Steel Department
-
కేంద్ర ఉక్కు సహాయ మంత్రికి ఉద్యమ సెగ
మహారాణిపేట (విశాఖ దక్షిణ): విశాఖ వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తేకు స్టీల్‌ప్లాంట్ ఉద్యమ సెగ తగిలింది. కులస్తే శనివారం కోల్‌కతా నుంచి విశాఖ మీదుగా విజయవాడ వెళ్లాల్సి ఉంది. విజయవాడకు నేరుగా విమానం లేకపోవడంతో విశాఖలో దిగి, ప్రభుత్వ సర్క్యూట్ హౌస్‌లో విశ్రాంతి తీసుకుని.. సాయంత్రం విమానంలో విజయవాడ వెళ్లేందుకు ఆయన పర్యటన ఖరారైంది. ఉక్కు ఉద్యమకారుల ఆందోళనలతో ఆయన పర్యటనలో మార్పు జరిగింది. ఎన్ఏడీ కొత్తరోడ్డు వద్ద ఓ ప్రైవేట్ హోటల్లోనే ఆయన బస చేశారు. కొద్దిసేపు స్టీల్‌ప్లాంట్ అధికారులు, బీజేపీ నేతలతో ఆయన మాట్లాడారు. అక్కడే విశ్రాంతి తీసుకుని విజయవాడ వెళ్లిపోయారు. సర్క్యూట్ హౌస్ జంక్షన్లో నిరసన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ప్రభుత్వ సర్క్యూట్ హౌస్‌కు వస్తున్న విషయం తెలుసుకున్న అఖిల పక్ష కార్మిక, ప్రజా సంఘాలు, జేఏసీ నాయకులు ఆందోళనకు దిగారు. సిరిపురం జంక్షన్ నుంచి సర్క్యూట్ హౌస్ జంక్షన్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆందోళన చేసిన జేఏసీ నాయకులు, కార్యకర్తలు, సభ్యులను పోలీసులు బలవంతంగా వ్యాన్‌లో ఎక్కించి.. మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, జేఏసీ చైర్మన్ ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ అనేక త్యాగాలతో సాధించిన విశాఖ ఉక్కును అమ్మే హక్కు మోదీ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. -
సాంకేతిక సామర్థ్యంలో విశాఖ స్టీల్‌ప్లాంట్ దిట్ట
విశాఖపట్నం: సాంకేతిక సామర్థ్యంలో విశాఖ స్టీల్‌ప్లాంట్ దిట్టని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారిగా ఆయన శనివారం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్ ఇనుప ఖనిజం కొరతను ఎదుర్కొంటున్నందున ఓఎండీసీ నుంచి తక్కువ ధరలకు సరఫరా చేయడానికి కృషి చేస్తామన్నారు. దీనివల్ల స్టీల్‌ప్లాంట్‌కు లాభం కలుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ఖనిజ సంపన్న రాష్ట్రాలని చెప్పారు. జాయింట్ వెంచర్స్ కోసం, పోటీని ఎదుర్కోవడానికి, సంపద సృష్టికి స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ముందుకు వెళ్లాలని సూచించారు. ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలతో ఎక్కువ ఉపాధి అవకాశాలు, ప్రభుత్వాలకు ఎక్కువ ఆదాయం లభిస్తాయన్నారు. అంతకుముందు ఆయన స్టీల్‌ప్లాంట్‌లోని మోడల్ రూమ్, అవార్డు గ్యాలరీలను సందర్శించారు. వివిధ విభాగాలను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి, విశాఖపట్నం ఎంపీలు డాక్టర్ బి.సత్యవతి, ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, స్టీల్‌ప్లాంట్ సీఎండీ పీకే రథ్, డైరెక్టర్లు కేసీ దాస్, వీవీ వేణుగోపాలరావు, కేకే ఘోష్, ఏకే సక్సేనా, తదితరులు పాల్గొన్నారు. -
సెయిల్ తాత్కాలిక సీఎండీగా స్టీల్ సెక్రటరీ రాకేశ్ సింగ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా) తాత్కాలిక సీఎండీగా స్టీల్ శాఖ కార్యదర్శి రాకేశ్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకూ సీఎండీగా బాధ్యతలు నిర్వహించిన సీఎస్ వర్మ బుధవారం పదవీ విరమణ నేపథ్యంలో రాకేశ్ సింగ్ ఈ బాధ్యతలను చేపట్టినట్లు సెయిల్ గురువారం బీఎస్ఈకి పంపిన ఒక ఫైలింగ్‌లో తెలిపింది. సంస్థ సీఎండీగా కొత్త నియామకం జరిగే వరకూ రాకేశ్ సింగ్ ఈ బాధ్యతలను నిర్వహిస్తారని పేర్కొంది.