Stem cell therapy
-
క్యాన్సర్ చికిత్సలు
క్యాన్సర్ చికిత్సలు వయసు, క్యాన్సర్ దశ, గ్రేడింగ్, వారి ఇతర ఆరోగ్య లక్షణాలు ఇలా అనేక విషయాలపై ఆధారపడి ఉంటాయి. కొన్ని క్యాన్సర్లు... మందులకు, రేడియేషన్‌కు అదుపులోకి వస్తే, మరికొందరిలో అవేవీ పనిచేయకపోవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వాటికి సర్జరీ, రేడియేషన్, కీమో థెరపీలతో పాటు హార్మోన్ థెరపీ వంటి వాటికి ప్రాధాన్యం ఉంటుంది. వీటితో పాటు క్యాన్సర్‌కు నేడు సెల్ టార్గెటెడ్ థెరపీ, లేజర్ థెరపీ, మాలిక్యులార్ టార్గెటెడ్ థెరపీ వంటి అనేక కొత్త చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వస్తున్నాయి. క్యాన్సర్‌ను చాలా ఆలస్యంగా అడ్వాన్స్డ్ దశలో కనుగొన్నప్పుడు కొంతవరకు నొప్పీ, బాధ తగ్గడానికి (పాలియేటివ్ కేర్) కూడా ఉపయోగిస్తూ ఉంటారు. క్యాన్సర్ చికిత్స తీసుకునేవారికి గుండె, కిడ్నీలు, కాలేయం పనితీరు సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం. ముందే ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు వారు క్యాన్సర్ మందులు వాడాల్సి వస్తే ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. క్యాన్సర్ చికిత్స జరుగుతున్నప్పుడు ఆ మందుల ప్రభావం వల్ల చుట్టూ ఉండే ఇతర అవయవాల తాలూకు ఆరోగ్యకరమైన కణాలపై ఉండే అవకాశం ఉంది. అందుకే ఆ దుష్ప్రభావాన్ని వీలైనంతగా తగ్గించేందుకు పరిశోధనలు విస్తృతంగా జరుగుతున్నాయి. వాటి ఫలితంగా నేడు క్యాన్సర్ కణాల మీద మాత్రమే పనిచేసే సెల్ టార్గెటెడ్ థెరపీలు, ఇతర అవయవాల మీద ప్రభావం పడకుండా చేసే వీఎమ్‌ఏటీ రేడియేషన్ థెరపీలు, వీలైనంత తక్కువ కోతతో చేయగలిగే కీహోల్ సర్జీల వంటివి అందుబాటులోకి వచ్చాయి. ఇంకా క్యాన్సర్ చికిత్సల గురించి వివరంగా తెలుసుకుందాం. శస్త్రచికిత్స: రక్తానికి సంబంధించిన క్యాన్సర్ తప్పితే మిగతా ఏ క్యాన్సర్‌లోనైనా శస్త్రచికిత్సకు ప్రాధాన్యం చాలా ఎక్కువ. చాలా సందర్భాల్లో క్యాన్సర్‌ను నయం చేయడానికి వీటిని నిర్వహించడంతో పాటు కొన్ని సందర్భాల్లో ముందే క్యాన్సర్ వచ్చే అవకాశాలను తెలుసుకొని, అవి రాకుండా నివారించడానికి కూడా సర్జరీలు చేయాల్సిన సందర్భాలుంటాయి. ఇతర ఏ భాగాలకూ వ్యాపించని దశలో క్యాన్సర్‌ను కనుగొంటే సర్జరీ వల్ల క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. ఈ సర్జరీలను నేడు చాలా చిన్న కోతతోనే, ఒక్కోసారి ఆరోజే రోగి ఇంటికి వెళ్లేలా డే–కేర్ ప్రొసిజర్గా చేయగలుగుతున్నారు. ఆ సందర్భాలివే... ప్రివెంటివ్ సర్జరీ: పెద్దపేగు చివరిభాగం (కోలన్)లో పాలిప్ కనిపించినప్పుడు ఎటువంటి క్యాన్సర్ లక్షణాలు లేకున్నా సర్జరీ చేసి తొలగిస్తారు. కుటుంబ చరిత్రలో రక్తసంబంధీకులకు రొమ్ముక్యాన్సర్ వచ్చిన సందర్భాలు ఎక్కువగా ఉంటే బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 వంటి జీన్ మ్యుటేషన్ పరీక్షలతో క్యాన్సర్ వచ్చే ముప్పును ముందే తెలుసుకొని రొమ్మును (మాసెక్టమీ) తొలగిస్తారు. పాప్‌స్మియర్ పరీక్షలో తేడాలున్నప్పుడు హిస్టరెక్టమీ చేసి గర్భాశయాన్ని తీసివేస్తారు. క్యూరేటివ్ సర్జరీ: క్యాన్సర్‌ను తొలిదశలో కనుగొన్నప్పుడు ముందు రేడియేషన్, కీమో లేదా సర్జరీ తర్వాత ఇతర థెరపీలతో కలుపుకుని, దాన్ని పూర్తిగా నయం చేయడానికి చేసే సర్జరీలివి. ఒక్కోసారి సర్జరీ చేస్తున్నప్పుడే రేడియేషన్ కూడా ఇస్తారు. పాలియేటివ్ సర్జరీ: క్యాన్సర్‌ను చాలా ఆలస్యంగా, చివరి దశలో కనుగొన్నప్పుడు ఆ కణితి పరిమాణాన్ని తగ్గించి, కొంతవరకు ఇబ్బందిని తగ్గించడానికి ఈ సర్జరీలను చేస్తుంటారు. రిస్టోరేటివ్ (రీకన్స్ట్రక్టివ్) సర్జరీ: క్యాన్సర్ చికిత్సలో చేసే సర్జరీలలో క్యాన్సర్ వచ్చిన భాగంతో పాటు, చుట్టూ ఉన్న లింఫ్నోడ్స్నీ, ఇతర కణజాలాన్నీ తొలగిస్తారు. రొమ్ము, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లలో నోటికి సంబంధించిన భాగాల్ని తొలగించినప్పుడు, బాధితుల్లో ఆత్మన్యూనతను నివారించడానికి దేహంలోని ఇతర భాగాల నుంచి కణజాలాన్ని సేకరించి రీకన్స్ట్రక్టివ్ సర్జరీలను చేస్తారు. కీమోథెరపీ: క్యాన్సర్ చికిత్స అనగానే సర్జరీ కంటే కీమోథెరపీకి ఎక్కువగా భయపడుతూ ఉంటారు. వాంతులు, వికారం, బరువు తగ్గడం, అలసట, కనురెప్పలతో పాటు జుట్టంతా రాలిపోవడం... ఇలాంటి లక్షణాలవల్ల కీమో అంటే అందరికీ భయం. ఈ దుష్ప్రభావాలన్నీ కేవలం తాత్కాలికమే. కొత్త టార్గెటెడ్ థెరపీలతో కొంతవరకు సైడ్ఎఫెక్ట్స్ తగ్గినా ఇవి అందరికీ అందుబాటులో లేకపోవడం బాధాకరం. రేడియేషన్ థెరపీ: వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న రేడియేషన్ థెరపీలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వీటివల్ల అరగంటపైగా సాగే చికిత్స ఇప్పుడు కొద్ది నిమిషాల్లోనే పూర్తవుతుంది. కొన్ని కొన్ని క్యాన్సర్‌కు రేడియేషన్‌తో మాత్రమే చికిత్స కొనసాగుతుంది. రోగిని ఏమాత్రం కదిలించకుండా కొనసాగే త్రీ–డైమన్షనల్, స్టిరియోటాక్టిక్, బ్రాకీథెరపీ వంటి అనేక కొత్త చికిత్స వల్ల తక్కువ వ్యవధిలోనే చికిత్స పూర్తవ్వడమే కాకుండా, దుష్ప్రభావాలు కూడా చాలావరకు తగ్గాయి. ఇటీవలి పురోగతితో అధునాతన చికిత్సలు: స్టెమ్‌సెల్ థెరపీ, సర్జరీలలో లేజర్ ఉపయోగించడం, లైట్‌ను ఉపయోగించి చేసే ఫోటో డైనమిక్ థెరపీలు, అతివేడి లేదా అతి చల్లటి ఉష్ణోగ్రతలను ఉపయోగించి చేసే చికిత్సలు, మన రోగనిరోధకశక్తిని బలపరచి క్యాన్సర్ కణాల మీద దాడి చేసేటట్లు చేసే ఇమ్యూనో థెరపీలు, మాలిక్యులార్ టార్గెటెడ్ థెరపీలు క్యాన్సర్ చికిత్స రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాయని చెప్పవచ్చు. -డా. సీహెచ్. మోహన వంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమెగా హాస్పిటల్స్, హైదరాబాద్ ఫోన్ నంబరు 9849022121 -
వైద్య చరిత్రలో మరో అద్భుతం.. ఆమె ఎయిడ్స్‌ను జయించింది!
