ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇదో విప్లవం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థలో తెచ్చిన మార్పులు అందరికీ ఆహారం, ఇతర నిత్యావసరాలు అందాలన్న ప్రభుత్వ ఆశయాన్ని మరింత ముందుకు తీసుకుపోతున్నాయి. ఇప్పటికే ఇంటింటికీ నిత్యావసర సరుకుల పంపిణీ విధానం ప్రజా మన్ననలు పొందింది. వలంటీరు వ్యవస్థ పటిష్టంగా ఉండటం, సచివాలయాల పాలన ప్రజలకు అతి దగ్గరగా కొనసాగుతుండటం వల్ల ప్రజాపంపిణీ మరింత ప్రయోజకత్వాన్ని సంతరించుకొంది. దీంతో ప్రజల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతి నెలా మొదటి వారంలోనే చౌక డిపోల నుంచి ఇంటిముందుకు ప్రత్యేక సంచార వాహనాలు సరుకులు తీసుకురావడం దేశంలో ఇదే మొదటిసారి. కుటుంబంలో ఏ ఒక్క లబ్ధిదారుడయినా రేషన్ సరుకులు తీసుకోవచ్చు. పెద్దలు కుటుంబ పోషణ కోసం ఇంటి నుంచి పని చేసే ప్రదేశాలకు వెళ్ళిన సమయాల్లో పిల్లలు సైతం ఈ సంచార వాహనాల నుంచి సరుకులు తీసుకోవచ్చు. చిన్నా చితకా కూలి పనులు చేసుకు బతికే పేదల చెంతకు సత్వర సేవలు అందాలనే ప్రభుత్వ లక్ష్యం కూడా ఇక్కడ నెరవేరుతుంది.
‘జాతీయ ఆహార భద్రతా చట్టం 2013’ పోషకాహార భద్రతను అందించడం లక్ష్యంగా సాగుతోంది. ప్రజలు ఆరోగ్యంగా జీవించడానికి ఈ చట్టం ఉపకరిస్తుంది. సరస మైన ధరలకు తగిన పరిమాణంలో నాణ్యమైన ఆహారాన్ని అందించలసిన బాధ్యత ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ పౌరసరఫరాల సంస్థ బియ్యం, గోధుమలను భారత ఆహార సంస్థ నుంచీ, చక్కెరను పరిశ్రమల నుంచీ సేకరించి ప్రజలకు చేరుస్తోంది. చౌక ధరల దుకాణాలు ప్రజాపంపిణీ ప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.
మిల్లుల నుంచి మండల స్థాయి నిల్వ కేంద్రాలకు ‘భారత ఆహారసంస్థ’ సరకు రవాణా చేస్తుంది. ఆ సరుకు నిల్వ కేంద్రాల నుంచి లబ్ధి దారుల ఇంటి మెట్ల వరకు సరుకులు చేర్చడం ద్వారా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నూతన అధ్యాయం సృష్టించింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనూ, విపత్తులలోనూ ఆహారం, వస్తువుల పంపిణీ చౌకధరల దుకాణాల నుంచే జరుగుతోంది. కోవిడ్ మహమ్మారి కాలంలో ఈ దుకాణాలు ప్రజలకు ఆహారాన్ని అందించడంలో అవిశ్రాంతంగా కృషి చేశాయి.
