్‌పోస్టుకు వెళ్లితే అక్కడ కూడా కనిపించ లేదు. అతనికి ఫోన్ చేసి వేడుకుంటే తన ఇంటికి వస్తె ఎస్సీఎస్టీ కేసులు బుక్ చేయిస్తానని హోంగార్డులను బెదిరించాడు. దీంతో హోంగార్డులు అతని ఇంటికి వెళ్లడం మానేశారు. ఏం చేయాలో తెలియక తమలో తాము కుమిలిపోయారు. అప్పుగా తెచ్చిన డబ్బుకు వస్తున్న హోంగార్డు జీతం మొత్తం మిత్తీలకు పోతున్నాయని బాధపడ్డ పలువురు హోంగార్డులు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మను కలిసి ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు సీసీఎస్ పోలీసులు ఎంవీఐ భీంరావుతో పాటు అతనికి సహకరించిన హోంగార్డులు మస్తాన్‌రావు, కృష్ణ, సత్తిబాబు, రాజేష్‌లపై బుధవారం చీటింగ్ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.