నిబంధనలు మార్చుకోవచ్చు!
ప్రతిపక్ష హోదాపై నిబంధనలకు సభ
సవరణలు చేయొచ్చు: లోక్‌సభ స్పీకర్
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష హోదా అంశంపై తాను నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నానని స్పీకర్ సుమిత్రా మహాజన్ పేర్కొన్నారు. అవసరమైతే లోక్‌సభలో నిర్ణయించి ఆ నిబంధనలను మార్చుకోవచ్చని వ్యాఖ్యానించారు. నిబంధనల ప్రకారం లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం పదిశాతం సీట్లను సాధించిన పార్టీకి ప్రతిపక్ష హోదా, ఆ పార్టీ ఎంపిక చేసుకున్న సభ్యుడికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి. కానీ ఇటీవలి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 44 స్థానాలను మాత్రమే సాధించగలిగింది.
అయితే ఎన్నికల ముందే ఏర్పాటు చేసుకున్న యూపీఏ కూటమికి మొత్తంగా 56 సీట్లు వచ్చాయని, ఈ మేరకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం స్పీకర్ మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష గుర్తింపునకు సంబంధించి స్పష్టమైన నిబంధనలున్నాయని, దీనిపై తాను న్యాయ సలహా కూడా తీసుకున్నానని మహాజన్ తెలిపారు. గతంలో ఇలాంటి సందర్భాల్లో ప్రతిపక్ష నేత హోదా ఎవరికీ ఇవ్వలేదన్నారు. అవసరమైతే సభా కమిటీని ఏర్పాటు చేసుకుని, సభలో నిబంధనలను మార్చుకోవచ్చన్నారు. కాగా.. లోక్‌పాల్, సీవీసీ, సీఐసీ తదితరుల నియామకాల కోసం ప్రతిపక్షనేత ఉండాలి కదాని ప్రశ్నించగా. ఆ విషయాన్ని ప్రభుత్వం చూసుకుంటుందన్నారు.