కొన్ని జిల్లాల్లో 25 కిలోమీటర్ల పరిధిలోని భారత ఆహార సంస్థ గోడౌన్ల నుంచి చౌకధరల దుకాణాలకు నేరుగా ఆహార ధాన్యాల తరలింపు కూడా జరుగుతోంది. తొలిదశ రవాణా, నిర్వహణ ఛార్జీలను నివారించడం ద్వారా విజయ వాడ, విశాఖపట్నంలలో చౌక ధరల దుకాణాల డీలర్లు నేరుగా మండల స్థాయి సరుకు నిల్వ కేంద్రాల నుంచి సరుకు తీసుకెళ్తున్నారు. ఇలా భారత ఆహారసంస్థ ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ ఒక కారణం. గ్రామ స్థాయి నుంచి ఆంధ్ర ప్రదేశ్ పాలనా యంత్రాంగంలో చోటు చేసుకున్న మార్పులు ఉద్యోగుల్నీ, అధికారులనూ పజలపక్షం నిలబెట్టాయని చెప్పొచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాపంపిణీ వ్యవస్థలో సంచార వాహనాల ద్వారా ఇంటింటికీ సరుకు పంపిణీ మొదలయిన తర్వాత లబ్ధిదారులు పదిశాతం మంది పెరిగారని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనిని బట్టి సంచార వాహ నాల ద్వారా ప్రజాపంపిణీ జనామోదం పొందిందని అర్థమ వుతుంది. ప్రజాపంపిణీ వ్యవస్థను ‘సమగ్ర శిశు అభివృద్ధి పథకం’, ‘మధ్యాహ్న భోజన పథకా’లకు కూడా విస్తరించారు. దీనితో సకాలంలో లబ్ధిదారులకు ఆహారపదార్థాలు అందించ గలుగుతున్నారు. 2023–2024 ఆర్థిక సంవత్సరంలో ఆహార, పౌర సరఫరాల శాఖకు రూ. 3,725 కోట్లు కేటాయించారు. ఇటువంటి పథకాలు, ప్రభుత్వ విధానాల ద్వారా ఆంధ్రప్రదేశ్లో ‘ఆహార భద్రత’ స్థాయి పెరిగింది. గతంలో కంటే పేదలకు ప్రభుత్వం పట్ల మనస్సులో విశ్వాసం నిండింది.
భారత ప్రభుత్వ ‘వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ’ మంత్రిత్వశాఖ ప్రత్యేక ప్రకటన ద్వారా రాష్ట్ర ఆహార కమిషన్ ‘జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013’లోని సెక్షన్ 16 అమలును సమీక్షిస్తుంది.
నేటి ‘ఆంధ్రప్రదేశ్ ఆహార కమిషన్’ దాని పరిధిలో శక్తి మంతంగా పనిచేస్తోంది. ఆహార భద్రత, హక్కుల పట్ల ప్రజలకు అవగాహన కలిగిస్తోంది. అధికారులు, ఉద్యో గులు సక్రమంగా పనిచేసే విధంగా పర్యవేక్షిస్తోంది. ప్రజా ఫిర్యాదులకు వెంటనే స్పందించి పరిష్కరిస్తోంది.
అంగన్ వాడీ కేంద్రాల్నీ, ప్రభుత్వ గురుకులాల్నీ, వసతి గృహాలనూ తనిఖీ చేసి అక్కడ విద్యార్థులకు పెడుతున్న ఆహారం, వసతుల్ని పర్యవేక్షిస్తోంది. ఈ విద్యాలయాలు, హాస్టళ్లకు నాణ్యమైన ఆహార పదార్థాలు సక్రమంగా సరఫరా జరుగుతుందో లేదో తనిఖీ చేస్తోంది. గతంలో కంటే ఆంధ్రప్రదేశ్లో భారత ఆహార భద్రతాచట్టం పటిష్టంగా అమలు జరుగుతుందని చెప్పొచ్చు. దీని కోసం స్థానిక ఏపీ ఆహార కమిషన్ అన్ని విధాలా సమర్థంగా పనిచేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం ‘వలంటీర్’ వ్యవస్థను ప్రవేశపెట్టి తద్వారా ‘ఇంటిదగ్గరకే ప్రభుత్వ పాలన’ అనే లక్ష్యాన్ని అక్షరాలా సాధించిందని చెప్పడానికి ప్రజా పంపిణీ వ్యవస్థలో వచ్చిన మార్పులే నిదర్శనం. ప్రభుత్వ సేవలు భౌతిక రూపంలో ఇంటిముందుకు నడిచి రావడం కన్నా ఏ ప్రజా పంపిణీ వ్యవస్థ అయినా సాధించగల విజయం ఏముంది?
కాట్రగడ్డ సురేష్
వ్యాసకర్త ఆల్ ఇండియా కన్సూ్యమర్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ ఏపీ అధ్యక్షులు ‘ 94412 64249