మానవ వైద్య చరిత్రలో మరో అద్భుతం చోటు చేసుకుంది. తొలిసారి ఒక మహిళకు ఎయిడ్స్ పూర్తిగా నయమైంది. స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (మూలకణ మార్పిడి) చికిత్సతో సదరు మహిళ సంపూర్ణంగా ఎయిడ్స్ కారక హెచ్ఐవీ వైరస్ నుంచి విముక్తి పొందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో మానవ చరిత్రలో ఎయిడ్స్ సంపూర్ణంగా నయమైన మూడో పేషెంట్‌గా, తొలి మహిళా పేషెంట్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. గతంలో ‘బెర్లిన్ పేషెంట్’ గా పిలిచే టిమోతీ రే బ్రౌన్ అనే మగ పేషెంటు 12 ఏళ్ల పాటు హెచ్ఐవీ రెమిషన్ (అంటే యాంటీ వైరల్ మందులు వాడటం ఆపేసినా వైరస్ ప్రబలకపోవడం) పొందాడు. అనంతరం ‘లండన్ పేషెంట్’ అనే ఆడమ్ కాసిల్జో అనే వ్యక్తి 30 నెలల నుంచి హెచ్ఐవీ రెమిషన్‌లో ఉన్నాడు. వీరి తర్వాత ప్రస్తుత మహిళా పేషెంటే హెచ్ఐవీ రెమిషన్ లేదా ఎయిడ్స్ నుంచి ఉపశమనం పొందింది. ఈ కేసు వివరాలను పరిశోధకులు యూఎస్‌లో మంగళవారం జరిగిన సీఆర్‌ఓఐ అనే సదస్సులో వెల్లడించారు. స్టెమ్ సెల్ మార్పిడి అనంతరం ఆమె 14 నెలలుగా ఏఆర్టీ(యాంటీ వైరల్ థెరపీ) తీసుకోవడం లేదని, అయినా ఆమెలో హెచ్ఐవీ వైరస్ కనిపించలేదని వివరించారు. బొడ్డు పేగు మూలకణాలతో మేజిక్ బొడ్డుపేగు నుంచి తీసిన స్టెమ్ సెల్స్‌తో హెచ్‌ఐవీరెమిషన్ సాధ్యమైందని పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధనను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, జాన్స్హాప్కిన్స్ యూనివర్సిటీలకు చెందిన రిసెర్చర్లు ఐఎంపీఏఏసీటీ పీ1107 (ఇంటర్నేషనల్ మాటర్నల్ పీడియాట్రిక్ అడాలసెంట్ ఎయిడ్స్ క్లీనికల్ ట్రయిల్ నెట్వర్క్) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ నెట్‌వర్క్‌ను 2015లో ఆరంభించారు. ఇది హెచ్ఐవీ సోకిన 25మంది పేషెంట్లపై పరిశోధనలు చేసి ఫలితాలు నమోదు చేస్తుంది. ప్రస్తుత ప్రయోగంలో హెచ్ఐవీని జయించిన మహిళ మైలాయిడ్ ల్యుకేమియా (ఒకరకమైన క్యాన్సర్)తో బాధపడుతోంది. ఇదే సమయంలో హెచ్ఐవీ సోకడంతో నాలుగేళ్లుగా ఏఆర్టీ తీసుకుంటోంది. కీమో తెరపీతో ఆమెకు క్యాన్సర్ నుంచి గతంలో ఉపశమనం లభించింది. స్టెమ్‌సెల్ మార్పిడికి ముందు ఏఆర్టీ వల్ల ఆమెలో హెచ్ఐవీ అదుపులోనే ఉంది. 2017లో ఆమె బంధువుల్లో ఒకరు దానం చేసిన మూలకణాలతో బ్లడ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకుంది. ట్రాన్స్‌ప్లాంటేషన్ పూర్తైన 37 నెలలకు ఆమె ఏఆర్టీ కూడా నిలిపివేసింది. అప్ప టి నుంచి ఇప్పటికి 14 నెలలు గడిచిందని, ప్రస్తు తం ఆమెలో ట్రేసబుల్ (గుర్తించదగిన) వైరస్ జాడ లేదని పరిశోధకులు తెలిపారు. పరిమితులున్నాయి.. స్టెమ్‌సెల్ బ్లడ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్స ఖరీదైనది. ఈ చికిత్సలో స్టెమ్‌సెల్స్‌ను అందరూ దానం చేయడం కుదరదు. రక్త కణాల్లో హెచ్ఐవీ వైరస్‌ను బంధించే గ్రాహకాలు(రిసెప్టార్లు) ఉండని వ్యక్తిని దాతగా అంగీకరిస్తారు. అప్పుడు రోగి శరీరంలోకి ఎక్కించిన దాత స్టెమ్‌సెల్స్ నూతన రక్తకణాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ కొత్త కణాలు హెచ్ఐవీ నిరోధకాలుగా ఉంటాయి. దీంతో సదరు రోగిలో క్రమంగా వైరస్ లోడు తగ్గిపోతుంది. అయితే ఈ చికిత్స వల్ల సైడ్ ఎఫెక్టులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా దాత ఇమ్యూనిటీ కణాలు, గ్రహీత ఇమ్యూనిటీ కణాలపై దాడి చేయడం అతిపెద్ద సమస్య. తొలి రెండు చికిత్సల్లో ఈ సమస్య ఎదురైంది. కానీ ఈ దఫా మహిళా పేషెంటులో ఈ సమస్య కనిపించలేదు. దీంతో మరోమారు ఎయిడ్స్‌కు సంపూర్ణ చికిత్సపై ఆశలు పెరిగాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
‘థెరపీ’ ప్రకటనలపై గూగుల్ బ్యాన్
శాన్ప్రాన్సిస్కో: శాస్త్రీయంగా నిర్థారణ కాని వైద్య చికిత్సలకు సంబంధించిన ప్రకటనలపై నిషేధం విధిస్తున్నట్లు సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ శుక్రవారం ప్రకటించింది. స్టెమ్ సెల్ థెరపీ, సెల్యూలార్ థెరపీ, జీన్ థెరపీల వంటి శాస్త్రీయంగా పూర్తిగా నిర్ధారణకాని ప్రయోగాత్మక వైద్య విధానాలకు సంబంధించిన యాడ్లు ఇకపై గూగుల్‌లో కనుమరుగు కానున్నాయని గూగుల్ పాలసీ సలహాదారు ఆడ్రిన్నె బిడ్డింగ్స్ తెలిపారు. బయో మెడికల్, సైంటిఫిక్ ఆధారాలు లేని అన్ని వైద్యవిధానాలు, థెరపీ ప్రకటనల నియంత్రణ కోసం కొత్త పాలసీ తీసుకొచ్చినట్లు ఆమె చెప్పారు. రోగాలతో బాధపడుతున్న వారు ఈ తరహా యాడ్స్ కారణంగా తప్పుదోవ పడుతున్నారని గూగుల్ పేర్కొంది. ఇది మెడికల్ పరిశోధనలను తప్పుబట్టడం కాదని, నిర్థారణ కానటువంటి వాటిపై ఓ కన్నేసి ఉంచడం మాత్రమే అని స్పష్టం చేసింది. దీన్ని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ స్టెమ్ సెల్ రీసెర్చ్ అధ్యక్షుడు దీపక్ శ్రీవత్సవ స్వాగతించారు. సంపూర్ణ చికిత్సా విధానాలుగా అభివృద్ధిగాని ఇలాంటి చికిత్సలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటివి ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయన్నారు. ఇలాంటి సందేశాలను నియంత్రించడంలో ఆన్లైన్ సర్వీసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. -
మూలకణ చికిత్సకు నిమ్స్‌లో ప్రత్యేక విభాగం
రూ. 25 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్: రాష్ట్రంలో మొదటిసారిగా ప్రభుత్వరంగంలో కేన్సర్, కీళ్ల నొప్పులు వంటి మొండి జబ్బులను నయం చేసే మూలకణ చికిత్స నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(నిమ్స్)లో అందుబాటులోకి రానుంది. దీనికోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు కానుంది. మూల కణాలను సేకరించడం, సంబంధిత బంధువులకుగాని, ఇతర రోగులకుగాని ఇచ్చి చికిత్స నిర్వహించడం ఈ విభాగం పని. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక విభాగం ఏర్పాటుకు రూ.25 కోట్లు మంజూరు చేసిందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. మూల కణాల సేకరణ, భద్రత కోసం సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) సహకారం తీసుకోనున్నారు. ఈ మేరకు ఇటీవల సీసీఎంబీతో నిమ్స్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సీసీఎంబీ శాస్త్రవేత్తలు మూలకణాలను సేకరించి భద్రపరిస్తే, వాటితో నిమ్స్ వైద్యులు రోగులకు చికిత్స నిర్వహిస్తారు. నిమ్స్‌లోని ఈ విభాగానికి అధిపతిగా డాక్టర్ నరేంద్ర వ్యవహరిస్తారు. కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో మూలకణ చికిత్సకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుండగా నిమ్స్‌లో రూ.10 లక్షలకే అందుబాటులోకి రానుంది. బోన్‌మ్యారో చికిత్సను ఆరోగ్యశ్రీ రోగులకైతే రూ. 8.7 లక్షలకే చేస్తారు. నిమ్స్‌లో మూలకణ చికిత్స విభాగం మూడు నెలల్లో అందుబాటులోకి రానుంది. ప్రత్యేక విభాగం కోసం నిమ్స్‌లో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఒక అంతస్తును కేటాయించారు. రాష్ట్రంలో రెండు కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రమే మూలకణ చికిత్స అందుబాటులో ఉంది. వివిధ రకాల క్యాన్సర్లతో వచ్చే రోగులకు మూల కణ చికిత్స అత్యంత కీలకమైందని, దీన్ని ప్రభుత్వం రంగంలో తీసుకురావడం అభినందనీయమని నిమ్స్ వర్గాలు చెబుతున్నాయి. -
మూలకణ చికిత్సతో చిన్నారికి ఊపిరి!
సాక్షి, హైదరాబాద్: దేశంలో మూలకణ చికిత్సా విధానంలో తమిళనాడులోని వెల్లూరు సీఎంసీ ఆసుపత్రి వైద్యులు అరుదైన విజయం సాధించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన గొండు మురళి, చాందిని దంపతుల కుమార్తె ప్రణతి (3)కి లుకేమియా (బ్లడ్ కేన్సర్) నుంచి విముక్తి ప్రసాదించారు. రెండేళ్ల క్రితం.. ఏడాది వయసులో ఉన్నప్పుడే అక్యూట్ లింఫోసైటిక్ లుకేమియా(ఏఏఎల్) రూపంలో ప్రా ణాంతక వ్యాధి బారిన పడ్డ ప్రణతికి వారు ఖమ్మం జిల్లాకు చెందిన దాత సాదినేని వెంకటేశ్వరావు నుంచి సేకరించిన మూలకణాలతో 2011 జూలైలో చికిత్స చేశారు. చెన్నైలోని దాత్రి బ్లడ్ స్టెమ్‌సెల్ డోనర్ రిజిస్ట్రీ స్వచ్ఛంద సంస్థ కూడా తోడ్పాటునందించింది. ప్రణతి ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది. మూలకణ చికిత్సకు రోగి లేదా దగ్గరి బంధువుల నుంచే మూలకణాలు సేకరిస్తుంటారు. పరాయి వ్యక్తి మూలకణాలతో ఈ చికిత్స చే యడం దేశంలో ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో మూలకణాల దాత, గ్రహీతలతో కలిసి దాత్రి సీఈవో రఘు రాజగోపాల్ గురువారమిక్కడ తాజ్‌బంజారా హోటల్లో మీడియాతో మాట్లాడారు. ఈ చికిత్సకు 5 నుంచి 8 లక్షల రూపాయల వరకూ ఖర్చవుతుందని తెలిపారు. కాగా ఢిల్లీలోని ఓ బ్లడ్ కేన్సర్ రోగికోసం బసవతారకం కేన్సర్ ఆసుపత్రి వైద్యులు కూడా ఓ దాత నుంచి మూలకణాలు సేకరించి పంపారు.