First woman In The World Reported Cured Of HIV After Stem Cell Transplant - Sakshi
Sakshi News home page

వైద్య చరిత్రలో మరో అద్భుతం.. తొలిసారి ఒక మహిళకు ఎయిడ్స్‌ పూర్తిగా నయం

Published Thu, Feb 17 2022 4:56 AM | Last Updated on Thu, Feb 17 2022 9:00 AM

First woman reported cured of HIV after stem cell transplant - Sakshi

మానవ వైద్య చరిత్రలో మరో అద్భుతం చోటు చేసుకుంది. తొలిసారి ఒక మహిళకు ఎయిడ్స్‌ పూర్తిగా నయమైంది. స్టెమ్‌సెల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ (మూలకణ మార్పిడి) చికిత్సతో సదరు మహిళ సంపూర్ణంగా ఎయిడ్స్‌ కారక హెచ్‌ఐవీ వైరస్‌ నుంచి విముక్తి పొందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో మానవ చరిత్రలో ఎయిడ్స్‌ సంపూర్ణంగా నయమైన మూడో పేషెంట్‌గా, తొలి మహిళా పేషెంట్‌గా ఆమె చరిత్ర సృష్టించింది.

గతంలో ‘బెర్లిన్‌ పేషెంట్‌’ గా పిలిచే టిమోతీ రే బ్రౌన్‌ అనే మగ పేషెంటు 12 ఏళ్ల పాటు హెచ్‌ఐవీ రెమిషన్‌ (అంటే యాంటీ వైరల్‌ మందులు వాడటం ఆపేసినా వైరస్‌ ప్రబలకపోవడం) పొందాడు. అనంతరం ‘లండన్‌ పేషెంట్‌’ అనే ఆడమ్‌ కాసిల్జో అనే వ్యక్తి 30 నెలల నుంచి హెచ్‌ఐవీ రెమిషన్‌లో ఉన్నాడు. వీరి తర్వాత ప్రస్తుత మహిళా పేషెంటే హెచ్‌ఐవీ రెమిషన్‌ లేదా ఎయిడ్స్‌ నుంచి ఉపశమనం పొందింది. ఈ కేసు వివరాలను పరిశోధకులు యూఎస్‌లో మంగళవారం జరిగిన సీఆర్‌ఓఐ అనే సదస్సులో వెల్లడించారు. స్టెమ్‌ సెల్‌ మార్పిడి అనంతరం ఆమె 14 నెలలుగా ఏఆర్‌టీ(యాంటీ వైరల్‌ థెరపీ) తీసుకోవడం లేదని, అయినా ఆమెలో హెచ్‌ఐవీ వైరస్‌ కనిపించలేదని వివరించారు.

బొడ్డు పేగు మూలకణాలతో మేజిక్‌
బొడ్డుపేగు నుంచి తీసిన స్టెమ్‌ సెల్స్‌తో హెచ్‌ఐవీరెమిషన్‌ సాధ్యమైందని పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధనను యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, జాన్స్‌హాప్‌కిన్స్‌ యూనివర్సిటీలకు చెందిన రిసెర్చర్లు ఐఎంపీఏఏసీటీ పీ1107 (ఇంటర్నేషనల్‌ మాటర్నల్‌ పీడియాట్రిక్‌ అడాలసెంట్‌ ఎయిడ్స్‌ క్లీనికల్‌ ట్రయిల్‌ నెట్‌వర్క్‌) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ నెట్‌వర్క్‌ను 2015లో ఆరంభించారు. ఇది హెచ్‌ఐవీ సోకిన 25మంది పేషెంట్లపై పరిశోధనలు చేసి ఫలితాలు నమోదు చేస్తుంది.

ప్రస్తుత ప్రయోగంలో హెచ్‌ఐవీని జయించిన మహిళ మైలాయిడ్‌ ల్యుకేమియా (ఒకరకమైన క్యాన్సర్‌)తో బాధపడుతోంది. ఇదే సమయంలో హెచ్‌ఐవీ సోకడంతో నాలుగేళ్లుగా ఏఆర్‌టీ తీసుకుంటోంది. కీమో తెరపీతో ఆమెకు క్యాన్సర్‌ నుంచి గతంలో ఉపశమనం లభించింది. స్టెమ్‌సెల్‌ మార్పిడికి ముందు ఏఆర్‌టీ వల్ల ఆమెలో హెచ్‌ఐవీ అదుపులోనే ఉంది. 2017లో ఆమె బంధువుల్లో ఒకరు దానం చేసిన మూలకణాలతో బ్లడ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకుంది. ట్రాన్స్‌ప్లాంటేషన్‌ పూర్తైన 37 నెలలకు ఆమె ఏఆర్‌టీ కూడా నిలిపివేసింది. అప్ప టి నుంచి ఇప్పటికి 14 నెలలు గడిచిందని, ప్రస్తు తం ఆమెలో ట్రేసబుల్‌ (గుర్తించదగిన) వైరస్‌ జాడ లేదని పరిశోధకులు తెలిపారు.

పరిమితులున్నాయి..
స్టెమ్‌సెల్‌ బ్లడ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చికిత్స ఖరీదైనది. ఈ చికిత్సలో స్టెమ్‌సెల్స్‌ను అందరూ దానం చేయడం కుదరదు. రక్త కణాల్లో హెచ్‌ఐవీ వైరస్‌ను బంధించే గ్రాహకాలు(రిసెప్టార్లు) ఉండని వ్యక్తిని దాతగా అంగీకరిస్తారు. అప్పుడు రోగి శరీరంలోకి ఎక్కించిన దాత స్టెమ్‌సెల్స్‌ నూతన రక్తకణాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ కొత్త కణాలు హెచ్‌ఐవీ నిరోధకాలుగా ఉంటాయి. దీంతో సదరు రోగిలో క్రమంగా వైరస్‌ లోడు తగ్గిపోతుంది. అయితే ఈ చికిత్స వల్ల సైడ్‌ ఎఫెక్టులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా దాత ఇమ్యూనిటీ కణాలు, గ్రహీత ఇమ్యూనిటీ కణాలపై దాడి చేయడం అతిపెద్ద సమస్య. తొలి రెండు చికిత్సల్లో ఈ సమస్య ఎదురైంది. కానీ ఈ దఫా మహిళా పేషెంటులో ఈ సమస్య కనిపించలేదు. దీంతో మరోమారు ఎయిడ్స్‌కు సంపూర్ణ చికిత్సపై ఆశలు పెరిగాయి.
– నేషనల్‌ డెస్క్, సాక్షి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement