station masters
-
ఇక్కడ టీసీయే ‘మాస్టర్’..!
సాక్షి, ముంబై: సెంట్రల్ రైల్వే పరిధిలో స్టేషన్ మాస్టర్ల కొరత తీవ్రంగా ఉంది. మెయిన్, హార్బర్ మార్గాల్లో ఉన్న 18 స్టేషన్లలో స్టేషన్ మాస్టర్ల పనులను టికెట్ కలెక్టర్లే నిర్వహిస్తున్నారు. ఆయా స్టేషన్లలో అత్యవసర సమస్య వచ్చినప్పుడు ఎదుర్కోవడానికీ, రోజువారీ పర్యవేక్షణకు స్టేషన్ మాస్టర్ లేకపోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మెయిన్ లైన్ స్టేషన్ల అయిన చించ్‌పోక్లీ, కర్రీరోడ్, విద్యావిహార్, కన్జూర్‌మార్గ్ రైల్వే స్టేషన్ల పరీవాహక ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో కార్యాలయాలు ఉన్నాయి. దీంతో ఈ స్టేషన్ల నుంచి వెళ్లే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కాగా, హార్బర్‌లైన్ స్టేషన్లు అయిన డాక్‌యార్డ్ రోడ్, కాటన్గ్రీన్, చున్నాబట్టీ, ఖార్గర్ రైల్వే స్టేషన్లలో కూడా స్టేషన్ మాస్టర్లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రైల్వే స్టేషన్లలో అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు ప్రయాణికులు మొదట స్టేషన్మాస్టర్నే ఆశ్రయిస్తారు. అంతేకాకుండా రైల్వే స్టేషన్ల పరిధిలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు స్టేషన్ మాస్టర్ కీలకపాత్ర పోషిస్తాడు. ప్రయాణికులకు సహకారం అందించడం, అదేవిధంగా అత్యవసర సమయంలో రైళ్లను నిలిపివేయడం వంటి పనులను నిర్వహిస్తూ ఉంటాడు. రైళ్లు నెమ్మదిగా నడవడం, రైళ్లలో, పట్టాల్లో సాంకేతికపరమైన లోపాలు తలెత్తినప్పుడు అందుకు సంబంధించిన నివేదికను స్టేషన్ మాస్టరే తయారుచేయాల్సి ఉంటుంది. అలాగే రెళ్ల రాకపోకల్లో అంతరాయం ఏర్పడితే ప్రయాణికుల సౌకర్యార్థం ఆ విషయాన్ని మైక్‌లో అనౌన్స్ చేయిం చాల్సి ఉంటుంది. ఏదైనా ఘటన జరిగితే రైల్వే పోలీసులను వెంటనే అప్రమత్తం చేసే బాధ్యత కూడా స్టేషన్ మాస్టర్దేనని నేషనల్ రైల్వే యూజర్ కన్సల్టేటివ్ కమిటీ మాజీ సభ్యుడు సుభాష్ గుప్తా తెలిపారు. ప్రస్తుతం టికెట్ క్లర్క్‌లు ఈ విధులను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్టేషన్ మాస్టర్ ఒకరు మాట్లాడుతూ.. స్టేషన్ మాస్టర విధులు నిర్వహిస్తున్న టికెట్ క్లర్క్‌లకు తగిన శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఒక వేళ రైలు పట్టాలు దాటుతున్న సమయంలో రోడ్డు ప్రమాదాలు జరిగినా, సాంకేతిక లోపం తలెత్తినా సంబంధించిన రికార్డులను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ప్రమాదం జరిగిన గంటలో బాధితుడిని ఆస్పత్రికి తరలించాలని, అటువంటి పరిస్థితుల్లో చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందన్నారు. కొన్ని సందర్భాల్లో సమీప రైల్వే స్టేషన్లలో జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన నివేదికలను తయారుచేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తుంటారని, దాంతో తమపై ఒత్తిడి పెరుగుతోందని ఆయన తెలిపారు. కాగా, రైల్వే పరిపాలన విభాగం స్టేషన్ మాస్టర్లను తగ్గించే ప్రయత్నంలో ఉందని ఆల్ ఇండియా స్టేషన్ మాస్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రితీష్ దుబే ఆరోపించారు. సబర్బన్ సెక్షన్లో ప్రతి రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్‌ను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. -
