సమగ్ర సమాచారం సిద్ధం చేయండి
కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు
చిలకలపూడి (మచిలీపట్నం) : జిల్లాలో ఆయాశాఖల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలపై అధికారులు సమగ్ర సమాచారాన్ని రూపొందించి నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ జె మురళీ, ఏజేసీ చెన్నకేశవరావు, ట్రైనీ కలెక్టర్ సృజన, డీఆర్వో ప్రభావతి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మంగళవారం ఉదయం 10 గంటలకు కైకలూరులో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ నిర్వహించే సమీక్షా సమావేశానికి అధికారులందరూ సమగ్ర సమాచారాన్ని తీసుకురావాలన్నారు. విద్య, పశుసంవర్థకశాఖ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తమ నివేదికల్లో పూర్తిస్థాయి సమాచారం ఇవ్వాలని చెప్పారు.
జెడ్పీ సీఈవో డి.సుదర్శనం, డీఆర్డీఏ పీడీ రజనీకాంతారావు, డ్వామా పీడీ అనిల్‌కుమార్, సాంఘిక సంక్షేమశాఖ డీడీ డి.మధుసూధనరావు, మత్స్యశాఖ డీడీ టి.కళ్యాణం, పశుసంవర్థకశాఖ జేడీ దామోదరనాయుడు, డీసీవో రమేష్‌బాబు, డీఈవో డి.దేవానందరెడ్డి, ఎక్సైజ్ ఏఈఎస్ ఎన్.సునీత, డీఎంఅండ్‌హెచ్‌వో జె.సరసజాక్షి, డీఎస్వో పి.బి. సంధ్యారాణి, బందరు ఆర్డీవో సాయిబాబు, మచిలీపట్నం మునిసిపల్ కమిషనర్ మారుతీదివాకర్, ఇన్చార్జ్ డీపీవో చంద్రశేఖర్ పాల్గొన్నారు.
అర్జీలు ఇవే :
విస్సన్నపేట మండల కేంద్రంలో రైతుబజార్ ఏర్పాటు చేసి నాణ్యమైన కూరగాయలను తక్కువ ధరకు అందించేలా చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన కె.కృష్ణమోహన్ అర్జీ ఇచ్చారు.
జి.కొండూరు మండలం గంగినేనిపాలెం గ్రామంలో వాగు, ఆర్అండ్బీ రహదారి ఆక్రమణకు గురైందని ఆక్రమణదారులను తొలగించి చర్యలు చేపట్టాలని కోరుతూ గ్రామానికి చెందిన ఎస్.పుల్లారావు వినతిపత్రం సమర్పించారు.
2013 ఏప్రిల్ నెలలో గ్రూప్-4 బ్యాక్లాగ్ పోస్టుల నియామకంలో వికలాంగుల కోటా కింద భర్తీ చేసిన అభ్యర్థులకు త్వరితగతిన నియామక పత్రాలివ్వాలని చైతన్య వికలాంగుల సేవాసమితి అధ్యక్షులు జె.అంజయ్య అర్జీ ఇచ్చారు.
తనకు రావాల్సిన పీఎఫ్ సొమ్మును ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని నిమ్మకూరు మహిళా మండలిలో వంటమనిషిగా పనిచేసి పదవీ విరమణ చేసిన పామర్రు మండలం కొమరవోలు గ్రామానికి చెందిన పి.తులసమ్మ వినతిపత్రమిచ్చారు.
మచిలీపట్నంలోని కోనేరుసెంటరులో షాపుల ముందు ఏర్పాటు చేసిన ఆటోస్టాండ్‌ను మరో ప్రదేశానికి మార్చాలని కోరుతూ మాజేటి రమేష్‌బాబు అర్జీ ఇచ్చారు.
మచిలీపట్నం 24వ వార్డులోని ఉల్లింగిపాలెం దళితవాడకు చెందిన ఆరుగురు లబ్ధిదారులకు ప్రభుత్వం మాఫీ చేసిన ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాల ధ్రువపత్రాలు ఇవ్వాలని పట్టణ పౌర సంఘం నాయకులు బూర సుబ్రమణ్యం అర్జీ ఇచ్చారు.
మచిలీపట్నం మునిసిపాల్టీ పరిధిలో ప్రధాన రహదారికిరువైపులా డ్రెయిన్లను ఏర్పాటు చేసి మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అర్జీ ఇచ్చారు.
శింగనపూడి దళితవాడకు చెందిన శ్మశానభూమిని ఆక్రమణదారుల నుంచి గ్రామస్తులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వినతిపత్రమిచ్చారు.
కలిదిండి మండలం పెదలంక గ్రామంలోని చెరువును అభివృద్ధి చేసేందుకు చెరువు పక్కనే ఉన్న భూమిని సేకరించి చెరువు విస్తీర్ణం పెంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అర్జీ ఇచ్చారు.