తప్పించరూ
రాజకీయ పక్షాల నుంచి వస్తున్న విమర్శలు, ఆరోపణలతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్‌కుమార్ మనస్తాపానికి గురయ్యూరు. తనను ఆ పదవి నుంచి తప్పించాలంటూ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సంపత్‌కు విజ్ఞప్తి చేశారు. ఇది ప్రచారంగా తొలుత సంకేతాలు వెలు వడ్డా, చివరకు తాను విజ్ఞప్తి చేసుకున్నది వాస్తవమేనని ఈసీ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు.
సాక్షి, చెన్నై : రాష్ట్ర ఎన్నికల అధికారిగా గతంలో నరేష్ గుప్తా వ్యవహరించారు. విధి నిర్వహణ లో నిక్కచ్చితనం, ఎవరికీ భయపడని నైజం, ముక్కు సూటితనం ఆయన్ను రాష్ట్రంలో ఒక మంచి ఎన్నికల అధికారిగా నిలబెట్టింది. తన పదవీ కాలం ముగిసే సమయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పదవికి వారసుడిగా ప్రవీణ్‌కుమార్ పేరును సిఫారసు చేసినట్టు ప్రచారం ఉంది. నరేష్ గుప్తా బాణిలో ప్రవీణ్‌కుమార్ పని తీరు ఉండడం ఆ ప్రచారానికి బలం చేకూరినట్టు అయింది.
2010 ఆగస్టులో బాధ్యతలు చేపట్టిన ఆయన నాలుగేళ్లుగా ఎన్నికల ప్రధాన అధికారిగా వ్యవహరిస్తున్నారు. 2011 అసెంబ్లీ ఎన్నికలను దిగ్విజయవంతం చేశారు. ఈ ఎన్నికల్లో నగదు బట్వాడా అడ్డుకట్ట లక్ష్యంగా ఆయన చేపట్టిన చర్యలు కొంత మేరకు ఫలితాన్ని ఇచ్చాయి. సరికొత్త తరహాలో ఎన్నికల ఏర్పాట్లు చేసి, ప్రశాంత పూరిత వాతావరణంలో దిగ్విజయవంతం చేశారు. అనేక ఉప ఎన్నికలు నిర్వహించిన ఆయన లోక్‌సభ ఎన్నికల ద్వారా తీవ్ర ఆరోపణలు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో నగదు బట్వాడా కట్టడి చేశారు. 144 సెక్షన్ అమల్లోకి రాజకీయ పక్షాలకు ముచ్చెమటలు పట్టించారు.
విమర్శలు, ఆరోపణలు : లోక్‌సభ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకేకు తొత్తుగా ఈసీ వ్యవహరిస్తున్నట్టు ఎన్నికల నామినేషన్ల పర్వం ఆరంభం నాటి నుంచి డీఎంకే ఆరోపిస్తోంది. నగదు బట్వాడా కట్టడి ఇతర పార్టీలకు మాత్రమేనని, అధికార పక్షానికి దొడ్ది దారిలో ఎన్నికల అధికారుల ద్వారా అన్ని రకాలుగా సంపూర్ణ మద్దతు లభిస్తున్నదన్న విమర్శలు బయలు దేరాయి. 144 సెక్షన్ అమల్లోకి తెచ్చి కొందరు అధికారుల ద్వారా అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు హల్చల్ చేశాయి. ఎన్నికలు ముగిసినా, ఆరోపణలు మాత్రం తగ్గడం లేదు. డీఎంకేతో పాటుగా అన్ని వామపక్షాలు, డీఎండీకే, కాంగ్రెస్ తదితర పార్టీలు ఆరోపణలు గుప్పిస్తూ రావడం ప్రవీణ్‌కుమార్‌ను మనస్తాపానికి గురి చేసినట్టుంది. తనపై ఆరోపణలు, విమర్శలు ఎక్కువవుతుండడంతో ఇక, ఆ పదవిలో కొనసాగకూడదన్న నిర్ణయానికి ఆయన వచ్చారు.
స్పష్టీకరణ :
తనను పదవి నుంచి తప్పించాలంటూ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సంపత్‌ను ప్రవీణ్కుమార్స్వయంగా కలిసి విజ్ఞప్తి చేసినట్టుగా గత వారం ప్రచారం సాగింది. అయితే, దీన్ని ఆయన ఖండించ లేదు. అదే సమయంలో ఇది ఓ ప్రచారం అన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే, తనను తప్పించాలని విజ్ఞప్తి చేసిన మాట వాస్తవమేనని ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం ఓ తమిళ మీడియాలో ఆయన మాట్లాడుతూ, తాను ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని, నిజాయితీగా ఎన్నికలు నిర్వహిస్తే, ఆరోపణలు మూట గట్టుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 144 సెక్షన్‌ను చట్ట పరంగా, కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అమలు చేశానేగానీ, చట్ట విరుద్ధంగా తాను నడచుకోలేదని స్పష్టం చేశారు. ఆరోపణలు, విమర్శలతో తాను ఆ పదవిలో ఇంకా కొనసాగలేనని, అందుకే తనను తప్పించాలని కేంద్ర కమిషన్‌ను కోరినట్టు తేల్చేశారు. తుది నిర్ణయం కేంద్ర కమిషన్ చేతిలో ఉందని, అక్కడి నుంచి వచ్చే సమాధానం మేరకు తదుపరి తన అడుగులు ఉంటాయని పేర్కొనడం గమనార్హం. ప్రవీణ్‌కుమార్‌ను కేంద్ర కమిషన్ తప్పించేనా, అన్నది అనుమానమే. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడవు ఉంది. ఈ సమయంలో కొత్త అధికారి కొలువు దీరేనా, లేదా, ప్రవీణ్ నిజాయితీకి పట్టం కట్టే రీతిలో కొనసాగించేనా అన్నది వేచి చూడాల్సిందే.