రైల్వే సిబ్బంది.. తప్పిదాలు చేయొద్దు
సేఫ్టీ సెమినార్లో రైల్వే డీఆర్ఎం మిశ్రా పాల్గొన్న కాజీపేట-బల్లార్షా, కొండపల్లి, భువనగిరి అధికారులు కాజీపేట రూరల్, న్యూస్‌లైన్ : రైల్వే సిబ్బంది విధి నిర్వహణలో ఎలాంటి తప్పిదాలు జరగుకుండా వ్యవహరించాలని సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ ఎస్కె.మిశ్రా సూచించారు. కాజీపేట జంక్షన్‌లోని సెమినార్ హాల్లో శుక్రవారం సికింద్రాబాద్ డివిజన్ స్థాయి సేప్టి సమావేశం జరిగింది. ఈ సెమినార్లో కాజీపేట-బల్లార్షా, కొండపెల్లి, భువనగిరి రైల్వే సెక్షన్లలో పనిచేస్తున్న రైల్వే అధికారులు, సూపర్వైజర్లు, రైల్వే గేట్మెన్లు. సీనియర్ సెక్షన్ ఇంజనీర్లు, పాయింట్స్ మెన్లు, స్టేషన్ మాస్టర్లు, డ్రైవర్లు, కీ మెన్లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు హాజరయ్యూరు. ఈ సేఫ్టీ సెమినార్లో సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ ఎస్కె.మిశ్రా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అన్ని విభాగాల వారు అప్రమత్తంగా ఉండి రైల్వే ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు. సమావేశంలో సికింద్రాబాద్ సీనియర్ డీఎస్ఓ మోహన్రాం, డీఈఎన్ సెంట్రల్ నాయక్, డిప్యూటీ సీఎస్ఓ ప్రజాపతి, కాజీపేట ఆర్పీఎఫ్ అదనపు కమిషనర్ విజయ్‌కుమార్, కాజీపేట ఏరియా ఆఫీసర్ కుమార్, స్టేషన్ మేనేజర్ ఓదేలు, ఆర్పీఎఫ్ సీఐ సయ్యద్ ఇక్బాల్ అహ్మద్, జీఆర్పీ ఎస్సై శ్రీనివాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం డీఆర్ఎం మిశ్రా కాజీపేట జంక్షన్ నుంచి సికింద్రాబాద్ వరకు గూడ్స్ రైళ్లో ఫుట్ప్లేటింగ్ తనిఖీ చేస్తూ వెళ్లారని అధికారులు తెలిపారు. డీఆర్ఎంకు రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకుల వినతి కాజీపేటలో రైల్వే కార్మికులు ఎదుర్కొటున్న పలు సమస్యలపై మజ్దూర్ యూనియన్ ఇంజినీరింగ్ బ్రాంచ్ సెక్రటరీ బి. రామనాథం ఆధ్వర్యంలో నాయకులు డీఆర్ఎం మిశ్రాను కలిసి వినతిపత్రం అందజేశారు. రైల్వే క్వార్టర్స్‌లలో సౌకర్యాలు లేవని, నిరుపయోగంగా ఉన్న క్వార్టర్స్‌ను నేలమట్టం చేయకపోవడంతో అందులో అసాంఘిక కార్యాకలాపాలు సాగుతున్నాయ ని, రైల్వే ఆస్పత్రిలో మందుల కొరత ఉందని తదితర సమస్యలను వినతి పత్రంలో పేర్కొన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో నాయకులు ఎ.శ్రీనివాస్, పి.వేదప్రకాష్, ఎన్.సదానందం, నిజాముద్దీన్, జేపీ యాదవ్, ఎన్.కుమారస్వామి ఉన్నారు.