సాక్షి, ముంబై: సెంట్రల్ రైల్వే పరిధిలో స్టేషన్ మాస్టర్ల కొరత తీవ్రంగా ఉంది. మెయిన్, హార్బర్ మార్గాల్లో ఉన్న 18 స్టేషన్లలో స్టేషన్ మాస్టర్ల పనులను టికెట్ కలెక్టర్లే నిర్వహిస్తున్నారు. ఆయా స్టేషన్లలో అత్యవసర సమస్య వచ్చినప్పుడు ఎదుర్కోవడానికీ, రోజువారీ పర్యవేక్షణకు స్టేషన్ మాస్టర్ లేకపోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మెయిన్ లైన్ స్టేషన్ల అయిన చించ్‌పోక్లీ, కర్రీరోడ్, విద్యావిహార్, కన్జూర్‌మార్గ్ రైల్వే స్టేషన్ల పరీవాహక ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో కార్యాలయాలు ఉన్నాయి. దీంతో ఈ స్టేషన్ల నుంచి వెళ్లే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కాగా, హార్బర్‌లైన్ స్టేషన్లు అయిన డాక్‌యార్డ్ రోడ్, కాటన్‌గ్రీన్, చున్నాబట్టీ, ఖార్గర్ రైల్వే స్టేషన్లలో కూడా స్టేషన్ మాస్టర్లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
రైల్వే స్టేషన్లలో అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు ప్రయాణికులు మొదట స్టేషన్‌మాస్టర్‌నే ఆశ్రయిస్తారు. అంతేకాకుండా రైల్వే స్టేషన్ల పరిధిలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు స్టేషన్ మాస్టర్ కీలకపాత్ర పోషిస్తాడు. ప్రయాణికులకు సహకారం అందించడం, అదేవిధంగా అత్యవసర సమయంలో రైళ్లను నిలిపివేయడం వంటి పనులను నిర్వహిస్తూ ఉంటాడు. రైళ్లు నెమ్మదిగా నడవడం, రైళ్లలో, పట్టాల్లో సాంకేతికపరమైన లోపాలు తలెత్తినప్పుడు అందుకు సంబంధించిన నివేదికను స్టేషన్ మాస్టరే తయారుచేయాల్సి ఉంటుంది. అలాగే రెళ్ల రాకపోకల్లో అంతరాయం ఏర్పడితే ప్రయాణికుల సౌకర్యార్థం ఆ విషయాన్ని మైక్‌లో అనౌన్స్ చేయిం చాల్సి ఉంటుంది.
ఏదైనా ఘటన జరిగితే రైల్వే పోలీసులను వెంటనే అప్రమత్తం చేసే బాధ్యత కూడా స్టేషన్ మాస్టర్‌దేనని నేషనల్ రైల్వే యూజర్ కన్సల్టేటివ్ కమిటీ మాజీ సభ్యుడు సుభాష్ గుప్తా తెలిపారు. ప్రస్తుతం టికెట్ క్లర్క్‌లు ఈ విధులను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్టేషన్ మాస్టర్ ఒకరు మాట్లాడుతూ.. స్టేషన్ మాస్టర విధులు నిర్వహిస్తున్న టికెట్ క్లర్క్‌లకు తగిన శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఒక వేళ రైలు పట్టాలు దాటుతున్న సమయంలో రోడ్డు ప్రమాదాలు జరిగినా, సాంకేతిక లోపం తలెత్తినా సంబంధించిన రికార్డులను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ప్రమాదం జరిగిన గంటలో బాధితుడిని ఆస్పత్రికి తరలించాలని, అటువంటి పరిస్థితుల్లో చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందన్నారు.
కొన్ని సందర్భాల్లో సమీప రైల్వే స్టేషన్లలో జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన నివేదికలను తయారుచేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తుంటారని, దాంతో తమపై ఒత్తిడి పెరుగుతోందని ఆయన తెలిపారు. కాగా, రైల్వే పరిపాలన విభాగం స్టేషన్ మాస్టర్లను తగ్గించే ప్రయత్నంలో ఉందని ఆల్ ఇండియా స్టేషన్ మాస్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రితీష్ దుబే ఆరోపించారు. సబర్బన్ సెక్షన్‌లో ప్రతి రైల్వే స్టేషన్‌లో స్టేషన్ మాస్టర్‌ను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇక్కడ టీసీయే ‘మాస్టర్’..!
Published Sat, Sep 13 2014 11:17 PM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM
Advertisement
Advertisement