ముగిసిన ఏపీఓఏ కార్యవర్గ సమావేశం
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆంధ్ర ప్రదేశ్ విభజన నేపథ్యంలో రాష్ట్ర ఒలింపిక్ సంఘం (ఏపీఓఏ) కార్యవర్గం చివరి సమావేశం శనివారం ఇక్కడి ఒలింపిక్ భవన్‌లో జరిగింది. ఏపీఓఏ అధ్యక్షుడు, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యవర్గ సమావేశంలో గత జూలై 7వ తేదీన చేసిన పలు తీర్మానాలు అమోదించారు.
ఏపీఓఏ అనుబంధంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 51 క్రీడా సంఘాలు ఉండగా తెలంగాణ, ఆంధ్రపదేశ్‌లో కొత్తగా 46 క్రీడా సంఘాల ఏర్పాటుకు మార్గదర్శకాలు రూపొందించారు. ఈ క్రీడా సంఘాల జాబితాల్లో ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రలో ఐదు క్రీడా సంఘాలు ప్రత్యేకంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఇందులో ఖోఖో, కబడ్డీ, బాల్‌బ్యాడ్మింటన్, క్యారమ్, బాడీబిల్డింగ్ సంఘాలున్నాయి.
రెండు రాష్ట్రాల క్రీడా సంఘాల ఏర్పాటుకు, విధి విధానాల కోసం తొమ్మిది మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. ఈ క్రీడా సంఘాల పునర్విభజన కమిటీ చైర్మన్‌గా లగడపాటి రాజగోపాల్, వైస్ చైర్మన్‌గా ఎపీ జితేందర్‌రెడ్డి, కన్వీనర్‌గా కె.జగదీశ్వర్ యాదవ్ వ్యవహరిస్తారు. ఈ కమిటీ సభ్యులుగా తెలంగాణ నుంచి ప్రొఫెసర్ కె.రంగారావు (ఏపీ అథ్లెటిక్ అసోసియేషన్), బి.కె.హరనాథ్ (హైదరాబాద్ క్యారమ్), ఆర్. నారాయణరెడ్డి (ఆదిలాబాద్), ఆంధ్ర ప్రాంతం నుంచి పద్మనాభం (తూర్పు గోదావరి), ఎం.నిరంజన్‌రెడ్డి (గుంటూరు), మచ్చ రామలింగారెడ్డి (అనంతపురం)లను నియమించారు.
ఈ కమిటీ మే నెల 15వ తేదీలోగా రెండు రాష్ట్రాల్లో 46 క్రీడా సంఘాల కొత్త కార్యవర్గాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయనుంది. జూన్ 2నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త క్రీడా సంఘాలకు ఎన్నికలు నిర్వహించి కొత్త కమిటీలు తమ కార్యకలాపాలు సాగించే విధంగా చర్యలను ఈ కమిటీ తీసుకోనుంది. జాతీయ క్రీడా సమాఖ్య గుర్తింపు ఉన్న క్రీడా సంఘాలకే ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఏపీఓఏ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ కె.రంగారావు, ఎపీ.జితేందర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శులు ఎస్.ఆర్.ప్రేమ్‌రాజ్, కోశాధికారి బి.కె.హరనాథ్, సభ్యులు ఎస్.సోమేశ్వర్‌రావు, ఆర్.నిరంజన్‌రెడ్డి, బి.కైలాష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడా సంఘాల్లో విభజన షురూ
Published Sun, Mar 23 2014 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 5:01 AM
Advertisement
Advertisement