సత్తా చూపిద్దాం.. హోదా సాధిద్దాం
రాష్ట్రప్రజలకు పిలుపునిచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
* ప్రాణాలు తీసుకోవద్దు.. కలసికట్టుగా పోరాడుదాం
* ప్రత్యేకహోదాపై చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారు
* ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకు ఏపీని తాకట్టుపెట్టారు
* ఢిల్లీ వెళ్లిన బాబు ఆ గంటన్నర సమయం ఏం చేశారు?
* ప్రత్యేకహోదాపై కేంద్ర కేబినెట్‌కే సర్వాధికారాలున్నాయి
* 14వ ఫైనాన్స్ కమిషన్‌ను సాకుగా చూపిస్తున్నారంతే
* ప్రత్యేకహోదా రాకుంటే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది
* అందుకే బంద్‌ను విజయవంతం చేసుకుందాం
* బంద్‌ను నిర్వీర్యం చేయాలని చూస్తే బాబు చరిత్ర హీనులౌతారు
* లక్ష్మయ్య కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
* ఆయన కుటుంబానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘ప్రాణం ఎంతో విలువైంది... ఎవ్వరూ ప్రాణాలు తీసుకోవద్దు... కలసికట్టుగా పోరాడుదాం... మన సత్తా చూపించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి ప్రత్యేకహోదాను సాధించుకుందాం’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా విషయంలో నాటకాలాడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధిచెప్పేలా రాష్ట్రబంద్‌ను విజయవంతం చేయాలన్నారు.
ప్రత్యేకహోదాకోసం కేంద్రంపై పోరాడే ధైర్యం చంద్రబాబుకు లేకపోయినా.. లక్ష్మయ్యలాంటి సామాన్యులు తమ ప్రాణత్యాగంతో కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వారి త్యాగాన్ని చంద్రబాబు గుర్తించడా? లక్ష్మయ్య కుటుంబాన్ని కనీసం ఆదుకునేందుకు ఇప్పటివరకూ ఎవ్వరూ రాకపోవడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు. లక్ష్మయ్య త్యాగాన్ని గుర్తించి వారి కుటుంబానికి వెంటనే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదా కోసం ఆత్మహత్య చేసుకున్న లక్ష్మయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన శుక్రవారం నెల్లూరుకు వచ్చారు. లక్ష్మయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే...
కలిసికట్టుగా రాష్ట్రాన్ని విడగొట్టారు
లక్ష్మయ్య మృతికి కారణాలేమిటో తెలిసినా ప్రభుత్వం తెలియనట్లుగా మభ్యపెట్టి చూపే ప్రయత్నాలు చేస్తోంది. లక్ష్మయ్య కొడుకు వెంకటేశ్వర్లు డిగ్రీ చదివాడు. సరైన ఉద్యోగం లేదు. రాష్ట్రంలో ఏ నిరుద్యోగ యువతను అడిగినా... ప్రత్యేకహోదావల్ల రాష్ట్రానికి ఎంత మంచి జరుగుతుందో, ఎన్ని ఉద్యోగావకాశాలు వస్తాయో చెప్తారు. ఒక్క చంద్రబాబు మాత్రమే ప్యాకేజీవల్లనే లాభమంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.
ఎన్నికల్లో గెలవడంకోసం చంద్రబాబు బీజేపీతో కలిసి చేసిన వాగ్దానాలేమిటి? ఇప్పుడు చేస్తున్నదేమిటి? రాష్ట్ర విభజనవల్ల 95 శాతం సర్వీస్ సెక్టార్, 75 శాతం మ్యానుఫ్యాక్చరింగ్ ఏపీకి లేకుండా పోతుందని, అందుకు పరిహారంగా ఐదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని అప్పటి ప్రధాని పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేత వెంకయ్యనాయుడు ఐదేళ్లు కాదు.. పదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని విడగొట్టేందుకు తామే మొదట ఓటేశామంటూ టీడీపీ ఎంపీలు బయటకొచ్చి రెండువేళ్లు చూపించారు. అలా అందరూ కలిసికట్టుగా రాష్ట్రాన్ని విడగొట్టారు.
ఒక్క హామీ నెరవేర్చారా?
ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం కావాలంటే బాబు రావాలి. నిరుద్యోగభృతి రావాలంటే బాబు రావాలి. రైతు, డ్వాక్రా, చేనేత రుణమాఫీ కావాలంటే చంద్రబాబు రావాలి అని గోడలమీద రాశారు, టీవీలో ప్రకటనలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ అయినా నెరవేర్చారా? ప్రత్యేకహోదా గురించి అడక్కుండా... సాకులు వెతుకుతున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఎంపీలతో కలిసి ప్రధానమంత్రి మోదీ, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్యనాయుడుతో గంటన్నరసేపు సమావేశమయ్యారు.
బయటకొచ్చాక చంద్రబాబుకానీ, అరుణ్జైట్లీకానీ ప్రత్యేకహోదా గురించి ఒక్కమాట మాట్లాడలేదు. అంటే చంద్రబాబు ప్రత్యేకహోదా గురించి అడగలేదనే కదా అర్థం. తర్వాత వెంకయ్యనాయుడుతో కలిసి చంద్రబాబు హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వద్దకెళ్లారు. అక్కడి నుంచి వచ్చాక వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... ప్రత్యేకహోదా గురించి 14 ఫైనాన్స్ కమిషన్ చెప్పలేదని చేతులెత్తేశారు. ఏపీకి చెందిన వ్యక్తి కాబట్టి హోదాకు బదులుగా ప్యాకేజీ కోసం తనవంతు ప్రయత్నిస్తున్నట్లు వెంకయ్యనాయుడు చెప్పటం ఎంతవరకు న్యాయం? ప్రత్యేకహోదా ఇచ్చే అధికారం 14 ఫైనాన్స్ కమిషన్‌కు లేదు. అయినా ఇటువంటి అబద్ధాలు చెప్పటం ధర్మమేనా? ప్రత్యేకహోదా ఇచ్చే సర్వాధికారాలు కేంద్రకేబినెట్కు, ప్రధానమంత్రికి ఉంటాయి.
నాటి కేబినెట్ తీర్మానం ఏమైంది..?
ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇవ్వాలని గత కేంద్ర కేబినెట్ తీర్మానించింది. ఆ కేబినెట్ నిర్ణయాన్ని మోదీ కేబినెట్ ఎందుకు అమలు చేయట్లేదు? ఈ విషయంపై చంద్రబాబు ఎందుకు నిలదీయడంలేదు? ప్రత్యేకహోదా ఇవ్వకపోతే కేంద్ర కేబినెట్‌నుంచి ఇద్దరు టీడీపీ మంత్రులతో ఎందుకు రాజీనామా చేయించడంలేదు? ఒక్కటే కారణం... ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కూరుకుపోయారు.
పట్టిసీమ, కాంట్రాక్ట్ పనుల నుంచి, లంచాలు తీసుకుని సంపాదించిన అవినీతి డబ్బుతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల చొప్పున మొత్తం రూ.150 కోట్ల నల్లధనాన్ని ఖర్చుచేసేందుకు ప్రయత్నించిన చంద్రబాబు అడ్డంగా దొరికారు. ఓటుకు కోట్లు కేసులో ఎక్కడ జైల్లో పెడతారోననే భయంతోనే చంద్రబాబు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రయోజనాలను, హోదాను ఫణంగా పెట్టారు.
ప్యాకేజీ పేరుతో మభ్యపెట్టే యత్నాలు...
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ అన్నివిధాలా నష్టపోతుందని, అందుకు పరిహారంగా పోలవరంతో పాటు పలు ప్రాజెక్టులు, రహదారులు వంటి ఎన్నో ప్రయోజనాలు కల్పించే విధంగా చట్టం చేశారు. ప్రస్తుతం వాటి కోసమే కేంద్రం నిధులు విడుదల చేస్తోంది. వాటినే కలిపి కొత్తగా ప్యాక్‌చేసి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నామంటూ కేంద్రం మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తుంటే బాబు వంత పాడుతున్నారు. ప్రజలను పక్కదారి పట్టించే యత్నంచేస్తున్నారు.
బంద్‌తో సత్తా చూపిద్దాం
ప్రత్యేకహోదాకోసం వైఎస్సార్ కాంగ్రెస్ చేపడుతున్న రాష్ట్ర బంద్‌ను అడ్డుకునేందుకు, వైఎస్సార్సీపీ నాయకులను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తే చంద్రబాబు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. బంద్‌ను కేంద్రానికి చూపించి ప్రత్యేకహోదా ప్రకటించే విధంగా కృషిచేయాలి. చంద్రబాబు ఇప్పటికైనా మేల్కొనకపోతే ప్రజలు క్షమించరు. ప్రత్యేకహోదా రాకుంటే ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుంది.
చంద్రబాబు అడ్డుతగిలినా బంద్‌ను విజయవంతం చేసేందుకు యువత, విద్యార్థులు కలిసిరావాలి.మన సత్తా కేంద్రానికి చూపించాలి. చంద్రబాబు, కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా సాధించుకోవాలి. కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, పాశం సునీల్‌కుమార్, సీజేసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
మీకు అండగా నేనుంటా
‘‘అధైర్యపడకండి. మీకు అండగా నేనుంటా. మీ అబ్బాయికి ఉద్యోగం ఇప్పిస్తా. ప్రభుత్వం నుంచి మీకు సాయం అందేలా కృషిచేస్తా’’ అని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకహోదా కోసం ఆత్మహత్య చేసుకున్న లక్ష్మయ్య కుటుంబానికి హామీ ఇచ్చారు. రేణిగుంట నుంచి రోడ్డుమార్గాన నెల్లూరుకు చేరుకున్న ఆయన వేదాయపాళెంలో కేశువులునగర్లోని లక్ష్మయ్య నివాసానికి చేరుకున్నారు. ముందుగా లక్ష్మయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం లక్ష్మయ్య భార్య విజయమ్మ, కుమారుడు వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య సోదరి బుజ్జమ్మతో ప్రత్యేకంగా మాట్లాడారు. లక్ష్మయ్య ఆత్మహత్యకు దారితీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మయ్య సోదరి బుజ్జమ్మ వైఎస్ జగన్‌ను పట్టుకుని కన్నీరుపెట్టుకున్నారు. తన బిడ్డలకు దిక్కెవరని రోదించారు. జగన్ ఆమెను ఓదార్చి... ‘‘లక్ష్మయ్య మరణం నన్ను కలచివేసింది. మీకు అండగా నేనుంటా. మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటాను. ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం కోసం కృషిచేస్తాను. అధైర్యపడకండి’’ అని ధైర్యం చెప్పారు.