రణభేరి విజయవంతానికి కృషి
రాయచోటి, న్యూస్‌లైన్ : ఈ నెల 26న నిర్వహిస్తున్న రాయచోటి రణభేరి సభ విజయవంతానికి అందరూ సమష్టి కృషి చేయాలని సమైక్యాంధ్ర అధికార జేఏసీ కన్వీనర్, కడప ఆర్డీఓ వీరబ్రహ్మం పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్థానిక ఎమ్మార్సీ భవనంలో రాయచోటి - లక్కిరెడ్డిపల్లె ప్రాంతాల్లోని అన్ని మండలాల సమైక్యాంధ్ర అధికార, అనధికార జేఏసీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవిభజనను నిరసిస్తూ అన్ని వర్గాల ప్రజలు ఆందోళనకు దిగడం సంతోషించదగ్గ పరిణామమన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఈనెల 26వ తేదీన రాయచోటి ప్రభుత్వ ఉన్నతపాఠశాల ఆవరణంలో రాయచోటి రణభేరి కార్యక్రమాన్ని నిర్వహింప తలపెట్టామన్నారు.
రణభేరి సభ నిర్వహణ కు అవసరమైన ఏర్పాట్ల కోసం 20 కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యమ నిర్వహణకు అవసరమైన నిధుల సేకరణ, స్టేజీ నిర్మాణం, భోజనం, తాగునీటి వసతుల కల్పన తదితర విషయాలకు ప్రత్యేక కమిటీలు వేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా రణభేరి సభ విషయమై పట్టణంతో పాటు గ్రామీణప్రాంతాల్లో సైతం జోరుగా ప్రచారం చేయాలని సూచించారు. గ్రామాలలోని డీలర్లు, వీఆర్ఓలు, డ్వాక్రా, అంగన్వాడీల మహిళలు తదితరులు ఇంటింటికి వెళ్లి సమైక్యాంధ్ర ఉద్యమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. సభ విషయంపై విసృ్తతంగా ప్రచారం చేయడం, అన్ని వర్గాల ప్రజలను రణభేరికి పెద్ద ఎత్తున హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులు, సమైక్యవాదులపై ఉందన్నారు.
రణభేరికి ముఖ్య అతిధులుగా ఏపీఎన్జిఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు, గజల్ శ్రీనివాస్, వంగపండు ఉష, రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ సి.హెచ్.చంద్రశేఖరరెడ్డి, సత్యవాణి తదితరులు హాజరై ప్రసంగిస్తారన్నారు. కార్యక్రమంలో రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, వీరబల్లి, సుండుపల్లె, సంబేపల్లె, చిన్నమండెం, గాలివీడు మండలాలకు చెందిన అధికార, అనధికార జేఏసీల కన్వీనర్లు, కో-కన్వీనర్లతో పాటు మెప్మా, ఐసీడీఎస్, డ్వాక్రా, ప్రైవేటు స్కూల్స్ అండ్ కళాశాలల కరస్పాండెంట్లుతో పాటు రాయచోటి జేఏసీ కన్వీనర్ నాగిరెడ్డి, సభ్యుడు జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.