state olympic association
-
క్రీడా సంఘాల్లో విభజన షురూ
ముగిసిన ఏపీఓఏ కార్యవర్గ సమావేశం ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆంధ్ర ప్రదేశ్ విభజన నేపథ్యంలో రాష్ట్ర ఒలింపిక్ సంఘం (ఏపీఓఏ) కార్యవర్గం చివరి సమావేశం శనివారం ఇక్కడి ఒలింపిక్ భవన్లో జరిగింది. ఏపీఓఏ అధ్యక్షుడు, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యవర్గ సమావేశంలో గత జూలై 7వ తేదీన చేసిన పలు తీర్మానాలు అమోదించారు. ఏపీఓఏ అనుబంధంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 51 క్రీడా సంఘాలు ఉండగా తెలంగాణ, ఆంధ్రపదేశ్‌లో కొత్తగా 46 క్రీడా సంఘాల ఏర్పాటుకు మార్గదర్శకాలు రూపొందించారు. ఈ క్రీడా సంఘాల జాబితాల్లో ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రలో ఐదు క్రీడా సంఘాలు ప్రత్యేకంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఇందులో ఖోఖో, కబడ్డీ, బాల్‌బ్యాడ్మింటన్, క్యారమ్, బాడీబిల్డింగ్ సంఘాలున్నాయి. రెండు రాష్ట్రాల క్రీడా సంఘాల ఏర్పాటుకు, విధి విధానాల కోసం తొమ్మిది మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. ఈ క్రీడా సంఘాల పునర్విభజన కమిటీ చైర్మన్‌గా లగడపాటి రాజగోపాల్, వైస్ చైర్మన్‌గా ఎపీ జితేందర్‌రెడ్డి, కన్వీనర్‌గా కె.జగదీశ్వర్ యాదవ్ వ్యవహరిస్తారు. ఈ కమిటీ సభ్యులుగా తెలంగాణ నుంచి ప్రొఫెసర్ కె.రంగారావు (ఏపీ అథ్లెటిక్ అసోసియేషన్), బి.కె.హరనాథ్ (హైదరాబాద్ క్యారమ్), ఆర్. నారాయణరెడ్డి (ఆదిలాబాద్), ఆంధ్ర ప్రాంతం నుంచి పద్మనాభం (తూర్పు గోదావరి), ఎం.నిరంజన్‌రెడ్డి (గుంటూరు), మచ్చ రామలింగారెడ్డి (అనంతపురం)లను నియమించారు. ఈ కమిటీ మే నెల 15వ తేదీలోగా రెండు రాష్ట్రాల్లో 46 క్రీడా సంఘాల కొత్త కార్యవర్గాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయనుంది. జూన్ 2నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త క్రీడా సంఘాలకు ఎన్నికలు నిర్వహించి కొత్త కమిటీలు తమ కార్యకలాపాలు సాగించే విధంగా చర్యలను ఈ కమిటీ తీసుకోనుంది. జాతీయ క్రీడా సమాఖ్య గుర్తింపు ఉన్న క్రీడా సంఘాలకే ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఏపీఓఏ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ కె.రంగారావు, ఎపీ.జితేందర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శులు ఎస్.ఆర్.ప్రేమ్‌రాజ్, కోశాధికారి బి.కె.హరనాథ్, సభ్యులు ఎస్.సోమేశ్వర్రావు, ఆర్.నిరంజన్‌రెడ్డి, బి.కైలాష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
సెయిలింగ్ అసోసియేషన్‌కు గుర్తింపు ఉంది
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర సెయిలింగ్ అసోసియేషన్ (ఏపీఎస్ఏ) అనే సంస్థ లేదని ఏపీఓఏ ప్రధాన కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్ ఆరోపించడం సరికాదని ఏపీఎస్ఏ అధ్యక్షుడు గోపాలకృష్ణ విమర్శించారు. జాతీయ సెయిలింగ్ సమాఖ్య నుంచి ఏపీఎస్ఏకు గుర్తింపు ఉందని గుర్తుచేశారు. సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతర్ జిల్లా సెయిలింగ్ చాంపియన్‌షిప్, ఇంటర్ జోన్ సెయిలింగ్ పోటీలను 2006 నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత ఆగస్టులో జరిగిన సెయిలింగ్ చాంపియన్‌షిప్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగదీశ్వర్ యాదవే పాల్గొన్నారని, ఇప్పుడు ఆయనే రాష్ర్టంలో సెయిలింగ్ కార్యకలాపాలు జరగడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని గోపాలకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ (ఏపీఓఏ), రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాప్)నుంచి నిధులు ఆశించకపోవడం వల్లే తమను గుర్తించడం లేదని చెప్పారు. -
స్పోర్ట్స్ కోటా ప్రవేశాల్లో అక్రమాలు
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్‌లో స్పోర్ట్ కోటా ద్వారా జరిగే అడ్మిషన్ కౌన్సెలింగ్‌లో శాప్ అధికారులు భారీగా అక్రమాలకు పాల్పడుతున్నట్టు రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్(ఏపీఓఏ) ఆరోపించింది. ఇక్కడి ఎల్బీ స్టేడియంలోని ఒలింపిక్ భవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీఓఏ ఉపాధ్యక్షుడు ఎ.పి.జితేందర్‌రెడ్డి, ప్రొఫెసర్ కె.రంగారావు, కోశాధికారి బి.కె.హరినాథ్, సంయుక్త కార్యదర్శి పి.మల్లారెడ్డి, కృష్ణా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి కె.పిరావులతో కలిసి ప్రధాన కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్ మాట్లాడారు. ఎంబీబీఎస్, అగ్రికల్చర్, బీడీఎస్ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ(శాప్)ఎండీ చైర్మన్‌గా, ఎనిమిది మంది సభ్యులచే ఒక కమిటీని ఏర్పాటు చేసిందని జగదీశ్వర్ యాదవ్ తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్న, పతకాలను గెలిచిన ఆటగాళ్ల క్రీడల ధృవీకరణ పత్రాలపై, కమిటీ సభ్యులు లేవనెత్తిన సందేహాలను శాప్ అధికారులు నివృత్తి చేయాల్సి ఉందని గుర్తుచేశారు. అయితే తమను సంప్రదించకుండానే తుది జాబితాను యూనివర్సిటీకి అందజేయడమేంటని ఆయన ప్రశ్నించారు. అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో జారీ చేసిన సంబంధిత సరిఫికెట్లు లేకున్నా వారికి మినహాయింపు ఇచ్చి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సెయిలింగ్, రోలర్ స్కేటింగ్ క్రీడల పేరుతో మెడికల్ సీట్లను కొందరు బోగస్ క్రీడాకారులు పొందారని విమర్శించారు. మెడికల్ సీట్లలో 2011 నుంచి జరుగుతున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీచే విచారణ జరిపించి అర్హులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అవాస్తవం: డాక్టర్ మోహన్ స్పోర్ట్స్ కోటా కింద మెడికల్ సీట్ల భర్తీలో తనపై వచ్చిన ఆరోపణలను శాప్ మాజీ డిప్యూటీ డెరైక్టర్, ప్రస్తుత పైకా సలహాదారుడు డాక్టర్ ఎన్.సి.మోహన్ ఖండించారు. గతంలో జాతీయ క్రీడా సమాఖ్య సమర్పించిన ధృవీకరణ పత్రాల ఆధారంగా మెడికల్ సీట్లను కేటాయించినట్లు ఆయన చెప్పారు.