షర్మిల పాదయాత్ర మహోజ్వల ఘట్టం..
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహనరెడ్డి సోదరి షర్మిల జిల్లాలో రెండు పర్యాయాలు నిర్వహించిన మరోప్రజాప్రస్థానం పాదయాత్ర జిల్లా చరిత్రలో మహోజ్వల ఘట్టంగా నిలిచిపోతుంది. ‘నేను మీ రాజన్న కూతుర్ని.. మీ జగనన్న వదిలిన బాణాన్ని’ అంటూ ఆమె ప్రజలను ఆకట్టుకున్నారు. గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా జిల్లాలో పాదయాత్ర నిర్వహించిన ఆమె ఖమ్మం జిల్లా వైపు అడుగులు వేశారు.
జిల్లాలో 27రోజులపాటు పాదయాత్రను కొనసాగించారు. 14 నియోజకవర్గాల్లో 340.8కిలోమీటర్లు నడిచిన షర్మిల 11రచ్చబండ సభలు నిర్వహించి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేలా గురుతర బాధ్యతలను నిర్వర్తించారు. 14చోట్ల షర్మిల నిర్వహించిన బహిరంగ సభలు జనసముద్రాన్ని తలపించాయి. మరోప్రజాప్రస్థానం పాదయాత్ర మైలవరంలో 120రోజులు పూర్తి చేసుకోగా, పెడన నియోజకవర్గంలో 1500కిలోమీటర్లు పూర్తిచేసుకుని యాత్రలో 50వ అసెంబ్లీ నియోజకవర్గంగా గుర్తింపు పొందింది.
అందుకు గుర్తుగా పెడన బైపాస్ రోడ్డు సమీపంలో 18అడుగుల వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన షర్మిల అనేక ప్రజాహిత సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇదిలా ఉంటే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ గతేడాది సెప్టెంబర్ 11, 12 తేదీల్లో సమైక్య శంఖారావం పేరుతో షర్మిల మరోమారు జిల్లాలో బస్సు యాత్ర నిర్వహించారు. జిల్లాలోని అవనిగడ్డ, కైకలూరు బహిరంగసభల్లో మాట్లాడిన షర్మిల రాష్ట్ర సమైక్యత కోసం వైఎస్సార్సీపీ చేసిన ఉద్యమానికి ఊతమిచ్చారు.