ఐఎస్‌పై భూతల పోరాటం: అమెరికా
బలమైన సంకీర్ణానికి ఒబామా పిలుపు
వాషింగ్టన్: ఇరాక్ ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల గ్రూప్ (ఐఎస్)పై భూతల పోరాటానికి అమెరికా సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా సైనిక దళాల అగ్రశ్రేణి అధికారి జనరల్ మార్టిన్ డెంప్సీ కాంగ్రెస్ సభ్యులను తెలిపినట్లు సమాచారం. కాగా ఐఎస్‌పై పోరుకు అంతర్జాతీయంగా విస్తృత భాగస్వామ్యంతో కూడిన బలమైన సంకీర్ణాన్ని ఏర్పరచుకోవాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పిలుపునిచ్చారు. ఇస్లామిక్ మిలిటెంట్ల సమస్యపై పోరుకు ఏర్పాటైన ప్రపంచ సంకీర్ణ కూటమి తరఫు అధికారులతో ఒబామా మంగళవారం సమావేశమయ్యారని, ఇస్లామిక్ మిలిటెంట్ల ప్రాబల్యాన్ని నిర్వీర్యం చేసేందుకు అనుసరించిన సమగ్రవ్యూహంపై ఈ భేటీలో చర్చించారని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ తెలిపింది. ఇస్లామిక్ మిలిటెంట్లపై రాజకీయ, సైనిక, దౌత్య, ఆర్థిక తదితర రూపాల్లో తీసుకోవలసిన చర్యలపై ఒబామా చర్చించినట్టు వైట్‌హౌస్ పేర్కొంది.
పోరుకు సిద్ధం: మిలిటెంట్ల సవాల్
కాగా, ఒబామా సైన్యాన్ని పంపిన పక్షంలో,. వారితో పోరాటం జరపడానికి తామూ వేచిచూస్తున్నామని ఇరాక్ ఇస్లామిక్ మిలిటెంట్ల గ్రూప్ పేర్కొంది. ఈ మేరకు ఒక వీడియోను మిలిటెంట్ల గ్రూప్ మంగళవారం విడుదల చేసింది. 52 సెకన్ల నిడివితో కూడిన ఈ వీడియోను యుద్ధజ్వాలలు అన్న శీర్షికతో విడుదల చేశారు. మిలిటెంట్లు యుద్ధ ట్యాంకులను, అమెరికా సైనికుల ప్రతిరూపాలను పేల్చివేస్తున్న దృశ్యాలను ఈ వీడియోలో పొందుపరిచారు.
సిరియాలో చదువులపై మిలిటెంట్ల ఆంక్షలు
మరో వైపు ఇస్లామిక్ మిలిటెంట్లు తాము ఆధిపత్యం సాధించిన సిరియాలోని కొన్ని ప్రాంతాల్లో పిల్లల చదువులపై తీవ్రమైన ఆంక్షలను చలాయిస్తున్నారు. గణితశాస్త్రం, లేదా సాంఘిక శాస్త్రం చదువుకోవడానికి ససేమిరా వీల్లేదంటూ వేలాదిమంది చిన్నారులపై ఫర్మానాలు జారీ చేస్తున్నారు. క్రీడలను నిషేధించారు. ఎన్నికలు, ప్రజాస్వామ్యం గురించి చదువుకోవడానికి వీల్లేదన్నారు. ఇస్లామిక్ గ్రూప్ బోధనలు వినడానికి మాత్రమే వారిని పరిమితంచేశారు. ఏ ఉపాధ్యాయుడైనా ఈ ఆంక్షలను ఉల్లంఘించే సాహసం చేస్తే శిక్షతప్పదంటూ బిల్‌బోర్డులపైనా, వీధి స్తంబాలపైన మిలిటెంట్లు హెచ్చరికలు జారీ చేసినట్టు సీఎన్ఎన్ వార్తా సంస్థ తెలిపింది.