నిధుల ఎత్తిపోతలకేనా!
కొవ్వూరు : ఓవైపు పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తిచేస్తామంటున్న సర్కారు మరోవైపు గోదావరిపై కొత్త ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం పూర్తయితే ఈ పథకం అవసరం ఏముంటుందని నీటిపారుదల నిపుణులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా గోదావరిపై తూర్పుగోదావరి జిల్లాలో నిర్మించనున్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి రూ.1,638 కోట్లు కేటాయించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకాన్ని చేపడుతున్నది నిధులను ఎత్తి జేబుల్లో పోసుకోవడానికా? లేక ప్రభుత్వం చెబుతున్నట్టు పోలవరం పథకం రెండేళ్లలో పూర్తికాదా? అనే సందేహాలు అందరినీ వేధిస్తున్నాయి. ఆ పథకం పనుల తీరు పరిశీలించినా ఇదే భావం కలుగుతోంది. ప్రాజెక్టును రెండేళ్లలోనే పూర్తిచేసేట్టయితే గోదావరిపై కొత్త ఎత్తిపోతల పథకాల అవసరం ఉండదు. కానీ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో రూ.1,638 కోట్లు వెచ్చించి పురుషోత్తపట్నం ఎత్తిపోతల నిర్మాణానికి సర్కారు సిద్ధం కావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఇలాగే తహతహలాడిన సర్కారు రూ.1420 కోట్లు వెచ్చించింది. అయినా ఆ పథకం లక్ష్యం నెరవేరలేదు. దీనిద్వారా నిర్దేశించిన లక్ష్యంలో సగం నీటిని కూడా కృష్ణానదికి తరలించలేకపోయింది. ఈ పథకం లక్ష్యం పూర్తిగా నెరవేరే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదు. అయితే వచ్చే సీజన్ నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు తాజాగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ప్రభుత్వం వెంపర్లాడుతోంది. ఈ పథకం పూర్తి కావాలంటే రెండేళ్ల సమయం పడుతుంది. ఆ సమయానికి పోలవరం పూర్తి చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఇక దీని అవసరం ఏముందనే విషయాన్ని విస్మరిస్తోందని నీటిపారుదల శాఖ నిపుణులు చెబుతున్నారు. దీంతో పోలవరం ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తికాదా! లేక పథకం ప్రకారమే రూ.కోట్లు కొల్లగొట్టేందుకు సర్కారు యత్నిస్తోందా! అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
‘పట్టిసీమ’తో తరలించింది 22 టీఎంసీలే
అత్యంత ఆర్భాటంగా చేపట్టిన పట్టిసీమ పథకం వల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 29 టీఎంసీల నీటిని మాత్రమే కృష్ణానదికి తరలించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ 24 పంపులు ఏర్పాటు చేసినా పూర్తిస్థాయిలో పనిచేసింది తక్కువ రోజులేనని చెప్పాలి. ఈ పథకం ద్వారా కృష్ణా ఆయకట్టులో 10 లక్షల ఎకరాలకు నీటిని అందించామని నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెబుతున్న మాటలు వట్టిదేనని దీనిని బట్టి అర్థమవుతోంది. సాధారణంగా ఒక టీఎంసీ నీటితో గరిష్టంగా 11,500 ఎకరాల వరి పంటకు నీరు అందించవచ్చు. ఈ లెక్కన ఎక్కువంటే 30 టీఎంసీల నీరు సరఫరా అయితే 3.45లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందుతుంది. పట్టిసీమ ద్వారా 29 టీఎంసీలనే కృష్ణానదికి తరలించారు. మరి పదిలక్షల ఎకరాలకు నీరు ఎక్కడ అందించారన్నది ప్రభుత్వమే చెప్పాలి.
పుంజుకోని పోలవరం పనులు
పోలవరం : ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పనుల తీరును పరిశీలిస్తే ఇది ఎప్పటికి పూర్తవుతుందనే సందేహం వ్యక్తమవుతోంది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా స్పిల్‌వే, స్పిల్ ఛానల్, పవర్ హౌస్, అప్రోచ్ చానల్ పనులకు సంబంధించి 10.83 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు చేయాల్సి ఉంది. మూడేళ్లుకుపైగా ఈ పనులు జరుగుతున్నా.. ఇప్పటి వరకు 4.50 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిపనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇటీవల కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ జీతాలు చెల్లించడం లేదని కార్మికులు, పెండింగ్ బకాయిలు ఇవ్వడం లేదని సబ్‌కాంట్రాక్టు సంస్థ త్రివేణి పదిరోజులు పనులు నిలిపివేశాయి. ఇటీవల చంద్రబాబు స్వయంగా పనులను పరిశీలించి రోజుకు 2.20 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం (ఎర్్తవర్క్) పనులు పూర్తి చేయాలని ఆదేశించినా, రోజుకు 50 వేల క్యూబిక్ మీటర్ల పనులు మాత్రమే చేస్తున్నారు. అక్టోబర్ మొదటి వారంలో స్పిల్‌వే నిర్మాణానికి సంబంధించిన కాంక్రీట్ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించినా ఆ పనులు నేటికీ ప్రారంభం కాలేదు. ఇలాగైతే సీఎం చెబుతున్నట్టు 2018 నాటికి పోలవరం పూర్తి చేయడం అసాధ్యమని నీటిపారుదల శాఖ నిపుణులు పేర్కొంటున్నారు.