ఆర్టీఐ చీఫ్ కమిషనర్‌గా ఏకే జైన్ ఎంపిక
సాక్షి, అమరావతి : రాజ్యాంగ బద్దమైన రాష్ట్ర సమాచార కమిషన్‌కు ముఖ్య కమిషనర్ ఎంపిక ప్రక్రియను చంద్రబాబు సర్కారు అపహాస్యం చేసింది. తనకు గూఢచర్యం నెరిపే అధికారికి ఈ అత్యున్నత పదవికి కట్టబెట్టేందుకు నిబంధనలను తుంగలో తొక్కింది. రాష్ట్ర కేడర్‌కు చెందిన పలువురు సీనియర్ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, రిటైర్డ్ జిల్లా జడ్జిలను కాదని.. తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారిని చీఫ్ కమిషనర్‌గా ఎంపిక చేసింది. ఇందుకోసం నిబంధనలను తుంగలో తొక్కింది. ముందుగా ఇచ్చిన నోటిఫికేషన్‌ను సైతం చిత్తుపేపర్లా మార్చేసి మళ్లీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే పారదర్శకతకు పాతరేస్తూ జైన్ ఎంపిక కోసమే ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేశారంటూ హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా విచారణలో ఉంది. అంతేకాదు.. నిబంధనల ప్రకారం ఎంపిక కమిటీ సమావేశానికి ప్రతిపక్ష నేతను ఆహ్వానించకుండానే చీఫ్ కమిషనర్‌ను ఎంపిక చేయడంపై అధికారవర్గాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి ఏకే జైన్‌ను చీఫ్ కమిషనర్‌గా నియమించాలని బాబు సర్కారు ముందుగానే నిర్ణయించుకోవడంపై సీనియర్ అధికారులు మండిపడుతున్నారు.
చీఫ్ కమిషనర్ పోస్టుకు 20, కమిషనర్ పోస్టులకు 280 దరఖాస్తులు
చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా సమాచార హక్కు కమిషనర్లు, చీఫ్ కమిషనర్‌ను నియమించకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా పట్టించుకోకపోవడంతో చివరికి సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. దీంతో సమాచార హక్కు చీఫ్ కమిషనర్, ముగ్గురు కమిషనర్ల పోస్టులను ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అనంతరం 2017 ఆగస్టు 16వ తేదీన చీఫ్ కమిషనర్ పోస్టుకు, ముగ్గురు కమిషనర్ల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. దానిలో 2017 అక్టోబర్ 10వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొంది. అనంతరం అక్టోబర్ 20 వరకు దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించారు. ఈ నోటిఫికేషన్‌కు స్పందిస్తూ చీఫ్ కమిషనర్ పోస్టుకు సీనియర్ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, రిటైర్డ్ జిల్లా జడ్డీలు కలిపి మొత్తం 20 మంది, మూడు కమిషనర్ పోస్టులకు 280 మంది దరఖాస్తు చేశారు.
ఏకే జైన్ దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా మళ్లీ నోటిఫికేషన్
ఈ పోస్టులకు ఎంపిక ప్రక్రియను ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఒక సీనియర్ మంత్రి, ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీ చేయాల్సి ఉంది. తొలుత రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిన తేదీన సమావేశానికి రావాల్సిందిగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించారు. అయితే ఆయన పాదయాత్రలో ఉన్నందున తన తరఫున ఒకరు వస్తారని ప్రభుత్వానికి సూచించారు. అయితే నిర్ధారించిన తేదీన సమావేశం జరగలేదు. తర్వాత 2018 జూలై 12న చీఫ్ కమిషనర్, ముగ్గురు కమిషనర్ల ఎంపిక సమావేశం జరిగింది. ఇందులో చీఫ్ కమిషనర్‌గా ఏకే జైన్‌ను, కమిషనర్లుగా రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి బీవీ రమణకుమార్, అడ్వకేట్ ఎం.రవికుమార్, కట్టా జనార్దన్‌ను నియమించాలని ముఖ్యమంత్రి నేతృత్వంలోని కమిటీ నిర్ణయించింది. అయితే చీఫ్ కమిషనర్‌గా ఎంపిక చేసిన ఏకే జైన్ అసలు దరఖాస్తు చేయలేదని, ఆయన నీతి ఆయోగ్‌లో సలహాదారుగా ఉన్నారని అధికారులు తెలిపారు. దీంతో ముగ్గురు కమిషనర్లను ఎంపిక చేస్తూ సంబంధిత ఫైలును గవర్నర్ ఆమోదానికి పంపారు.
అయితే గవర్నర్ నర్సింహన్.. చీఫ్ కమిషనర్ లేకుండా కమిషనర్లు ఏం చేస్తారని, నోటిఫికేషన్ జారీచేసి కూడా చీఫ్ కమిషనర్‌ను ఎంపిక చేయకపోవడమేంటంటూ ఫైలును తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. దీనిపై సీఎం చంద్రబాబు గవర్నర్‌తో మాట్లాడి మళ్లీ ఆ ఫైలును పంపగా గవర్నర్ ఆమోదం తెలిపారు. అనంతరం చీఫ్ కమిషనర్‌గా ఏకే జైన్ దరఖాస్తు చేసేందుకు వీలుగా గతంలో జారీచేసిన నోటిఫికేషన్‌ను కాదని.. కొత్తగా 2018 ఆగస్టు 24వ తేదీన మళ్లీ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. గతేడాది సెప్టెంబర్ 10ని దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు. దీంతో ఏకే జైన్ ఆగస్టు 31న నీతి ఆయోగ్ నుంచి రిలీవ్ అయి.. ఆ వెంటనే తెలంగాణ ప్రభుత్వంలో రిపోర్ట్‌చేసి పదవికి రాజీనామా చేశారు. అనంతరం చీఫ్ కమిషనర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు.