హాస్యమాల జంధ్యాల
సంగీతం, సాహిత్యం, హాస్యం ఈ మూడు కలిస్తేనే జంధ్యాల. ఈయన పేరు వెంకటదుర్గా శివసుబ్రమణ్య శాస్త్రి. డెబ్బయ్యో దశకంలో ఆధునిక తెలుగు సినిమాల్లో తన హాస్య సంభాషణలతో నవ్వుల హరివిల్లును పూయించిన ఘనత కేవలం జంధ్యాలకు మాత్రమే దక్కుతుంది. మనందరినీ కడుపుబ్బ నవ్వించిన జంధ్యాల జయంతి నేడు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.
అన్నానగర్, న్యూస్‌లైన్ : రాజ్‌కపూర్ తన ఆత్మగురువు అని జం ద్యాల ఒకసారి వేటూరితో అన్నారట. అందుకేనేమో ఆయన చిత్రంలో ప్రేమ గొప్పదనాన్ని గురించి తెలిపే ఒక పాట తప్పనిసరిగా ఉండాల్సిందే. అది కూడా వేటూరి సుందరరామ్మూర్తిది మాత్రమే ఉండేలా ఆయన శ్రద్ధ వహించేవారు. జంధ్యాల మనసు వెన్నముద్ద అయితే ఆయన కళ్లు వెన్నెల పొద్దులు, ఆయన మాటలు జలపాత సున్నితాలు, నవరసాలన్నింటిలోనూ జంధ్యాల హాస్య రసాన్నే అవపోసన పట్టారు. నవ్వులను పండించారు. పెద్ద కళ్లేపల్లెలో మూడు రోజుల పాటు సాగే తెలుగు వసంతోత్సవాలు జంధ్యాలకు అత్యంత ఇష్టమైనవి. ఎందుకంటే అక్కడ ఆయన తన జోకులతో కళా రసికులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడమే కాక తన పొట్టను కూడా చెక్కలు చేసుకునేలా నవ్వేవారు. వేలుగాడు, స్టువర్టుపురం పోలీసు స్టేషన్, స్టేషన్ మాస్టరు సినిమాల్లో జంధ్యాల రాసిన సంభాషణలు ప్రాసక్రీడగా జగత్ విఖ్యాతమయ్యాయి. ముళ్లపూడిని గురువుగా భావించే జంధ్యాలకు బ్రాహ్మణీకపు ప్రథమ కోపాలూ, గ్రంధాక్షరీ శాపాలు కూడా హాస్యంలోని ప్రధాన వస్తువులే అయ్యూయి. రెండు జళ్ల సీత సినిమాలో జంధ్యా ల రాసిన ఊరగాయ స్త్రోత్రాలు - దండకాలూ, మాయాబజార్ సినిమాలోని పింగళివారు రాసిన గోంగూరోపాఖ్యానాన్ని తల పింప చేస్తాయి.
వేటూరి అంటే జంధ్యాలకు ఆరోప్రాణం అందుకే ఆయన చేత మల్లెపూవు చిత్రంలో కకుమభంజనం స్వాములవారి పాత్ర వేయించి మురిసిపోయారు. అందుకే జంధ్యాల మృతి చెందినపుడు వేటూరు దుఃఖం ఆపుకోలేక జంధ్యాల జీవితం ఎంత చిన్నదైనా.. అది తనకు మనుచరిత్రే అని బాధపడ్డారు. ఒక సభలో బాలు, ఎస్.జానకి, శైలజ ప్రసంగించి శ్రోతల కనుల వెంట నీరు తెప్పిస్తే ఆ సభకే అతిథిగా వచ్చిన జంధ్యాల మైకు ముందుకొచ్చి ఇంత వరకు ‘పాడు’ మనుషులు ముగ్గురొచ్చి కంట తడి పెట్టించారని ప్రసంగం ప్రారంభించగానే సభలో నవ్వులు మార్మోగాయి. శ్రీరమణ మహర్షి వేదాంతం రమణోపనిషత్తులనే గ్రంధ రూపంలో వచ్చినట్లుగానే జంధ్యాల చమత్కారాలు చెణుకులు కూడా ఒక జం ద్యోపనిషత్తు గ్రంథంగా తేవడానికి ఆయన అభిమానులం తా ప్రయత్నిస్తే భేషుగ్గా ఉంటుంది. కాలధర్మాన్ని, జీవనతత్వాన్ని 50ఏళ్ల వయసులో గ్రహించిన జంధ్యాల తృతీయ పురుషార్థాన్ని దాటి వెళ్లిపోయిన మహాజ్ఞాని. ఆయన గుర్తుగా మిగిలినవి హాస్య చిత్రాలు మాత్రమే.
ఇదీ ప్రస్థానం
జంధ్యాల 1951 జనవరి 14(మకర సంక్రాంతి రోజు)న నరసాపురంలో జన్మించారు. విజయవాడలో బీకాం గ్రాడ్యుయేట్‌గా బయటకు వచ్చారు. సిరిసిరి సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. 1983లో జంధ్యాల 12 నెలల వ్యవధిలో 80 సినిమాలకు మాటలు రాశారు. 1984, 87, 1992ల్లో ఆనందభైరవి, పడమటి సంధ్యారా గం, ఆపద్బాంధవుడు చిత్రాలకు ఉత్తమ దర్శక, ఉత్తమ కథ, ఉత్తమ సంభాషణల రచయతగా మూడు సార్లు నంది అవార్డులు పొందారు. రెం డు రెళ్లు ఆరు, ఆపద్బాంధవుడు చిత్రాల్లో నటించారు. చూపులు కలిసిన శుభవేళ, భారతీయుడు, ఇద్దరు, పడమట సంధ్యారాగం, అరుణాచలం, భామనే సత్య భామనే చిత్రాల్లోని కొన్ని ముఖ్య పాత్రలకు డబ్బింగ్ చెప్పారు. 40 చిత్రాలకు దర్శకత్వం వహించారు. భారత ప్రభుత్వం జంధ్యాలను పద్మశ్రీతో సత్కరించింది. సీఏ చదవాలని చెన్నైకు వచ్చి గుమ్మడి ప్రోద్బలంతో సంభాషణలు - కథా రచయితగా అవతారమెత్తారు. ఆత్మాహుతి, గుండెలు మార్చబడును, ఏక్‌దిన్‌కే సుల్తాన్ అనేది జంధ్యాలకు పేరు తెచ్చిన నాటకాలు. ఇందులో ఏక్ దిన్కా సుల్తాన్ పది వేల సార్లు ప్రదర్శితమవడమే కాకుండా, దాని తాలుకూ ముద్రణా ప్రతులు 15 సార్లు పునర్ముద్రణకు నోచుకున్నాయి.