అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
విశాఖపట్నం: సాంకేతిక సామర్థ్యంలో విశాఖ స్టీల్‌ప్లాంట్ దిట్టని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారిగా ఆయన శనివారం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్ ఇనుప ఖనిజం కొరతను ఎదుర్కొంటున్నందున ఓఎండీసీ నుంచి తక్కువ ధరలకు సరఫరా చేయడానికి కృషి చేస్తామన్నారు. దీనివల్ల స్టీల్‌ప్లాంట్‌కు లాభం కలుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ఖనిజ సంపన్న రాష్ట్రాలని చెప్పారు.
జాయింట్ వెంచర్స్ కోసం, పోటీని ఎదుర్కోవడానికి, సంపద సృష్టికి స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ముందుకు వెళ్లాలని సూచించారు. ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలతో ఎక్కువ ఉపాధి అవకాశాలు, ప్రభుత్వాలకు ఎక్కువ ఆదాయం లభిస్తాయన్నారు. అంతకుముందు ఆయన స్టీల్‌ప్లాంట్‌లోని మోడల్ రూమ్, అవార్డు గ్యాలరీలను సందర్శించారు. వివిధ విభాగాలను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి, విశాఖపట్నం ఎంపీలు డాక్టర్ బి.సత్యవతి, ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, స్టీల్‌ప్లాంట్ సీఎండీ పీకే రథ్, డైరెక్టర్లు కేసీ దాస్, వీవీ వేణుగోపాలరావు, కేకే ఘోష్, ఏకే సక్సేనా, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment